ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లేపిన టీమిండియా
ICC ODI Rankings: పాకిస్థాన్‌తో జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత రోహిత్ సేన మళ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది.
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా... వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత రోహిత్ సేన మళ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన అహ్మదాబాద్‌లో చిరకాల ప్రత్యర్థిపై చిరస్మరణీయ విజయంతో భారత జట్టు ICC వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ లేపింది. ప్రపంచకప్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి బలమైన జట్లపై విజయం సాధించిన భారత జట్టు అద్భుతమైన ఫామ్‌తో ఇరగదీస్తోంది.
భారత్‌పై ఘోర పరాజయం చవిచూసినప్పటికీ పాకిస్తాన్ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో ఉంది. వరుస పరాజయాలతో ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆస్ట్రేలియా.. వన్డే ర్యాంకింగ్స్‌లోనూ దిగజారి నాలుగో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ ఐదు స్థానంలో ఉండగా.. ప్రపంచకప్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఆరో స్థానంలో ఉంది. కొన్ని వారాలుగా వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి స్థానం కోసం టీమిండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తీవ్ర పోరు నెలకొని ఉంది. అయితే ప్రపంచకప్‌లో అదిరిపోయే ఆటతో పాక్, కంగారులను వెనక్కి నెట్టి రోహిత్ సేన అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించి ఊపు మీదుంది. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. ప్రస్తుతానికి భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కానీ మంచి నెట్ రన్‌రేట్‌ను సాధించింది. 1999 తర్వాత ఆస్ట్రేలియా ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే మొదటి సారి.
భారత్ తరఫున కేఎల్ రాహుల్ (97 నాటౌట్: 115 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (85: 116 బంతుల్లో, ఆరు ఫోర్లు) జట్టును విజయ పథం వైపు నడిపించారు.
రెండో మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా కేవలం 35 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని అందుకుంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (131: 84 బంతుల్లో, 16 ఫోర్లు, ఐదు సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా హిట్ మ్యాన్‌కే లభించింది. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (55 నాటౌట్: 56 బంతుల్లో, ఆరు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు.
చిరకాల ప్యతర్థి పాక్‌పై మూడో విజయం సాధించిన టీమిండియా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కనీసం 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది.టీమిండియా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. పాకిస్థాన్ నిర్దేశించిన 192 స్వల్ప పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 30.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (86) పరుగులతో చెలరేగాడు.