(Source: ECI/ABP News/ABP Majha)
SA vs SL WC 2023: ముగ్గురు బ్యాటర్లు శతకాల మోత - వన్డే వరల్డ్ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా అత్యధిక స్కోరుతో రికార్డ్
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా దంచికొట్టి.. మెగాటోర్నీ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది.
ఆహా ఏమా కొట్టుడు.. ఏమా బాదుడు! ప్రపంచకప్ ప్రారంభమై మూడు రోజులైనా.. పెద్దగా మెరుపులు లేకుండా సాగుతున్న దశలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు.. వీరంగమాడారు! బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్న రీతిలో.. లంకేయులను ఊచకోత కోశారు. విజృంభణ, విధ్వంసం, పరుగుల సునామీ ఇలా ఉపమానాలన్నీ చిన్నబోయేలా సఫారీ ప్లేయర్లు.. ఢిల్లీలో శివతాండవమాడారు. ఫలితంగా వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుకు దక్షిణాప్రికా రికార్డుల్లోకెక్కింది. 1975లో ప్రారంభమైన ఈ మెగాటోర్నీలో.. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా (417) పేరిట ఉన్న రికార్డును శ్రీలంకతో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బద్దలు కొట్టింది. శనివారం లంకతో జరుగుతున్న పోరులో బవుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. విశ్వసమరంలో ఇదే అత్యధిక స్కోరు కాగా.. 2015 వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్థానప్‌పై ఆస్ట్రేలియా చేసిన 417 పరుగుల స్కోరు రెండో స్థానానికి చేరింది. 2007 ప్రపంచకప్‌లో బెర్ముడాపై భారత్ చేసిన 413 పరుగుల స్కోరు మూడో స్థానంలో ఉంది.
ఓపెనర్ క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్‌రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ బవుమా 8 పరుగులకే ఔటైనా.. డికాక్, డసెన్ రెండో వికెట్‌కు 204 పరుగులు జతచేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. అప్పటికే భారీ స్కోరు ఖాయమైపోగా.. మిడిలార్డర్‌లో బరిలోకి దిగిన ఎయిడెన్ మార్క్‌రమ్ విశ్వరూపం చూపాడు.చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (20 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (21 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దుమ్మురేపడంతో దక్షిణాఫ్రికా కొండంత స్కోరు చేసింది. చూస్తున్నది లైవ్ మ్యాచా.. లేక హైలైట్సా అన్న చందంగా మార్క్‌రమ్ వీర బాదుడు బాదాడు. బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్నట్లు చెలరేగిపోయాడు. ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంలా కనిపించగా.. చిన్న బౌండ్రీలను తమకు అనుకూలంగా మలుచుకున్న సఫారీలు స్టాండ్స్‌నే లక్ష్యంగా చేసుకొని వీరంగం సృష్టించారు. పేసర్, స్పిన్నర్ అనే తేడా లేకుండా.. విధ్వంసకాండ రచించడంతో.. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డు బద్దలైంది.
లంక బౌలర్లలో మధు షనక 2 వికెట్లు పడగొట్టగా.. వెల్లలాగె, కసున్ రజిత చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ ముగ్గురితో సహా.. మిగిలిన బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. డికాక్, డసెన్, మార్క్‌రమ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు సెంచరీలు బాదారు. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. మెగాటోర్నీల్లో చోకర్స్‌గా ముద్రపడ్డ సఫారీలు.. ఈ సారి తమ పై పడ్డ ముద్ర చెరిపేసుకునే దిశగా ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపారు.
మార్క్‌రమ్ రికార్డు సెంచరీ..
వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదైన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్.. మరో ఘనత తన పేరిట రాసుకున్నాడు. ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్‌గా మార్క్‌రమ్ నిలిచాడు. శ్రీలంకతో పోరులో 29 ఏండ్ల మార్క్‌రమ్ 49 బంతుల్లో మూడంకెల స్కోరు దాటాడు. గతంలో ఈ రికార్డు ఐర్లాండ్ ప్లేయర్ కెవిన్ ఓబ్రైన్ (50 బంతుల్లో) పేరిట ఉంది. భారత్‌లోనే జరిగిన 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ లో ఓబ్రైన్ ఈ ఫీట్ నమోదు చేయగా.. తాజాగా ఢిల్లీ వేదికగా లంకేయులపై మార్క్‌రమ్ నయా చరిత్ర లిఖించాడు.