Hardik Pandya: ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న, హార్దిక్ పాండ్యా భావోద్వేగ ట్వీట్
ODI World Cup 2023: ప్రపంచకప్‌లోనిమిగతా మ్యాచ్‌లకు దూరం కావడంపై హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. వరల్డ్ కప్ కి దూరం కావటాన్ని జీర్ణించుకోలేక అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.
చీలమండ గాయంతో బాధపడుతున్న భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. హార్దిక్ పాండ్యా స్థానంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకునేందుకు అవకాశమిచ్చినట్టు ICC తెలిపింది. పాండ్యా స్థానాన్ని ప్రసిద్ధ్ కృష్ణతో భర్తీ చేయడానికి వసీం ఖాన్ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపినట్లు ICC వెల్లడించింది. హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ నేరుగా కొట్టిన బంతిని ఆపే క్రమంలో హార్దిక్ కాలికి బంతి బలంగా తాకింది. ఈ క్రమంలో అతడి చీలమండకు గాయమైంది. నొప్పితో విలవిలాడిన హార్దిక్ పాండ్యా వెంటనే మైదానాన్ని వీడాడు. మొదట పాండ్యాకు . పెద్ద గాయం కాలేదని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. కానీ ఇప్పుడు అతడు ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు.
ప్రపంచకప్‌లోనిమిగతా మ్యాచ్‌లకు దూరం కావడంపై హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. వరల్డ్ కప్ మొత్తానికి దూరం కావటాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. ప్రపంచకప్‌లో మిగతా మ్యాచ్‌లను దూరమవుతున్నాననే ఈ కఠిన వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్న పాండ్యా.. జట్టుకు దూరమైనా నా మనసంతా అక్కడే ఉంటుందన్నాడు. ప్రతి మ్యాచ్‌లో, ప్రతి బంతికీ వారిని ప్రోత్సహిస్తూనే ఉంటానని అన్నాడు. తన కోసం ప్రార్థించిన అందరికీ పాండ్యా ధన్యవాదాలు తెలిపాడు. మీరు చూపించిన ప్రేమ, మద్దతు అనిర్వచనీయమని.. మన జట్టు చాలా ప్రత్యేకమని, కచ్చితంగా అందరినీ గర్వపడేలా చేస్తుందని అన్నాడు. ఈ వరల్డ్ కప్‌లో హార్దిక్ ఐదు వికెట్లు తీశాడు. కీలక సమయాల్లో వికెట్ తీసి భారత్‌కు బ్రేక్ ఇస్తూ వచ్చాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కేవలం మూడు బంతులే వేసి గాయపడిన సంగతి తెలిసిందే.
హార్దిక్ పాండ్యా గాయంతో దూరమవ్వడం కీలక సమయంలో రోహిత్ సేనకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే. ఎందుకంటే భారత జట్టులో ఉన్న నాణ్యమైన పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక్కడే. బ్యాట్‌తోనే కాక బంతితోనూ పాండ్యా తన వంతు పాత్రను సమర్థంగా పోషించగలడు. వికెట్ల త్వరగా పడితే నిలబడి సమర్థంగా ఆచితూచి ఆడే సామర్థ్యంతో పాటు చివర్లో విధ్వంసకర బ్యాటింగ్ చేయగల సత్తా పాండ్యా సొంతం. బౌన్సర్లతో బ్యాటర్లను పాండ్యా ముప్పుతిప్పలు కూడా పెట్టగలడు. టీమిండియాలో ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగితే మూడో సీమర్ పాత్రను పాండ్యా నిర్వర్తించి జట్టు సమతుల్యతను కాపాడుతాడు. కానీ ఇప్పుడు జట్టు సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. లీగ్ మ్యాచుల్లో భారత్ సాధికార విజయాలు సాధించడంతో అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా నాకౌట్‌లో పరిస్థితి అలా ఉండకపోవచ్చు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాండ్యా సమర్థంగా ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి మెగా టోర్నీలో ఆల్‌రౌండర్‌గా జట్టుకు పాండ్యా సేవలు చాల ముఖ్యమన్నది నిర్వివాద అంశం. లీగ్ దశలో టీమిండియా రెండు నామమాత్రపు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అయితే, సెమీస్‌లో మాత్రం హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆల్‌రౌండర్ సేవలు కోల్పోవడం అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. ఫీల్డింగ్‌లో కూడా పాండ్యా చాలా చురుగ్గా కదులుతాడు. ఇవన్నీ టీమిండియాపై ప్రభావం చూపే అవకాశం స్పష్టం కనిపిస్తుంది.