Gautam Gambhir: లక్నోకు ఇక సెలవు, మళ్లీ కోల్‌కత్తా గూటికి గంభీర్
Kolkata Knight Riders: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ IPLలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో రెండేళ్ల అనుబంధాన్ని తెంచుకున్నాడు. తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తిరిగి చేరాడు.
టీమిండియా(Team India) మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir) IPLలో లక్నో సూపర్ జెయింట్స్( Lucknow Super Giants) జట్టుతో రెండేళ్ల అనుబంధాన్ని తెంచుకున్నాడు. లక్నో జట్టుకు రెండేళ్ల నుంచి గంభీర్ మెంటర్‌గా ఉంటున్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ పదవికి రాజీనామా చేసిన గంభీర్.. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)తో తిరిగి చేరాడు. ఈ విషయాన్ని గంభీర్ అధికారికంగా ప్రకటించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొన్నాళ్లు నాయకత్వం వహించిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో జట్టును IPL ఛాంపియన్‌గా నిలిపాడు. కొన్నాళ్లపాటు అదే జట్టుకు మెంటార్‌గా పని చేశాడు. రెండేళ్ల కిందట KKRని వదిలి కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటర్‌గా నియమితుడయ్యాడు. ఇప్పుడు తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. గంభీర్ మార్గనిర్దేశంలో లక్నో 2022లో ఫైనల్‌కు చేరగా.. 2023లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
లక్నో సూపర్ జెయింట్స్‌తో తన రెండేళ్ల అద్భుతమైన ప్రయాణం ముగిసిందని ప్రకటిస్తున్నానని గంభీర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ రెండు సంవత్సరాల ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసిన ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాని గంభీర్ భావోద్వగ పోస్ట్ పెట్టాడు. తనకు మద్దతుగా నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ యజమాని డా.సంజీవ్ గోయెంకాకు గంభీర్ ధన్యవాదాలు తెలిపాడు. లక్నో జట్టు భవిష్యత్తులో అద్భుతాలు చేస్తుందని, ప్రతి అభిమానిని గర్వించేలా చేస్తుందని అనుకుంటున్నానని గంభీర్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ పదవికి రాజీనామా చేసినట్లు గౌతం గంభీర్ ప్రకటించిన అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం.. గంభీర్‌ను తమ మెంటర్‌గా నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఎక్కడైతే మొదలెట్టానో మళ్లీ అక్కడికే చేరానంటూ గంభీర్ పోస్ట్ చేశాడు. ఐ యామ్ బ్యాక్, ఐ యామ్ హంగ్రీ అంటూ KKR జెర్సీతో ఉన్న ఫోటోను గంభీర్ ట్వీట్‌కు జతచేశాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో కలవనున్నట్లు గంభీర్ ప్రకటించడాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుక్ ఖాన్ స్వాగతించారు. గౌతం గంభీర్ ఎప్పటికీ తమ కుటుంబంలో ఒకడన్న షారూక్.. తమ కెప్టెన్ మరో అవతారంలో తమతో చేరుతున్నాడంటూ ట్వీట్ చేశాడు. హెడ్ కోచ్ చంద్రకాంత్‌తో కలిసి గౌతీ అద్భుతాలు సృష్టిస్తాడని షారూఖ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ వ్యవహరిస్తున్నారు. అభిషేక్ నాయర్ ఆసిస్టెంట్ కోచ్‌గా, భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు. ర్యాన్ టెన్ డస్కాటే ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు 2021లో ఫైనల్ చేరిన కోల్‌కతా నైట్‍రైడర్స్.. చెన్నై చేతిలో ఓటమి పాలైంది. గత రెండు సీజన్‌లలోనూ ఏడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే వచ్చే సీజన్‌లో కప్ కొట్టాలని కేకేఆర్ పట్టుదలగా ఉంది.
ప్రపంచకప్ ఫైనల్‌లో ఓ ఆటగాడి తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ విమర్శలు గుప్పించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా తరుఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన రాహుల్ ఆటతీరుపై గంభీర్ పెదవి విరిచాడు. గౌతం గంభీర్ ఇండియన్ బ్యాటర్ల ఆటతీరుపై మండిపడుతున్నాడు. మధ్య ఓవర్లలో వీలైనన్ని బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు. రిస్క్ అయినప్పటికీ టీమిండియా బ్యాటర్లు ఆ సాహసం చేయాల్సిందని అన్నాడు.