Viral Photo: శాంటాక్లజ్ వేషంలో ఎంఎస్ ధోనీ.. భార్య, బిడ్డతో క్రిస్మస్ సంబరాలు.. క్షణాల్లో వైరలైన ఫొటో
Ms Dhoni News: ఫ్యాన్స్ కు ధోనీ క్రిస్ మస్ కానుకను అందించాడు. తాజాగా శాంటాక్లజ్ రూపంలో ఉన్న ఫొటోనే షేర్ చేశాడు. ఈ ఫొటో క్షణాల్లో వైరలైంది.
Dhoni Christmas Celebrations: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్.. క్రిస్ మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. శాంటాక్లజ్ వేషధారణలో అతను దర్శనిమచ్చాడు. తాజాగా తన భార్య సాక్షి సింగ్ ధోనీ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ పోస్టు షేర్ చేసిన వెంటనే వైరలైంది. కేవలం రెండు గంటల్లోనే ఐదు లక్షలకు పైగా లైకులను నమోదు చేసింది. ప్రస్తుతం ఏడు లక్షలకు దగ్గరలో లైకులున్నాయి. ఆరువేలమందికి పైగా ఈ పోస్టుపై కామెంట్లు చేశారు. నిజానికి ఈ పోస్టులో ఉన్న ఫొటోలో శాంటక్లాజ్ వేషధారణతోపాటు తెల్లని గుబురుగడ్డాన్ని ధరించడంతో ధోనీ ఫొటో అంతగా కన్పించడం లేదు. అయితే అతను ధరించిన టోపీపై మహీ అని ఉండటంతో అభిమానులు ఈజీగా గుర్తించారు.
View this post on Instagram
బిడ్డను జీవాతో ధోనీ..
ఇక ఈ ఫొటోలో తన బిడ్డ జీవా.. ధోనిని హత్తుకుని కనిపించింది. అలాగే పక్కనే కలర్ఫుల్ డ్రెస్ తో సాక్షి కూడా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మరోవైపు 2019 వన్డే ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినా కూడా ధోనీ క్రేజ్ కు ఏమాత్రం ఢోకా లేకుండా పోయింది. ఇప్పటికీ తనపై ఉన్న అభిమానం చెక్కు చెదరలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐదేళ్లు గడిచినప్పటికీ, భారత క్రికెట్ చేసిన సేవ, అందించిన ఐసీసీ టైటిళ్లను ఫ్యాన్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా నెమరేసుకుంటారు. 2007లో ధోనీ నాయకత్వంలో భారత్ తొలిసారి టీ20 ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. అలాగే దాదాపు 28 ఏళ్ల తర్వాత 2011లో సొంతగడ్డపై నిర్వహించిన వన్డే ప్రపంచకప్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక 2013లో ఇంగ్లాండ్ గడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫిని భారత్ దక్కించుకుంది. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ రూపంలో ఒక ఐసీసీ టైటిల్ ను భారత్ సాధించగలిగింది.
సీఎస్కే తరపున ధోనీ..
అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైనా, ఐపీఎల్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ధోనీ కనువిందు చేస్తున్నాడు. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోనీ బరిలోకి దిగనున్నాడు. ఐదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాళ్లను అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా పరిగణిస్తుండటంతో ధోనీ ఈసారి సీఎస్కేకు అన్ క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగుతున్నాడు. కేవలం రూ.4 కోట్లకే ధోనీని సీఎస్కే రిటైన్ చేసుకుంది. మరోవైపు సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్ ను చేసిన ధోనీ.. సారథ్య బాధ్యతలను విధ్వంసక ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. రుతురాజ్, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలను సీఎస్కే రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గతనెలలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రలతోపాటు దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లను సీఎస్కే దక్కించుకున్న సంగతి తెలిసిందే. వచ్చే మార్చిలో ఐపీఎల్ 2025 ప్రారంభమవుతుంది.