Asia Cup 2025 Latest Updates: ఇంగ్లాండ్ టూర్లో ఆదరగొట్టిన టీమిండియా ప్లేయర్లు.. ఆసియా కప్ కు డౌటే..! ఇంతకీ ఆ ప్లేయర్లు ఎవరంటే..?
ఆసియా లెవల్లో ఉత్తమ క్రికెట్ జట్టును నిర్దారించడానికి ఆసియా కప్ నిర్వహిస్తారు. ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్ లో జరుగుతుంది. డిఫెండింగ్ చాంపియన్, టైటిల్ ఫేవరెట్ గా ఇండియా బరిలోకి దిగుతోంది.

Asia Cup News: ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్ అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 2-2తో సిరీస్ సమం చేయడంతోపాటు సిరీస్ లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓవరాల్ గా 33 సెషన్లలో భారత్ ఆధిక్యం దక్కించుకోగా. ఇంగ్లాండ్ కేవలం 21 సెషన్లకే పరిమితమైంది. మరో 18 సెషన్లలో ఇరుజట్లు ఉమ్మడిగా ఆధిక్యంలో నిలిచాయి. అయితే ఈ సిరీస్ లో విశేషంగా రాణించిన కొంతమంది భారత స్టార్లు వచ్చే నెల నుంచి జరగబోయే ఆసియాకప్ లో ఆడటం లేదు. అందుకు గల కారణాలు.. ఆ ప్లేయర్లేవరో ఓ లుక్కేద్దామా..?
జస్ ప్రీత్ బుమ్రా..
వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఇంగ్లాండ్ పై 3 టెస్టులు మాత్రమే ఆడిన బుమ్రా.. 14 వికెట్లతో రాణించాడు. తనను మెయిన్ గా టెస్టులకు, అదికూడా ముఖ్యమైన సిరీస్ లలోనే ఆడిస్తుండటంతో టీ20 ఫార్మాట్ లో జరుగుతున్న ఆసియాకప్ కు తను దూరమయ్యే అవకాశముంది.
శుభమాన్ గిల్..
హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ శకం మొదలయ్యాక, టీ20లలో యువరక్తంతో ఉరకెలెత్తుతోంది. ఈ క్రమంలో భారత టెస్టు కెప్టెన్ శుభమాన్ గిల్ కు ఓపెనింగ్ పొజిషన్ లో చోటు దక్కడం లేదు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ కుదురుకోవడంతో ఫస్ట్ చాయిస్ ఓపెనర్లుగా వారినే ఆడిస్తున్నారు. కాస్త స్లోగా ఆడే గిల్.. టీ20 ప్రణాళికల్లో ప్రస్తుతానికి లేడు. అలాగే దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ కు తను కెప్టెన్ గా ఎన్నికవడంతో ఆసియాకప్ నుంచి తను తప్పుకోక తప్పదు.
యశస్వి జైస్వాల్..
తను కూడా ఓపెనర్ కాబట్టి, ప్రస్తుతానికి ఓపెనింగ్ పొజిషన్ లో ఖాలీ లేకపోవడంతో తను ఆసియా కప్ లో ఆడలేడు. అలాగే తను వెస్ట్ జోన్ కు ఎంపికవడంతోపాటు దులీప్ ట్రోఫీలో ఆడటంతో జైస్వాల్ ఆసియా కప్ ను మిస్సవ్వక తప్పదు.
కేఎల్ రాహుల్..
2022 ప్రపంచకప్ తర్వాత టీ20 జట్టులో రాహుల్ అంతగా ఆడటం లేదు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ ఆడుతుండటంతో తనకు చాన్స్ దొరకడం లేదు. అలాగే రిజర్వ్ లుగా ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ ఉండటంతోపాటు వయసు పైబడటం కూడా రాహుల్ ను ఈ ఫార్మాట్ కు దూరం చేస్తోంది. అయితే ఐపీఎల్లో తను ఈ ఏడాది 500+కుపైగా పరుగులు సాధించాడు.
రిషభ్ పంత్..
ఇంగ్లాండ్ పర్యటనలో పాదం గాయంతో ఐదో టెస్టుకు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ .. ఆసియా కప్ కు కూడా దూరమవడం ఖాయం. అయితే గత కొంతకాలంగా తను టీ20 ప్రణాళికల్లో లేడు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా సంజూ ఉండటంతో పంత్ కు చాన్స్ దక్కడం లేదు. అయితే టెస్టుల్లో మాత్రం పంతే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో పేలవ ఫామ్ రిత్యా, కొంతకాలంపాటు టీ20ల్లో జాతీయ జట్టు తరపున చోటు దక్కక పోవచ్చు.




















