Shubman Gill: అహ్మదాబాద్‌లో తోపు - అవతల అట్టర్ ప్లాఫు - గిల్ గిల్లుడంతా ఇండియాలోనేనా?
రెండు నెలల క్రితం ‘ఫ్యూచర్ ఇండియా స్టార్’గా కీర్తించబడ్డ టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కుంటున్నాడు.
Shubman Gill: భారత క్రికెటర్లలో చాలామంది ఆటగాళ్లను ‘స్వదేశంలో పులులు విదేశాల్లో పిల్లులు’ అని అంటుంటారు విశ్లేషకులు. స్పిన్, ఫ్లాట్ పిచ్‌లపై వీర విధ్వంసాలు సృష్టించే మన వీరులు.. విదేశీ పిచ్‌ల మీద మాత్రం బొక్క బోర్లా పడతారు. గతంలో ఇలా చాలా మంది వచ్చినా తాజాగా టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కూడా ఇదే నానుడిని మరోసారి నిరూపిస్తున్నాడు. ఈ ఏడాది స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో పాటు ఐపీఎల్ కూడా దుమ్ము దులిపిన ఈ పంజాబ్ కుర్రాడు.. విదేశాలలో మాత్రం అట్టర్ ప్లాఫ్ అవుతున్నాడు.
అప్పుడు అన్‌స్టాపబుల్..
గతేడాది శిఖర్ ధావన్ సారథ్యంలో నిలకడైన ప్రదర్శనలతో ఈ ఏడాది టీమిండియా ప్రధాన జట్టులోకి వచ్చాడు గిల్. జనవరిలో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ సిరీస్‌లో 70, 21, 116 పరుగులు సాధించాడు. ఆ వెంటనే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో కూడా పరుగుల వరద పారించాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో ఏకంగా డబుల్ సెంచరీ (208) కూడా చేశాడు. రెండో వన్డేలో 40, ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో సెంచరీ (112) సాధించాడు. న్యూజిలాండ్‌తోనే మూడో టీ20లో 126 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో శతకం (128) బాదాడు.
ఈ ఏడాది టెస్టు, వన్డే, టీ20లలో సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచిన గిల్.. ఐపీఎల్‌లో కూడా రెచ్చిపోయి ఆడాడు. 2023 ఐపీఎల్‌లో.. 17 మ్యాచ్‌లలోనే ఏకంగా 890 పరుగులతో చెలరేగాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలూ ఉన్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడిన మ్యాచ్‌లలో గిల్.. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. అతడు చేసిన 890 రన్స్‌లో సుమారు 60 శాతం అక్కడ చేసినవే కావడం గమనార్హం.
వైఫల్యాల బాట..
గిల్ దూకుడు చూసి ‘ఫ్యూచర్ స్టార్’, ‘కోహ్లీ వారసుడు’, క్రికెట్‌లో నెక్స్ట్ బిగ్ థింగ్ అన్న బిరుదులు వచ్చాయి. ఇక గిల్‌కు ఎదురేలేదన్న అభిప్రాయాలూ వెల్లువెత్తాయి. కానీ గిల్ గిల్లుడంతా అహ్మదాబాద్, ఇండియాలోని ఫ్లాట్ పిచ్‌ల మీదే అని తేలిపోతున్నది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్‌లోని ‘ది ఓవల్’ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌లలో 13, 18 పరుగులు మాత్రమే చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు కదా అని సర్ది చెప్పుకుని గిల్ వైఫల్యాలను పక్కనబెట్టినా వెస్టిండీస్‌లో కూడా మనోడి ఆట ఏమంత గొప్పగా లేదు. విండీస్‌తో తొలి టెస్టులో ఆరు పరుగులే చేసిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్.. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 39 (10, 29) పరుగులే చేశాడు. తాజాగా వన్డే సిరీస్‌లో భాగంగా నిన్న ముగిసిన తొలి వన్డేలో కూడా ఏడు పరుగులకే నిష్క్రమించి నిరాశపరిచాడు.
SHUBMAN GILL
— DHONIverse 🇮🇳 (@91_wankhede) July 27, 2023
Average in Ahmedabad
In T20i - 126
In Tests - 128
In IPL - 66.9
Average outside Ahmedabad
In T20i - 16
In Tests - 27
In IPL - 27.90 pic.twitter.com/d1vuvNJVcd
Give me freedom
— 🏆×3 (@thegoat_msd_) July 27, 2023
Give me ahemdabad pitch
Give me new zealand c team
Or i'll retire
-Shubman Gill😭 pic.twitter.com/QmhlKswyGW
గిల్ వైఫల్యంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై అభిమానులు ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఇండియాలో ఫ్లాట్ పిచ్‌లపై మాత్రమే ఆడితే కుదరదని, విదేశాలలో రాణించాలని సూచిస్తున్నారు. ఫ్యూచర్ కోహ్లీ అని బిరుదు దక్కించుకుంటున్న గిల్.. విరాట్ విదేశాలలో ఎలా ఆడాడో గుర్తు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. మరికొందరైతే గిల్‌ను తప్పించి వన్డేలలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial