(Source: ECI/ABP News/ABP Majha)
ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!
పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ 74 పరుగులతో విజయం సాధించింది.
పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు 74 పరుగుల తేడాతో విజయం దక్కింది.
మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కేవలం 101 ఓవర్లలోనే 657 పరుగులు చేయడం విశేషం. ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేశారు. ఓపెనర్లు జాక్ క్రాలే (122: 111 బంతుల్లో, 21 ఫోర్లు), బెన్ డకెట్ (107: 110 బంతుల్లో, 15 ఫోర్లు), ఓలీ పోప్ (108: 104 బంతుల్లో, 14 ఫోర్లు), హ్యరీ బ్రూక్‌లు (153: 116 బంతుల్లో, 19 ఫోర్లు, ఐదు సిక్సర్లు) సెంచరీలు సాధించాడు.
ఆట మొదటి రోజు 506 పరుగులతో ఇంగ్లండ్ రికార్డు కూడా సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ చెలరేగి ఆడారు. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 29 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసింది. మొదటి సెషన్‌లో జాక్ క్రాలే 38 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకోగా, బెన్ డకెట్ హాఫ్ సెంచరీకి 50 బంతులు అవసరం అయ్యాయి.
ఇక రెండో సెషన్‌లో ఇంగ్లండ్ వేగం కాస్త తగ్గింది. జాక్ క్రాలే 86 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం బెన్ డకెట్ కూడా తన మొదటి సెంచరీని సాధించాడు. మొదటి వికెట్‌కు 216 బంతుల్లోనే 233 పరుగులు జోడించాక బెన్ డకెట్, జాక్ క్రాలే ఇద్దరూ వరుస ఓవర్లలో అవుటయ్యారు. బెన్ డకెట్‌ను జహీద్ మహమూద్, జాక్ క్రాలేని హరీస్ రౌఫ్ అవుట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన జో రూట్ (23: 31 బంతుల్లో, మూడు ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. జహీద్ మహమూదే రూట్‌ను కూడా అవుట్ చేశాడు. ఈ సెషన్‌లో 27 ఓవర్లలో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ స్కోరు 54 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 332 పరుగులకు చేరుకుంది.
ఇక మూడో సెషన్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ టాప్ గేర్‌కు చేరుకుంది. ఓలీ పోప్, హ్యరీ బ్రూక్ చెలరేగి ఆడుతూ స్కోరును పరుగులు పెట్టించారు. ఈ దశలోనే 91 బంతుల్లోనే ఓలీ పోప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో 51 బంతుల్లోనే బ్రూక్ అర్థ సెంచరీ కూడా పూర్తయింది. సౌద్ షకీల్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్లో హ్యారీ బ్రూక్ ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టేశాడు.
ఆ తర్వాత మహ్మద్ అలీ బౌలింగ్‌లో ఓలీ పోప్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (41: 18 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) కూడా సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు. దీంతో ఇంగ్లండ్ 75 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 506 పరుగులు సాధించింది. చివరి సెషన్‌లో కేవలం 21 ఓవర్లలోనే ఇంగ్లండ్ 74 పరుగులు సాధించడం విశేషం. కేవలం 75 ఓవర్లే బ్యాటింగ్ చేసినా టెస్టుల్లో మొదటి రోజు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. 1910లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా సాధించిన 494 పరుగుల రికార్డును ఇంగ్లండ్ బద్దలు కొట్టింది. దాదాపు 112 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ ఈ రికార్డును బద్దలు కొట్టడం విశేషం.
ఆ తర్వాత పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 579 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు షఫీక్ (114: 203 బంతుల్లో, 13 ఫోర్లు, మూడు సిక్సర్లు), ఇమామ్ ఉల్ హక్‌లతో (121: 207 బంతుల్లో, 15 ఫోర్లు, రెండు సిక్సర్లు) పాటు కెప్టెన్ బాబర్ ఆజం (136: 168 బంతుల్లో, 19 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా సెంచరీలు సాధించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఏడుకు పైగా రన్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 35.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. తమ రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 268 పరుగులకు ఆలౌట్ అయి 74 పరుగులతో ఓటమి పాలైంది.