ODI World Cup 2023: ఆ తప్పు చేయడం వల్లే ఓడిపోయాం: బట్లర్
ENG vs AFG: బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోయామన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్.
అఫ్ఘానిస్థాన్‌పై ఓటమి తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. ప్రపంచకప్‌లాంటి మహా సమరంలో ఎలాంటి తప్పులు లేకుండా ఆడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మా వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోయామని బట్లర్ మ్యాచ్ అనంతరం అన్నాడు. అఫ్ఘానిస్థాన్‌కు అద్భుతమైన బౌలర్లు ఉన్నారని, రాత్రి వేళ మంచు కురుస్తుందని అనుకున్నా అని కానీ అలా జరగలేదని.. అది కూడా మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని బట్లర్ అన్నాడు. అఫ్గాన్ బౌలర్లు మంచి లైన్‌లో బౌలింగ్ చేశారన్న ఇంగ్లాండ్ సారధి... వారు సులభంగా పరుగులు ఇవ్వలేదని తెలిపాడు. ఇలాంటి ఓటములు మమ్మల్ని చాలా బాధిస్తాయని... ఒత్తిడిలోనూ తమ ఆటగాళ్లు మెరుగ్గా రాణించాల్సి ఉందని బట్లర్ అన్నాడు. తమ జట్టు బలహీనతలపై పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.
రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని జోస్ బట్లర్ తెలిపాడు. కానీ తమ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ వేయడంలో ఇబ్బంది పడ్డారని... దీనిని అఫ్గాన్ బ్యాటర్లు బాగా సద్వినియోగం చేసుకున్నారని తెలిపాడు. అఫ్గాన్ జట్టుకు శుభారంభం లభించడంతో మిగిలిన బ్యాటర్ల పని సులువైందని ఇంగ్లాండ్ సారథి విశ్లేషించాడు. అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు... ప్రతి విభాగంలోనూ తమ జట్టును వెనక్కి నెట్టారని తెలిపాడు. అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు అనడంలో సందేహమే లేదన్న బట్లర్... మిగిలిన మ్యాచ్‌లపై దృష్టి సారిస్తామని తెలిపాడు. తమ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారన్న బట్లర్... వచ్చే మ్యాచ్ నాటికి అందరూ తమ ఆటను మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు. రాబోయే మ్యాచ్‌ల్లో బలంగా పునరాగమనం చేస్తామన్న ఇంగ్లాండ్ సారధి... ఒత్తిడిలో కూడా బ్రిటీష్ జట్టు మెరుగ్గా రాణించాల్సి ఉంటుందన్నాడు. దాని కోసం కృషి చేస్తామని వెల్లడించాడు.
2023 వన్డే వరల్డ్ కప్‌లో మొదటి సంచలనం నమోదైంది. ఇంగ్లాండ్‌పై అఫ్ఘానిస్థాన్ 69 పరుగుల భారీ తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది.
అఫ్ఘానిస్థాన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (80: 57 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు), ఇక్రమ్ అలిఖిల్ (58: 66 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (66: 61 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేశాడు. కానీ అతని వన్ మ్యాన్ షో సరిపోలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు సాధించారు.
285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. స్కోరుబోర్డుపై మూడు పరుగులు చేరేసరికి విధ్వంసక ఓపెనర్ జానీ బెయిర్‌స్టోను (2: 4 బంతుల్లో) ఫజల్‌హక్ ఫరూకీ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ను ఆఫ్ఘన్ ఎక్కడా కుదురుకోనివ్వలేదు. 35 పరుగులకు మించిన ఒక్క భాగస్వామ్యం కూడా ఇంగ్లండ్ నమోదు చేయలేకపోయింది. చివర్లో ఆదిల్ రషీద్ (20: 13 బంతుల్లో, రెండు ఫోర్లు), మార్క్ వుడ్ (18: 22 బంతుల్లో, మూడు ఫోర్లు), రీస్ టాప్లే (15 నాటౌట్: 7 బంతుల్లో, మూడు ఫోర్లు) ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 40.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది.