(Source: ECI/ABP News/ABP Majha)
Prithvi Shaw: పుజారా నాలాగ బ్యాటింగ్ చేయలేడు - పృథ్వీ షా షాకింగ్ కామెంట్స్
టీమిండియా నయా వాల్ ఛటేశ్వర్ పుజారా ఎప్పటికీ తనలా బ్యాటింగ్ చేయలేడని అంటున్నాడు యువ ఆటగాడు పృథ్వీ షా..
Prithvi Shaw: భారత క్రికెట్ లోకి సంచలనంలా దూసుకొచ్చి ‘ఫ్యూచర్ సెహ్వాగ్’ అనిపించుకున్న టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా.. భారత టెస్టు దిగ్గజం ఛటేశ్వర్ పుజారా బ్యాటింగ్ స్టైల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్యూర్ టెస్ట్ బ్యాటర్ అయిన పుజారా.. తనలా బ్యాటింగ్ చేయలేడని, తాను కూడా పూజారాలా బ్యాటింగ్ చేయలేనని తెలిపాడు. తన ఆటతీరులో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదన్న షా.. ఇంకాస్త తెలివిగా ఆడితే చాలని అభిప్రాయపడ్డాడు.
దులీప్ ట్రోఫీలో భాగంగా సెమీఫైనల్‌లో వెస్ట్ జోన్ వర్సెస్ సెంట్రల్ జోన్ మ్యాచ్ డ్రాగా ముగిసి వెస్ట్ జోన్ ఫైనల్ చేరిన నేపథ్యంలో పృథ్వీ విలేకరులతో మాట్లాడాడు. ‘నేను పుజారా సార్ మాదిరిగా ఆడలేను. అలాగే పుజారా సార్ కూడా నాలా బ్యాటింగ్ చేయలేడు. ఎవరి శైలి వారిది. నా బ్యాటింగ్ స్టైల్‌ను, అటాకింగ్ అటిట్యూడ్‌ను మార్చుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. కానీ ఇంకాస్త స్మార్ట్‌గా ఆడితే చాలు..’అని అన్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో భాగంగా జరిగే దులీప్ ట్రోఫీలో ప్రతి పరుగూ తనకు విలువైందేనని అన్న షా .. తద్వారా భారత జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. టెస్టు క్రికెట్‌తో పోల్చితే టీ20 క్రికెట్ భిన్నమైందని.. ఈ ఫార్మాట్‌లో వేగంగా ఆడుతూ పరుగులు సాధించాలని షా తెలిపాడు. టెస్టులతో పోలిస్తే పొట్టి ఫార్మాట్‌లో పరుగులు సాధించడం తేలికే గానీ ఆ దిశగా దృక్పథాన్ని మార్చుకోవాలని.. బౌలర్లపై ఎదురుదాడికి దిగితేనే ఫలితాలు వస్తాయని వివరించాడు.
Prithvi Shaw said, "whatever has brought me here, I'll stick to that method. I can't bat like Pujara sir, he can’t bat like me. I don't like to change my aggressive batting, be it T20 or any format". (Espncricinfo). pic.twitter.com/2qNyS3Y0F1
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2023
కాగా.. 2021లో శ్రీలంకతో జరిగిన టీ20లో ఆడిన షా మళ్లీ భారత జట్టుకు ఆడలేదు. గతేడాది అస్సాంతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసిన షా.. ఈ ఏడాది జనవరిలో భారత్ - న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ ఈ సిరీస్‌లో అతడు మూడు మ్యాచ్‌లకూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్ - 16లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన షా.. దారుణంగా విఫలమయ్యాడు. గత సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్‌తో జరిగిన ఫస్ట్ సెమీస్ మ్యాచ్‌లో కూడా రెండు ఇన్నింగ్స్ లలో 51 పరుగులే చేశాడు. ఇదే మ్యాచ్‌లో పుజారా.. తొలి ఇన్నింగ్స్‌లో 102 బంతుల్లో 28 పరుగులే చేసినా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 278 బంతుల్లో 133 రన్స్ చేశాడు.
ఇక న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్న పృథ్వీ షా.. తాజాగా సెలక్టర్లు ప్రకటించిన వెస్టిండీస్ టూర్‌లో పొట్టి ఫార్మాట్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్-16లో దారుణ వైఫల్యం అతడిని దెబ్బతీసింది. దులీప్ ట్రోఫీ ముగిసిన తర్వాత షా.. ఇంగ్లాండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఈ మేరకు ఇదివరకే నార్తంప్టన్‌షైర్‌తో ఒప్పందం కూడా ఖరారైంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial