Dhruv Jurel: నా కోసం అమ్మ బంగారు గొలుసు అమ్మేసింది- ధృవ్ జురెల్
Dhruv Jurel Selected For Indian Team: ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి 2 టెస్టులకు ఎంపికైన యువ బ్యాట్స్‌మెన్-వికెట్ కీపర్ ధృవ్ జురెల్ నేపథ్యం స్ఫూర్తిదాయకం.
ఇంగ్లండ్(England) తో జరిగే ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం తొలి రెండు టెస్టులకు జట్టు... అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ ప్రకటన కొందరిని నిరాశ పరచగా ఇంకొందరిని ఆనందింపజేసింది. అయితే ఈ సారి వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికా(South Africa)తో టెస్టు సిరీస్ నుంచి వైదొలిగిన ఇషాన్ కిషన్ స్థానంలో ధ్రువ్ జురెల్(Dhruv Jurel) కు కమిటీ అవకాశం కల్పించింది. అయితే ఈ ధ్రువ్ జురెల్ ఎవ్వరన్న దానిపై అందరి దృష్టి పడింది. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాడిని టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయడం ఆశ్చర్య పరిచింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఆటతీరు మెరుగుపరచుకొని తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికవ్వడంపై ధ్రువ్ కూడా భావోద్వేగంతో స్పందించాడు. తన కుటుంబ నేపథ్యాన్ని వెల్లడించాడు.
ఈ సందర్భంగా తన బాల్యాన్ని, తనకు మొదటిసారి బ్యాట్ కొనివ్వడానికి తండ్రి చేసిన రూ.800ల అప్పుని గుర్తు చేసుకున్నాడు. సెలవుల్లో ఆగ్రాలోని ఏకలవ్య స్టేడియంలో క్రికెట్ క్యాంప్‌లో చేరాలని నిర్ణయించుకుని , దానికి సంబంధించిన ఫారాన్ని స్వయంగా నింపినపుడు తన తండ్రి కోపంతో తిట్టారని, అయితే కోపం చల్లారిన తర్వాత రూ.800లతో క్రికెట్ బ్యాట్ కొనిచ్చారని చెప్పాడు. ఇక నాకు క్రికెట్ కిట్ కావాలని అడిగినప్పుడు దాని ధర అడిగి అది ఆరు నుంచి ఏడు వేల రూపాయలు ఉంటుందని తెలియడంతో కాసేపు ఆలోచించుకొని క్రికెట్ ఆడడం మానేయమని తండ్రి చెప్పారన్నాడు. తాను మొండిపట్టు పట్టి బాత్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేశానని, ఇంట్లోంచి వెక్కిపోతానని చెప్పడంతో తన తల్లి తన బంగారు గొలుసును అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిన విషయాన్ని మీడియా తో పంచుకున్నాడు.
తాను టీమిండియాకు ఎంపికైన విషయం ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని జురెల్ తెలిపాడు. అయితే ఇంతకీ ఏ జట్టుకు ఎంపికయ్యావని ఇంట్లో వాళ్లు అడిగితే రోహిత్ భయ్యా, విరాట్ భయ్యా ఆడే భారత జట్టుకు ఎంపికయ్యానని చెప్పడంతో కుటుంబం మొత్తం భావోద్వేగానికి లోనైందని వివరించాడు.