CSK MS Dhoni: తలైవాలా ఎవరూ చేయలేరు - జస్ట్ కాపీ చేశానంతే : ధోని
IPL 2023: చెన్నై చిన్నోళ్లకు మెరీనా బీచ్, ఇడ్లీ సాంబార్, రజినీకాంత్, ఎంఎస్ ధోనీలు వారి జీవితంలో ఒక ఎమోషన్. దానికి పెద్దగా లాజిక్కులు వెతకాల్సిన పన్లేదు.
CSK MS Dhoni: తమిళ తంబీలకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత ఫేమసో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని కూడా అంతే ఫేమస్. ధోనిని సీఎస్కే అభిమానులు ప్రేమగా ‘తాలా’ (అన్న) అని పిలచుకుంటారు. చెన్నై చిన్నోళ్లకు మెరీనా బీచ్, ఇడ్లీ సాంబార్, రజినీకాంత్, ఎంఎస్ ధోనీలు వారి జీవితంలో ఒక ఎమోషన్. దానికి పెద్దగా లాజిక్కులు వెతకాల్సిన పన్లేదు. జార్ఖండ్‌కు చెందినవాడైనా ధోని కూడా చెన్నైని తన సెకండ్ హోమ్‌గా భావిస్తుంటాడు. ధోని చెన్నైలో ఏం చేసినా సంచలనమే. తాజాగా మహేంద్రుడు.. గతంలో తాను దిగిన ఓ ఫోటోకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రజినీకాంత్ గతంలో నటించిన కబాలి చిత్రంలోని ఓ స్టైలిష్ ఫోజు గుర్తుకువచ్చేలా ధోని కూడా స్టైల్ గా సోఫాలో ఠీవీగా కూర్చుని ఇచ్చిన ఫోజు గురించి తాజాగా అతడు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి టీమ్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, అంబటి రాయుడులతో హాజరైన ధోని దీనిపై మాట్లాడాడు.
తలైవాతో పోల్చుకోలేం..
కార్యక్రమంలో ఒక వ్యక్తి.. ‘మీరు కబాలిలో తలైవా మాదిరిగా దిగిన ఫోటో చాలా బాగుంది. మీరు ఆ లుక్ లో అదరగొట్టారు. ఈ రెండు ఫోటోలను కలిపి చూస్తే.. అసలు మీరు దేని నుంచి స్ఫూర్తి పొందారు..?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ధోని స్పందిస్తూ.. ‘అసలు అందులో పోలికే లేదు. నేను ఒక గొప్ప వ్యక్తి ఇచ్చిన గ్రేట్ పోజ్ ను కాపీ చేశా. అంతకుమించి మరేమీ లేదు. ఆయన (రజినీ)లా ఆలోచించడం, చేయడమనేది ఎవరి వల్లా కాదు. జస్ట్ మనం ఆయనను కాపీ చేయగలమంతే..’ అని బదులిచ్చాడు.
Super Star and the Super King! 😎🔥#WhistlePodu #Yellove 🦁💛 @TheIndiaCements pic.twitter.com/pSLUp0EmS1
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2023
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ను 9 సార్లు ఫైనల్ కు చేర్చిన ధోని.. సీఎస్కేకు 4 ట్రోఫీలు అందించాడు. ఈ క్రమంలో పలుమార్లు అతడు ధోనిని కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం ఐపీఎల్-16లో చెన్నైని మళ్లీ గాడినపెడుతున్న ధోనికి ఇదే సీజన్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మూడేండ్ల తర్వాత హోంగ్రౌండ్ చెపాక్ లో ఆడుతున్న ధోని సేనకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. లక్నో, రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లకు చెపాక్ పోటెత్తింది. ఇక ఈ మ్యాచ్ లలో ధోని బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు టీవీ రేటింగ్ లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఈ సీజన్ లో ఐదు మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. మూడింట్లో గెలిచి రెండు మ్యాచ్ లలో ఓడింది. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. గత సీజన్ లో పేలవ ప్రదర్శన తర్వాత నెమ్మదిగా పుంజుకుంటున్న చెన్నై.. ఈసారి ప్లేఆఫ్స్ బెర్త్ రెడీ చేసుకునేందుకు సిద్ధమవుతున్నది. ఈనెల 21న చెన్నై.. చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్నది.