Cricket Ball: క్రికెట్‌లో వాడేసిన బంతులను ఏం చేస్తారు?
Cricket Ball: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో ఏ బంతిని ఉపయోగిస్తారు? ఒక మ్యాచుకు ఎన్ని బంతులు వాడతారు? పాత బంతిని ఏం చేస్తారు? ఇలాంటి విషయాలు మీకోసం.
Cricket Ball: క్రికెట్ ఆటలో బంతి కీలకపాత్ర పోషిస్తుంది. బ్యాటర్లు బ్యాటుతో ఎంత రెచ్చిపోయినా చివరకు ఒక్క మంచి బంతికి ఔటవుతుంటారు. ఒక్కోసారి ఆ ఒక్క బంతే గెలుపోటములను నిర్ణయిస్తుంది. బంతి బౌండరీ దాటితే బ్యాటింగ్ జట్టుకు.. వికెట్లను తాకితే బౌలింగ్ జట్టుకు ప్రయోజనం. కాబట్టి ఒక జట్టు గెలుపోటములను బంతి నిర్ణయిస్తుంది. అలాంటి క్రికెట్ బాల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో ఏ బంతిని ఉపయోగిస్తారు? ఒక మ్యాచుకు ఎన్ని బంతులు వాడతారు? పాత బంతిని ఏం చేస్తారు? ఒక్కో క్రికెట్ బాల్ ఎంత రేటు ఉంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలని చాలామంది క్రికెట్ అభిమానులకు ఉంటుంది. ఇప్పుడే ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.
ఏ ఫార్మాట్ కు ఏ బంతి?
మ్యాచ్ జరిగే ఫార్మాట్ ను బట్టి క్రికెట్ బంతి ఉంటుంది. టెస్టులకు రెడ్ బాల్... వన్డే, టీ20 లకు వైట్ బాల్ ఉపయోగిస్తారు. కొన్నాళ్ల క్రితం నుంచి డై నైట్ టెస్టుల్లో పింక్ బంతిని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా రెండు ముక్కల లెదర్ ను కలిపి కుట్టిన బంతులను వాడతారు. అయితే గులాబి రంగు బంతిని నాలుగు లెదర్ ముక్కలు కలిపి కుడతారు. ఎరుపు, తెలుపు బంతుల కన్నా ఇది భిన్నంగా ఉంటుంది. ఖరీదు ఎక్కువ. కూకాబుర్రా, ఎస్జీ, డ్యూక్ బంతులను క్రికెట్ మ్యాచులు ఆడడానికి ఉపయోగిస్తారు.
ఒక మ్యాచుకు ఎన్ని బంతులు ఉపయోగిస్తారు?
వన్డే, టీ20 మ్యాచుల్లో ప్రతి ఇన్నింగ్స్ కు ఒక కొత్త బంతి ఇస్తారు. అంటే మ్యాచుకు రెండు బంతులు ఉంటాయి. టెస్ట్ మ్యాచులో ప్రతి 90 ఓవర్ల తర్వాత కొత్త బంతి అందుబాటులో ఉంటుంది. అయితే ఎప్పుడైనా బంతి ఆకారం మారితే దాని స్థానంలో వేరే బంతి ఇస్తారు. అది కూడా అంపైర్లు ఆ బంతిని పరీక్ష చేసి ఆడడానికి పనికిరాదనుకుంటేనే వేరే బంతిని అనుమతిస్తారు. అదీ కొత్త బంతి ఇవ్వరు. అప్పటికే వేరే మ్యాచుల్లో ఆడిన బంతిని అందిస్తారు. ఉదాహరణకు 15వ ఓవర్లో బంతిని మార్చాల్సి వస్తే అప్పటికే వేరే మ్యాచుల్లో 15 ఓవర్లపాటు ఉపయోగించిన బంతిని ఇస్తారు. ఆడడానికి ఉపయోగపడని బంతిని కూడా భద్రపరుస్తారు.
బంతి ధర ఎంత?
సాధారణంగా ఉపయోగించే కూకాబుర్ర వైట్ బాల్ ధర సుమారు రూ. 15 వేలు ఉంటుంది. వివిధ వెబ్ సైట్లలో రూ. 13 వేల నుంచి రూ. 17 వేల వరకు లభ్యమవుతుంది. టెస్టులకు ఉపయోగించే ఎస్జీ రెడ్ బాల్ ధర కూడా ఇంచుమించు అదే రేటు ఉంటుంది.