Cameron Green: 12 ఏళ్లకు మంచి బతకననన్నారు , సంచలన విషయం బయటపెట్టిన గ్రీన్
Cameron Green: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సంచలన విషయం బయటపెట్టాడు. తనకు చిన్నప్పటి నుంచి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉందని తెలిపాడు.
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సంచలన విషయం బయటపెట్టాడు. తనకు చిన్నప్పటి నుంచి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉందని తెలిపాడు. అది పూర్తిగా నయం కాని వ్యాధి అని లక్షణాలు కూడా ఉండవని వెల్లడించాడు. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు గోప్యంగా ఉంచానని పేర్కొన్నాడు. తాను తల్లి కడుపులోఉన్నప్పుడే మూత్ర పిండ సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారని అప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని గ్రీన్ తెలిపాడు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయడంతో అసలు విషయం బయటపడిందన్న గ్రీన్ కిడ్నీలు సాధారణంగా ఉండాల్సినంత పరిమాణంలో లేవని వైద్యులు తెలిపారని అన్నాడు. నెమ్మదిగా రోజులు గడుస్తున్న కొద్దీ తన ఆరోగ్యం మెరుగైందని ఇప్పుడు పరిస్థితి ఫర్వాలేదని గ్రీన్ అన్నాడు. తన అదృష్టం ఏమిటంటే ఇతరుల మాదిరిగా తాను శారీరకంగా ఎక్కువ దెబ్బతినలేదని గ్రీన్ అన్నాడు. తన ఆరోగ్య సమస్య గురించి జట్టులో కొందరికి తెలుసని.. ఆహారపు అలవాట్లను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని తెలుసని కామెరూన్ గ్రీన్ తెలిపాడు.
గ్రీన్ 12 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవచ్చని వైద్యులు అంచనా వేశామని గ్రీన్ తండ్రి గ్యారీ తెలిపారు. ఆ సమయంలోతమ బాధ వర్ణించలేనిదని.. అయితే, ధైర్యం కోల్పోకుండా నిరంతరం గ్రీన్ ఆరోగ్యంపై దృష్టిపెట్టామని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పుడు గతాన్ని తలుచుకుంటే ఒక్కోసారి భయంగా ఉంటుందని గ్రీన్ తండ్రి వెల్లడించారు. గ్రీన్ ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆసీస్ టీమ్‌లో ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రేడింగ్‌లో ముంబయి ఇండియన్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారాడు. ముంబయి ఇండియన్స్ గత వేలంలో రూ.17.5 కోట్లు చెల్లించి తీసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ఆర్సీబీకి ఇచ్చేసింది. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది.
గ్రీన్‌ను గతేడాది వేలంలో రూ.17.5 కోట్లు పెట్టి గ్రీన్‌ను ముంబయి దక్కించుకుంది. ఇప్పుడు అంతే మొత్తాన్ని చెల్లించి గ్రీన్‌ను ఆర్సీబీ తీసుకుంది. అంతే కాకుండా ఆటగాడి మార్పిడి ఫీజు కింద కూడా ఆర్సీబీ మరికొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే గ్రీన్ కోసం భారీ మొత్తం ఖర్చు పెట్టేందుకు ఆర్సీబీ ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. గ్రీన్ మంచి ఆటగాడే. ఈ ఏడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతను ముంబయి తరపున 16 మ్యాచ్‌ల్లో 50.22 సగటుతో 452 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 160.28 ఉండటం విశేషం. ఓ సెంచరీ కూడా చేశాడు. తన ఫాస్ట్‌బౌలింగ్‌తో ఆరు వికెట్లు కూడా పడగొట్టాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగడమే కాకుండా, ఉపయుక్తమైన బౌలింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా అతను ఆర్సీబీకి కలిసొచ్చే అవకాశం ఉంది.
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్ క్రికెట్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 19న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా... వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉంటారు. 77 ఖాళీలు ఉండగా.... ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు 333 మంది పోటీ పడుతున్నారు.