Ben Stokes: ఇంగ్లాండ్ ఓటమికి 2 కారణాలు వెల్లడించిన కెప్టెన్ బెన్ స్టోక్స్, భారత బౌలర్లపై ప్రశంసలు
India vs England 2nd Test: బర్మింగ్హామ్ టెస్ట్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ 336 పరుగుల తేడాతో ఓడిపోయింది. కీలక సమయాల్లో వికెట్లు తీయలేకపోవడం, తాము త్వరగా వికెట్లు సమర్పించుకోవడమే ఓటమికి కారణమన్నాడు.

Ben Stokes Statement England Loss Birmingham: లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ ఓడిపోయాక, భారత జట్టు కమ్ బ్యాక్ చేసింది. సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉన్న టీమిండియా బర్మింగ్‌హామ్‌లో తొలి విజయాన్ని సాధించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా మొదటి టెస్ట్ విజయాన్ని సాధించాడు. ఈ వేదికగా విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. రెండవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌ను 336 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకోవడం జట్టుకు మైనస్ పాయింట్ అయింది. తమ ఓటమిపై కెప్టెన్స్ స్టోక్స్ 2 అతిపెద్ద కారణాలను వివరించాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో ఇంగ్లాండ్ ఓటమికి స్టోక్స్ ఎవరిని బాధ్యులు చేశాడో ఇక్కడ తెలుసుకోండి.
మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ 211 పరుగులకే భారత్ 5 వికెట్లు తీసిందని, ఆ తర్వాత జట్టు తిరిగి కమ్ బ్యాక్ చేయలేదన్నాడు. ఓటమికి 2 కారణాలు ఉన్నాయి. మేం దాదాపు 200 స్కోరు వద్ద వారి 5 వికెట్లు తీశాం, ఆ తర్వాత భారత్ ను తక్కువ స్కోరుకు ఔట్ చేయలేకపోయాం అన్నాడు.
బెన్ స్టోక్స్ తమ ఓటమికి రెండవ కారణంపై మాట్లాడుతూ "భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో మేం 80 పరుగులకు 5 వికెట్లు కోల్పోయాం. అటువంటి పరిస్థితి నుండి కోలుకోవడం చాలా కష్టం. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్ వికెట్లను త్వరగా తీసి ఉంటే, మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదని స్టోక్స్ పేర్కొన్నాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ భారీ ఇన్నింగ్స్
బెన్ స్టోక్స్ మొదటి ఇన్నింగ్స్ గురించి మాట్లాడాడు. భారత్ 211 స్కోరు వద్ద 5 వికెట్లు కోల్పోయింది. తరువాత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్ జట్టుపై ఆధిపత్యం చెలాయించారు, వారు 203 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేశాడు. ఫలితంగా భారత జట్టు 587 పరుగుల భారీ స్కోరు చేసింది.
మరోవైపు నాలుగో ఇన్నింగ్స్ ఏ జట్టుకైనా బ్యాటింగ్ కష్టమే. అలాంటిది ఇంగ్లాండ్ ఏకంగా 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో మంచి ఆరంభం లభించలేదు. ఇంగ్లాండ్ కేవలం 80 స్కోరుకే 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. వరుసగా వికెట్లు పడటంతో ఇంగ్లాండ్ మ్యాచ్ నెగ్గడం కాదు కదా, కనీసం డ్రా చేసే అవకాశం కూడా లేకపోయింది.
ఈ మ్యాచ్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా లేకుండానే జట్టు బరిలోకి దిగింది. కొత్త బౌలర్ ఆకాశ్ దీప్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ 6 వికెట్లతో చెలరేగితే, ఆకాశ్ దీప్ 4 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 6 వికెట్లతో ఆకాశ్ దీప్ అదరగొట్టాడు. దాంతో మూడో టెస్టులో ఆకాశ్ దీప్ ఆడటం కన్ఫామ్ అని చెప్పవచ్చు. మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి టెస్టులో ఓటమికి తనదే బాధ్యత అన్న అతడు రెండో టెస్టులో మరింత దారుణంగా బౌలింగ్ చేశాడు. ఏ దశలోనూ వికెట్లు తీయలేకపోయాడు.





















