Syed Mustaq Ali trophy: క్రికెట్‌లోకి రగ్బీ రూల్ తీసుకొస్తున్న బీసీసీఐ - చూసేవాళ్లకు పండగే పండగ !
Syed Mustaq Ali trophy: త్వరలో ప్రారంభమవనున్న దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో బీసీసీఐ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకురాబోతోంది. అసలు దీని నియమ నిబంధనలు ఏంటో చూద్దాం.
Syed Mustaq Ali trophy: రగ్బీ, ఫుట్ బాల్, హాకీ వంటి క్రీడల్లో ఆట మధ్యలో రీప్లేస్ మెంట్స్, సబ్ స్టిట్యూషన్స్ జరుగుతుంటాయి. ఆ క్రీడల్లో అలా వచ్చిన ఆటగాడు అన్ని రోల్స్ ప్లే చేయొచ్చు. క్రికెట్లోనూ ఈ సబ్ స్టిట్యూట్ ఆప్షన్ ఉన్నా.. ఇప్పటివరకు అది కేవలం ఫీల్డింగ్ కే పరిమితమైంది. అయితే టీ20 క్రికెట్ కు ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా దానికి మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు కొత్త నిబంధనలు వస్తున్నాయి. అదే ఇంపాక్ట్ ప్లేయర్.
ఇప్పటికే బిగ్ బ్యాష్ లీగ్ వంటి చోట్ల ప్రయోగించిన ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ ను ఇప్పుడు బీసీసీఐ కూడా స్టార్ట్ చేయబోతోంది. త్వరలో ఆరంభమయ్యే దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ ను బీసీసీఐ పరీక్షించబోతోంది.
ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏంటి?
- ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఓ ట్యాక్ టికల్ సబ్ స్టిట్యూట్. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్లు తుదిజట్టుతో పాటు మరో నలుగురు సబ్ స్టిట్యూట్స్ ను ప్రకటించాలి. వారిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా ముందుగానే చెప్పాలి. మ్యాచ్ మొత్తం మీద ఒకసారి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను సబ్ స్టిట్యూట్ గా బరిలోకి దింపొచ్చు. అయితే అది కేవలం ఓ ఇన్నింగ్స్ లో 14 ఓవర్లకు ముందో లేకపోతే ఓ ఇన్నింగ్స్ పూర్తిగా అయిన తర్వాత మాత్రమే సాధ్యం.
- ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరైతే బరిలోకి వస్తారో అతను బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ చేయొచ్చు. అంతకుముందు ఉన్న ఆటగాడు అప్పటికే బ్యాటింగ్ చేసి ఔటైనా ఇంపాక్ట్ ప్లేయర్ బ్యాటింగ్ చేయొచ్చు. అంతకుముందు ఉన్న ప్లేయర్ తన కోటా ఓవర్లు పూర్తి చేసిన తర్వాత వచ్చినా అతను తన కోటా 4 ఓవర్లు బౌలింగ్ చేసే వీలుంది.
- ఓవర్ మధ్యలో ఇంపాక్ట్ ప్లేయర్ రావడానికి వీల్లేదు. అయితే వికెట్ పడ్డప్పుడు మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ ను దింపే అవకాశముంది.
- 20 ఓవర్ల పూర్తి మ్యాచ్ జరిగినప్పుడే 14వ ఓవర్ కన్నా ముందు ఇంపాక్ట్ ప్లేయర్ రావడానికి వీలుంది. అదే వర్షం వల్ల ఓవర్లు కుదిస్తే ఆ లెక్క కొంచెం ముందుకు జరుగుతుంది. మ్యాచ్ జరిగే మొత్తం ఓవర్ల ఆధారంగా ఏ ఓవర్ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ రావాలో నిర్ణయిస్తారు. ఒకవేళ 10 ఓవర్ల కన్నా తక్కువకు మ్యాచ్ ను కుదిస్తే ఇంపాక్ట్ ప్లేయర్ అవకాశం ఉండదు.
- ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వ్యక్తి గాయపడితే అప్పుడు అతని స్థానంలో మరో ఆటగాడు రావొచ్చు. కానీ అది ఓ సాధారణ సబ్ స్టిట్యూట్ లా మాత్రమే. అంటే కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేసే వీలుంటుంది.
బీసీసీఐ ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఈ నిబంధనను ప్రయోగిస్తోంది. అక్కడ అన్నీ అనుకున్నట్లు జరిగితే మహిళల క్రికెట్, ఐపీఎల్ లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ ను చూడొచ్చు. అనంతరం పురుషుల క్రికెట్లోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.