Sourav Ganguly vs N Srinivasan: శ్రీనివాసన్‌పై అటాక్ చేసిన దాదా! మరి ఇవన్నీ ఎవరూ చేశారంటూ కౌంటర్
Sourav Ganguly vs N Srinivasan: బీసీసీఐ పాలకుడిగా తన నేతృత్వంలో ఎన్నో మంచి పనులు జరిగాయని సౌరవ్ గంగూలీ అన్నాడు. తన హాయంలో చాలా ఘనతలు సాధించామని పేర్కొన్నాడు.
Sourav Ganguly HITS back at N Srinivasan: బీసీసీఐ పాలకుడిగా తన నేతృత్వంలో ఎన్నో మంచి పనులు జరిగాయని సౌరవ్ గంగూలీ అన్నాడు. కరోనా సమయంలో ఐపీఎల్ నిర్వహించడం నుంచి కామన్వెల్త్‌లో మహిళలు రజతం గెలవడం వరకు చాలా ఘనతలు సాధించామని పేర్కొన్నాడు. మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలపై దాదా పరోక్షంగా స్పందించాడు.
బోర్డు అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాలని గంగూలీ భావించాడు. త్వరలో జరిగే ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ప్రయత్నించాడు. కానీ వరుసగా ఎవరూ రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టలేదని, అది సంప్రదాయం కాదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడికి ఎవరూ మద్దతు ఇవ్వలేదు. దాదా నేతృత్వంలో బీసీసీఐ స్థాయికి తగినట్టు రాణించలేదని, అతడేమీ చేయలేదని ఎన్.శ్రీనివాసన్ తీవ్రంగా విమర్శించాడు. ముంబయిలో జరిగిన సమావేశాలో దాదాను వ్యతిరేకించాడు. మీడియా అడగడంతో శ్రీనిపై గంగూలీ అటాక్ చేశాడు.
'నేను క్రికెటర్లకు అనుకూలమైన పాలకుడిని. నా హయాంలో ఎన్నో మంచి పనులు జరిగాయి. కొవిడ్ సమయంలో ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించాం. ఐపీఎల్ ప్రసార హక్కులకు భారీ డబ్బులు వచ్చాయి. అండర్ 19 జట్టు ప్రపంచకప్ గెలిచింది. మహిళల జట్టు కామన్వెల్త్ రజతం సాధించింది. టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో వరుస సిరీసులు గెలిచింది. అందుకే బీసీసీఐ అధ్యక్షుడిగా నా సమయాన్ని ఆస్వాదించాను' అని గంగూలీ అన్నాడు.
'పాలకుడిగా ఎంతో సేవ చేయాల్సి వస్తుంది. జట్టును మెరుగుపరిచేందుకు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ చేసిన వాడిగా నేనీ విషయం అర్థం చేసుకున్నా. అధ్యక్షుడిగా నా పనిని ఆస్వాదించాను. ఏదేమైనా ఎల్లకాలం ఆటగాడిగా, పాలకుడిగా ఉండలేం కాదా' అని పేర్కొన్నాడు.
మరికొన్ని రోజుల్లో దాదా పదవీ కాలం పూర్తవుతుంది. మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ అతడి స్థానంలో అధ్యక్షుడు కానున్నాడు. అరుణ్ ధుమాల్ స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే అశీష్ షెలార్ కోశాధికారి కానున్నాడు. శ్రీనివాసన్ విమర్శలపై బంధన్ బ్యాంకు ఈవెంట్లో దాదా స్పందించాడు. బ్యాంకుకు అతడు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు.
'నేను చాలా కాలంగా పాలకుడిగా ఉన్నాను. నేనికపై మరో పని చూసుకోవాల్సి ఉంటుంది. టీమ్‌ఇండియాకు ఆడటమే నా జీవితంలో అత్యుత్తమమైన రోజులు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడిక మరో పెద్ద పని కోసం వెళ్లాలి. ఎప్పుడూ ఆటగాడిగా ఉండలేం. అలాగే ఎప్పుడూ పాలకుడిగా ఉండలేరు. ఈ రెండూ చేయడం గొప్పే' అని దాదా అన్నాడు.
'నేనెప్పుడూ చరిత్రను నమ్మను. అత్యున్నత స్థాయిలో ఆడే ప్రతిభావంతులు తూర్పు వైపు లేరన్న భావన ఉండేది. ఏదేమైనా ఒక్కరోజులో అంబానీ లేదా నరేంద్ర మోదీ అవ్వలేరు. ఆ స్థాయికి చేరుకోవాలంటే నెలలు, సంవత్సరాలు కష్టపడాలి' అని గంగూలీ పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ చేసిన అనుభవం గురించి మరోసారి వివరించాడు.
'ఆరుగురు కెప్టెన్లు జట్టును నడిపించారు. వన్డే జట్టులోంచి రాహుల్ ద్రవిడ్‌ను దాదాపుగా తప్పిస్తున్నప్పుడు నేను అతడివైపు నిలిచాడు. జట్టును ఎంపిక చేసేందుకు వారి సలహాలు తీసుకున్నాను. జట్టు వాతావరణంలో వీటిని గమనించకుండా ఉండలేరు. నేను చేసిన పరుగుల్ని మాత్రమే కాదు మిగతా వాటినీ జనాలు గుర్తుంచుకుంటారు. ఒక నాయకుడిగా చేయాల్సింది ఇదే' అని దాదా అన్నాడు.