BCCI Awards: వైభవంగా బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం, మెరిసిన మహిళా క్రికెటర్లు
BCCI Awards: మూడేళ్ల తర్వాత నిర్వహించిన బీసీసీఐ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
మూడేళ్ల తర్వాత నిర్వహించిన బీసీసీఐ(BCCI) అవార్డుల కార్యక్రమం హైదరాబాద్(Hyderabad)లో ఘనంగా జరిగింది. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్(Subhman Gill) 2022-2023 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా పాలి ఉమ్రిగర్ అవార్డును అందుకున్నాడు. 2019-2020 ఏడాదికిగాను మహ్మద్ షమీ(Shammi)... 2020-2021 ఏడాదికిగాను మహ్మద్ షమీ... 2021-2022 ఏడాదికిగాను పేసు గుర్రం జస్ప్రిత్ బుమ్రా(Bumrah) పాలి ఉమ్రిగర్ అవార్డును అందుకున్నాడు. మహిళల విభాగంలో స్మృతి మంధాన, దీప్తి శర్మ అంతర్జాతీయ మహిళ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నారు. 2020-21, 2021-22 ఏడాదులకుగాను స్మృతి మంధాన … 2019-2020, 2022-23 ఏడాదులకుగాను దీప్తి శర్మ ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ అవార్డును గెలుచుకున్నారు. ఇంకా అనేక విభాగాల్లో క్రికెటర్లకు అవార్డులను అందించారు. మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రి, ఫరూఖ్ ఇంజినీర్.. సీకే నాయుడు జీవితకాల సాఫల్య అవార్డులు స్వీకరించారు. అవార్డుల కార్యక్రమానికి ఇంగ్లాండ్ సహాయ సిబ్బంది కూడా హాజరయ్యారు.
2023లో రికార్డులే రికార్డులు
గత ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్.. అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. గిల్ కేవలం 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌తో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు. భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 1998లో క్రికెట్ గాడ్ సచిన్ 1894 పరుగులు చేశాడు. సౌరవ్ గంగూలీ రెండో స్థానంలో ఉన్నాడు. గంగూలీ 1999లో 1767 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో ఉండగా ది వాల్ 1761 పరుగులు చేశాడు. సచిన్ మళ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 1996లో మరోసారి మాస్టర్ బ్లాస్టర్ 1611 పరుగులు చేశాడు. శుభ్‌మన్ ఈ ఏడాది వన్డేల్లో 1500 పరుగులు చేశాడు. ఈ విషయంలో రోహిత్, కోహ్లిలను గిల్ వెనక్కినెట్టాడు. 2019లో రోహిత్ 1490 పరుగులు చేయగా.. 2017లో కోహ్లీ 1460 పరుగులు చేశాడు. వీరిద్దరిని అధిగమించి గిల్ 1500 పరుగులు చేసి సత్తా చాటాడు.
రవిశాస్త్రి కెరీర్
టీమిండియా తరఫున రవిశాస్త్రి 80 టెస్టులు ఆడి 3,830 పరుగులు చేశాడు. , 150 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రవిశాస్త్రి 3,108 రన్స్ చేశాడు. టెస్టుల్లో 151 వికెట్లు తీసిన ఈ దిగ్గజ ఆల్‌రౌండర్.. వన్డేల్లో 129 వికెట్లు పడగొట్టాడు. 2014 లో భారత క్రికెట్ జట్టుకు టీమ్ డైరెక్టర్‌గా ఉన్న శాస్త్రి.. 2016 తర్వాత పూర్తిస్థాయి కోచ్ బాధ్యతలు స్వీకరించాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో రవిశాస్త్రి కోచింగ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలపై టీమిండియా గెలిచింది. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడే భారత్.. ఆస్ట్రేలియాలో వరుసగా రెండుసార్లు టెస్టు సిరీస్‌లను సాధించింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ఫైనల్ చేరింది. 2021లో దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ తర్వాత శాస్త్రి కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.