Asia Cup 2023: ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టు భారత్, మరి 2023 కప్పులో ఎవరు ఫేవరేటో తెలుసా?
Asia Cup 2023: ఈసారి ఆసియా కప్ ను హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించనున్నారు. ఇందులో 4 మ్యాచ్ లు పాకిస్థాన్ లో జరగనుండగా, మిగిలిన మ్యాచ్ లు శ్రీలంకలో జరగనున్నాయి.
Asia Cup 2023: ఆసియా కప్ నిర్వహణపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చింది. ఆసియా జట్ల మధ్య జరగనున్న ఈ చారిత్రాత్మక టోర్నీ ఈసారి ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. ఈ సారి పూర్తిగా భిన్నమైన రీతిలో ఆసియా కప్ ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో 4 మ్యాచ్ లు పాకిస్థాన్ లో జరగనున్నాయి. అలాగే మిగతా మ్యాచ్ లు అన్నీ శ్రీలంకలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆసియా కప్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ ఉంది. ఇప్పటి వరకు 7 సార్లు ఆసియా కప్ ను భారత్ గెలుచుకుంది. మరి 2023 లో జరగబోయే ఆసియా కప్ టోర్నీలో ఫేవరెట్ జట్లు ఏవి.. ఏ జట్టుకు విజయవకాశాలు ఎక్కువున్నాయి.. ఆసియా కప్ 2023ను అందుకోబోయే జట్టు ఏదో తెలుసుకుందామా..
అత్యధికసార్లు కప్ ను అందుకున్న భారత్
1984లో మొదటి సారి ఆసియా కప్ ను నిర్వహించారు. తొలిసారి కప్ ను భారత జట్టు అందుకుంది. ఆ తర్వాత 1986లో శ్రీలంక ఆసియా కప్ ను గెలుచుకుంది. దీని తర్వాత 1988, 1990, 1995 లో వరుసగా మూడు సార్లు భారత జట్టే ఆసియా కప్ లను గెలుచుకుంది. ఆ తర్వాత 1997లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో భారత్ విజయపరంపరను శ్రీలంక అడ్డుకుంది. ఆ సంవత్సరం ఆసియా కప్ ను లంక జట్టు గెలుచుకుంది. 2000 సంవత్సరంలో తొలిసారిగా పాక్ జట్టు ఆసియా కప్ గెలుచుకుంది. చివరి ఆసియా కప్ 2022 లో జరిగింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను 23 పరుగుల తేడాతో ఓడించి శ్రీలంక కప్ ను అందుకుంది. మొత్తంగా భారత్ 7 సార్లు ఆసియా కప్ ను అందుకోగా.. శ్రీలంక 6 సార్లు, పాకిస్థాన్ 2 సార్లు కప్ గెలుచుకున్నాయి.
ఈసారి భారత్-పాక్ మధ్యే పోటీ!
2023 ఆసియా కప్ ను 50 ఓవర్ల ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం భారత్ జట్టే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ప్రపంచకప్ సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని జట్లూ ఈ సారి టోర్నమెంట్ లో పూర్తి స్థాయిలో సీరియస్ గా ఆడేందుకు సిద్ధమయ్యాయి. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే ఫైనల్ కు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. అదే సమయంలో పాక్ జట్టు కూడా కప్ గెలుచుకునే రేసులో ఉంది. ఈసారి ఆసియా కప్ టోర్నీ రసవత్తరంగా సాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: Asia Cup 2023: మాతో ఆడకుంటే టీమిండియా నరకానికి పోతుంది - జావేద్ మియాందాద్ షాకింగ్ కామెంట్స్
ఆసియా కప్ టోర్నీలో కొత్త జట్టు అరంగేట్రం
ఈసారి ఆసియా కప్ టోర్నీలో ఓ కొత్త జట్టు అడుగుపెట్టనుంది. పైగా ఆ టీమ్ ను భారత్, పాకిస్థాన్ వంటి పెద్ద జట్లు ఉన్న గ్రూప్ లో వేశారు. అదే నేపాల్ క్రికెట్ జట్టు. ఖాట్మండులోని టీయూ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ ఫైనల్ లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ఓడించడం ద్వారా నేపాల్ జట్టు ఆసియా కప్ లో స్థానం దక్కించుకుంది.
https://t.me/abpdesamofficial