Asia Cup, IND Vs PAK: కొలంబోలో రెయిన్ ఎఫెక్ట్ - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఆసియా క్రికెట్ కౌన్సిల్
భారత-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూడాలని అమితాసక్తితో ఎదురుచూసి నిరాశపడ్డ అభిమానులకు తదుపరి మ్యాచ్ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది.
Asia Cup, IND Vs PAK: వన్డేలలో నాలుగేండ్ల తర్వాత మ్యాచ్ ఆడిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని దాయాది దేశాల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ అమితాసక్తితో ఎదురుచూశారు. ఆసియా కప్ - 2023లో భాగంగా ఈ నెల 2న భారత్ - పాక్ పోరు జరిగినా వర్షం కారణంగా ఆ మ్యాచ్ అర్థాంతరంగా రద్దైంది. అయితే గ్రూప్ స్టేజ్‌లో పోయినా చిరకాల ప్రత్యర్థుల మధ్య మరో పోరుకు రెండు రోజుల్లో తెరలేవనుంది. ఈ మ్యాచ్ కూ వర్షం అంతరాయం కలిగించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10న భారత్ - పాక్ మధ్య జరుగనున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే దానికి రిజర్వ్ డే ఉందని ప్రకటించింది.
ఆసియా కప్ - 2023లో భాగంగా ఇటీవలే మొదలైన సూపర్ - 4 తొలి పోరు బంగ్లాదేశ్ - పాకిస్తాన్‌ల మధ్య లాహోర్‌లో జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత టోర్నీ పూర్తిగా శ్రీలంకకు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. సూపర్ - 4తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి. అయితే ఇప్పటికే కొలంబోలో గడిచిన వారం రోజులుగా వర్షం పడని రోజులేదు. వచ్చే పదిరోజులు కూడా అక్కడ వర్షాలు కురిసే అవకాశాలు 60 శాతమున్నాయి. భారత్ - పాక్ మ్యాచ్ జరగాల్సి ఉన్న ఆదివారం కూడా కొలంబోలో వర్షం పడే అవకాశాలు 75 శాతం ఉన్నాయి. దీంతో ఏసీసీ మేల్కొంది.
Reserve days in Asia Cup 2023. [Espn Cricinfo]
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
- India vs Pakistan in Super 4.
- Final. pic.twitter.com/aAy1QElUxA
దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ఏర్పాటు చేసింది. అయితే సూపర్ - 4లో ఈ అవకాశం ఉన్నది ఈ ఒక్క మ్యాచ్‌కు మాత్రమే. మిగిలిన జట్లు, మ్యాచ్‌లకు ఆ ఛాన్స్ లేదు. భారత్ - పాక్ మధ్య ఈనెల 2న మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే వర్షం కారణంగా పాకిస్తాన్ బ్యాటింగ్‌కే రాలేదు. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను అర్థాంతరంగా నిలిపేశారు. భారత్ - నేపాల్ మ్యాచ్‌కూ వర్షం అంతరాయం కలిగించడంతో ఓవర్లను కుదించారు. దీంతో ఏసీసీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏసీసీ.. సూపర్ - 4లో భారత్ - పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ను ప్రకటించింది.
Bright sunny day at Colombo.
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
- Great news for Cricket fans...!!!! pic.twitter.com/FX1aqPQMTQ
రిజర్వ్ డే ఉన్న నేపథ్యంలో ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోతే అక్కడ్నుంచే తిరిగి ఆట ప్రారంభం అవుతుంది. అభిమానులు తర్వాతి రోజు కూడా ముందుగా కొనుగోలు చేసిన టికెట్లతోనే మరుసటి రోజు మ్యాచ్‌ను తిలకించొచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial