Asia Cup 2023, IND vs BAN: ఫైనలిస్ట్ వర్సెస్ ఎలిమినేటర్ - తుదిపోరుకు ముందు బంగ్లాతో భారత్‌కు ప్రాక్టీస్ మ్యాచ్
టోర్నీ పరంగా చూస్తే ఇరు జట్లకూ ఈ మ్యాచ్ అప్రధానమే అయినా వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో నేటి మ్యాచ్‌ను భారత్, బంగ్లాదేశ్‌లు తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగనున్నాయి.
Asia Cup 2023, IND vs BAN: ఆసియా కప్ - 2023లో ఫైనల్ బెర్త్‌ను అందరికంటే ఫస్ట్ కన్ఫమ్ చేసుకున్న భారత్.. సూపర్ - 4కు చేరినా తుదిపోరు చేరకుండా ఎలిమినేట్ అయిన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టోర్నీ పరంగా చూస్తే ఇరు జట్లకూ ఈ మ్యాచ్ అప్రధానమే అయినా వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో నేటి మ్యాచ్‌ను భారత్, బంగ్లాదేశ్‌లు తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగనున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులు చేసే అవకాశముంది. ఆదివారం శ్రీలంకతో జరిగే ఫైనల్ పోరుకు ముందు భారత్‌కు ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కానుంది.
బెంచ్ బలమెంత..?
గ్రూప్ స్టేజ్‌లో నేపాల్‌ను ఓడించి సూపర్ - 4లో పాకిస్తాన్, శ్రీలంకలనూ మట్టికరిపించిన భారత జట్టు ఆసియా కప్‌లో ఇదివరకే ఫైనల్ చేరిన నేపథ్యంలో బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకుంటోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌లు కీలకటోర్నీకి ముందు ఫామ్‌లోకి రావడం భారత్‌కు మేలుచేసేదే. ఇషాన్ కిషన్ నిలకడగా రాణిస్తుండటం, కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి తన పునరాగమనాన్ని ఘనంగా చాటిన నేపథ్యంలో ఇక మిగిలిఉన్న ఖాళీలను పూరించడానికి టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి సారించింది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లకు ఈ మ్యాచ్‌లో అవకాశమివ్వాలని టీమిండియా భావిస్తోంది.
బౌలింగ్‌లో కూడా బుమ్రా జట్టులోకి ఎంట్రీ ఇవ్వడమే గాక ప్రపంచకప్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్టే కనిపిస్తున్నది. సిరాజ్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అయితే షమీ, శార్దూల్ ఠాకూర్‌లు ఇంకా కుదురుకోలేదు. గత రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమైన షమీకి ఈ మ్యాచ్‌లో ఛాన్స్ ఇవ్వొచ్చు. బుమ్రాకు నేటి మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి.
బంగ్లా షాకిచ్చేనా?
ఆసియా కప్ - 2023లో భారత్.. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన తర్వాత ఎలిమినేట్ అయిన బంగ్లాదేశ్ ఈ టోర్నీలో గెలిచిందే ఒక్క మ్యాచ్ (అఫ్గానిస్తాన్‌పై).. గ్రూప్ స్టేజ్‌తో పాటు సూపర్ - 4లో లంక, పాకిస్తాన్ ల చేతిలో ఓడిన బంగ్లాదేశ్ ఇక టోర్నీని విజయంతో ముగించాలని భావిస్తున్నది. గతేడాది డిసెంబర్‌లో భారత్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న బంగ్లా పులులు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ టోర్నీలో అసలు ఓటమనదే లేకుండా ఆడుతున్న భారత జట్టుకు షాకిచ్చేందుకు బంగ్లా సిద్ధమవుతోంది. కీలకమైన ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగిన బంగ్లా.. నేటి మ్యాచ్‌లో తమ స్ట్రెంత్‌ను పరీక్షించుకోవాలని చూస్తున్నది.
తమీమ్ ఇక్బాల్, ఎబాదత్ హోసేన్‌లు టోర్నీకి ముందే గాయాలతో దూరమవగా లిటన్ దాస్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక తొలి రెండు మ్యాచ్‌లలో రాణించిన నజ్ముల్ హోసేన్ శాంతో కూడా గాయం కారణంగా సూపర్ - 4 కు ముందే బ్యాగ్ సర్దేశాడు. గాయాల కారణంగా ఆ జట్టు మెహిది హసన్ మిరాజ్, షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నది. బౌలింగ్‌లో టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాంలు భారత బ్యాటర్లను ఏ మేరకు అడ్డుకుంటారనేది ఆసక్తికరం.
తుది జట్లు (అంచనా):
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్/కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ/జస్ప్రిత్ బుమ్రా
బంగ్లాదేశ్ : మెహిది హసన్ మిరాజ్, తాంజిద్ హసన్/మహ్మద్ నయీం, లిటన్ దాస్, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్, అఫిఫ్ హోసేన్, షమిమ్ హోసేన్, నజుమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్
మ్యాచ్ వెన్యూ, టైమింగ్స్ :
- కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరంభం కానుంది.
లైవ్ చూడటం ఇలా..
- ఈ మ్యాచ్‌ను స్టార్ నెట్‌వర్క్‌లో హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు తెలుగులో కూడా వీక్షించొచ్చు. మొబైల్స్‌లో అయితే ఎలాంటి రుసుము లేకుండానే డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో చూసేయొచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial