(Source: ECI/ABP News/ABP Majha)
IND Vs PAK, Innings Highlights: బాబర్ సేనను భయపెట్టిన భారత్! కోహ్లీ, కేఎల్ క్లాసిక్ సెంచరీలు
IND Vs PAK: విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగడంతో టీమ్‌ఇండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. పాకిస్థాన్ కు భారీ టార్గెట్ ఇచ్చింది.
IND Vs PAK, Innings Highlights:
ఇది కదా టీమ్‌ఇండియా అంటే! ఇది కదా బ్యాటింగ్ డెప్త్ అంటే! ఇలా ఉంటుంది కదా టాప్ 4 ఆడితే! ఈ మధ్య కాలంలో పాకిస్థాన్‌తో ఆడితే హిట్‌మ్యాన్ సేన కాస్త వెనకబడ్డట్టు కనిపించేంది. పేసర్లను ఎదుర్కోవడం ఆందోళనగా భావించేది. బంతి స్వింగ్ అవుతుంటూ టపటపా వికెట్లు పోగొట్టుకునేది!
మైండ్ సెట్.. ఇంటెంట్‌లో చిన్న మార్పు..! అంతే.. ఫియర్‌లెస్‌గా ఆడాలని నిర్ణయించుకున్న టీమ్‌ఇండియా.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది. ఆసియాకప్ -2023 సూపర్ 4 మ్యాచులో భారీ స్కోరు చేసింది. వికెట్ల మధ్య ఆధిపత్యం చెలాయించింది. మబ్బులొచ్చినా.. వర్షం కురిసినా.. ఒకే ఇంటెంట్‌తో ఆడింది. బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. శత్రుదేశం ముందు ఊహించని టార్గెట్ పెట్టింది.
ప్రేమదాసలో అభిమానులు పండగ చేసుకున్నారు. ఒకవైపు కేఎల్ రాహుల్ (111; 106 బంతుల్లో 12x4, 2x6) క్లాసిక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పునరాగమనంలో టాప్ క్వాలిటీ బౌలింగ్‌ను ఎదుర్కొని కెరీర్లో ఆరో శతకం అందుకున్నాడు. అతడికి తోడుగా కింగ్ విరాట్ కోహ్లీ (122; 94 బంతుల్లో 9x4, 3x6) శతకంతో కదం తొక్కాడు. ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. వన్డేల్లో అత్యధిక వేగంగా 13,000 పరుగుల రికార్డును సృష్టించాడు. అలాగే 47వ సెంచరీని సాధించాడు. వీరిద్దరి సొగసైన షాట్లు ఫ్యాన్స్‌కు కన్నుల పండువగా మారాయి. దాంతో 50 ఓవర్లకు టీమ్‌ఇండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. దాయాదిపై భారత్‌కు ఇది అత్యధిక (సంయుక్త) స్కోర్.
మొదట గిల్, రోహిత్
టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు పాక్ పేసర్లపై ఎదురుదాడికి దిగారు. సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ (58; 52 బంతుల్లో 10x4, 0x6) క్రీజులోకి వచ్చినప్పటి నుంచి మంచి కాన్ఫిడెన్స్‌తో కనిపించాడు. వణికిస్తాడని భయపడ్డ షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. మొదట్లో తడబడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ (56; 49 బంతుల్లో 6x4, 4x6) తర్వాత రెచ్చిపోయాడు. ఒకానొక దశలో 32 బంతుల్లో 20 పరుగులు చేసిన అతడు.. షాదాబ్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో ఆఖరి మూడు బంతుల్ని వరుసగా 6, 6, 4 బాదేసి స్కోర్ వేగం పెంచాడు. 15వ ఓవర్లో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు. తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని 16.4వ బంతికి రోహిత్‌ను ఔట్ చేయడం ద్వారా షాదాబ్ విడదీశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే గిల్‌ను అఫ్రిది ఔట్ చేశాడు.
క్లాసీ రాహుల్.. డిస్ట్రక్టివ్ కోహ్లీ
వరుస ఓవర్లలో ఓపెనర్లు ఔటైనప్పటికీ టీమ్‌ఇండియా ఎక్కడా తడబడలేదు. కేఎల్ రాహుల్ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. శస్త్రచికిత్స తర్వాత చాన్నాళ్లకు క్రీజులో అడుగు పెట్టిన అతడు సొగసైన షాట్లతో మురిపించాడు. కోహ్లీ నెమ్మదిగా ఆడుతున్న తరుణంలో చక్కని బంతుల్ని అతడు బౌండరీకి తరలించాడు. తనదైన రీతిలో మంచి ఫుట్‌వర్క్‌తో ఆకట్టుకున్నాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. మరోవైపు కింగ్ డబుల్స్, సింగిల్స్‌తో అతడికి స్ట్రైక్ ఇచ్చాడు. దాంతో 38 ఓవర్లకు భారత్ 250కి చేరువైంది. మరికాసేపటికే విరాట్ 55 బంతుల్లో అర్ధశతకం బాదేశాడు. ఆఖరి పది ఓవర్లలో వీరిద్దరూ ఆడిన తీరు అమేజింగ్. ఈ దశలో రాహుల్ నెమ్మదించగా కోహ్లీ వేగం పెంచాడు. ఇదే క్రమంలో 84 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. మరోవైపు రాహుల్ 100 బంతుల్లో సాధించాడు. ఈ జోడీ 194 బంతుల్లో 233 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 356 స్కోర్ చేసింది.