AFG Vs BAN, Innings Highlights : కీలక మ్యాచ్‌లో జూలు విదిల్చిన బంగ్లా టైగర్స్ - మెహిది హసన్, శాంతో సెంచరీలు - అఫ్గాన్ ముందు భారీ టార్గెట్
Asia Cup 2023: ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్ స్టేజ్‌లో కీలక మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో రాణించింది. అఫ్గాన్ ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపింది.
AFG Vs BAN, Innings Highlights : ఆసియా కప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. అఫ్గానిస్తాన్‌తో లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఆటగాడు, ఐదేండ్ల తర్వాత ఓపెనర్‌గా ప్రమోట్ అయిన మెహిది హసన్ మిరాజ్ (119 బంతుల్లో 112, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నజ్ముల్ హోసేన్ శాంతో (105 బంతుల్లో 104, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రెచ్చిపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించింది. బ్యాటర్లు తమ కర్తవ్యాన్ని పూర్తిచేయడంతో ఇక బాధ్యత అంతా బౌలర్ల మీదకు చేరింది.
లాహోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు శుభారంభమే అందించారు.మహ్మద్ నయీమ్ (32 బంతుల్లో 28, 5 ఫోర్లు), మెహిది హసన్‌లు తొలి వికెట్‌కు 9.6 ఓవర్లలో 60 పరుగులు జోడించారు. ఆది నుంచే దూకుడుగా ఆడిన ఈ ఇద్దరూ.. తొలి ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టారు. అయితే ఈ జోడీని ముజీబ్ ఉర్ రెహ్మాన్ విడదీశాడు. వన్ డౌన్ లో వచ్చిన తౌహిద్ హృదయ్ (0)మరోసారి నిరాశపరిచాడు. గుల్బాదిన్ వేసిన 11వ ఓవర్లో అతడు ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఒక్కో ఇటుక కూర్చుతూ..
63 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయిన బంగ్లా ఇన్నింగ్స్‌ను హసన్‌తో కలిసి శాంతో పునర్నిర్మించాడు. ఈ ఇద్దరూ అఫ్గాన్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లను ధీటుగా ఎదుర్కున్నారు. వీళ్లు క్రీజులో కుదురుకున్నాక స్కోరు వేగం కూడా పెరిగింది. మిరాజ్ అయితే పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆటను మార్చుకున్నాడు. నబీ వేసిన 24వ ఓవర్లో మిరాజ్ సింగిల్ తీసి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత మిరాజ్, శాంతోలు కరీమ్ జనత్ బౌలింగ్‌లో తలా ఓ ఫోర్ కొట్టి బంగ్లా స్కోరును 150 పరుగులు దాటించారు. నబీ వేసిన 30వ ఓవర్ల మిరాజ్ ఓ బౌండరీ బాదాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీయడంతో ఈ ఇద్దరి భాగస్వామ్యం వంద పరుగులు పూర్తైంది. 30వ ఓవర్ వేసిన ఫరూఖీ వేసిన రెండో బాల్‌ను డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ కొట్టిన శాంటో ఈ టోర్నీలో రెండో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
65 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన మిరాజ్ ఆ తర్వాత జోరు పెంచాడు. శాంతో కూడా అదే లైన్ లోకి వచ్చాడు. ఫరూఖీ వేసిన 33వ ఓవర్లో శాంతో.. ఓ ఫోర్ తో పాటు సిక్సర్ కొట్టాడు. ముజీబ్ వేసిన 37వ ఓవర్లో భారీ సిక్సర్‌తో 90లలోకి చేరుకున్న మిరాజ్.. గుల్బాదిన్ వేసిన 41వ ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ తీసి తన కెరీర్‌లో రెండో శతకాన్ని పూర్తి చేశాడు. ఇక రషీద్ ఖాన్ వేసిన 42వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన శాంతో.. ముజీబ్ వేసిన 43వ ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ తీసి తన కెరీర్‌లో రెండో శతకాన్ని పూర్తి చేశాడు.
100+ partnership ✅
— AsianCricketCouncil (@ACCMedia1) September 3, 2023
Individual fifties ✅
Performing in a must-win encounter ✅
These two are on a roll! 😍#AsiaCup2023 #BANvAFG pic.twitter.com/1kjK2J3hd3
సెంచరీ తర్వాత కాలి గాయంతో ఇబ్బందులు పడిన మెహిది రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అతడి స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ (15 బంతుల్లో 25, 1 ఫోర్, 1 సిక్సర్) కూడా ధాటిగా ఆడటంతో బంగ్లా స్కోరు ఆఖర్లో రాకెట్ వేగాన్ని తలపించింది. ముజీబ్ వేసిన 45వ ఓవర్లో మూడో బంతికి పరుగు తీసే క్రమంలో శాంతో కాలు అదుపుతప్పి పడిపోవడంతో రనౌట్ అయ్యాడు. ఆఖర్లో కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (18 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) కూడా బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లా చివరి పది ఓవర్లలో ఏకంగా 103 పరుగులు రాబట్టింది. మరి ఈ భారీ లక్ష్యాన్ని అఫ్గాన్ ఛేదించగలదా..?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial