(Source: ECI/ABP News/ABP Majha)
IND Vs BAN, Innings Highlights: వారెవ్వా.. షకీబ్! టీమ్‌ఇండియాకు బంగ్లా టైగర్స్ టార్గెట్ 266
IND Vs BAN, Innings Highlights: బంగ్లాదేశ్ ఆకట్టుకుంది. టీమ్‌ఇండియాకు మెరుగైన టార్గెట్ ఇచ్చింది. 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.
IND Vs BAN, Innings Highlights:
బంగ్లాదేశ్ ఆకట్టుకుంది. ప్రేమదాసలో అద్భుతంగా పోరాడింది. ఆసియాకప్-2023లో వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న టీమ్‌ఇండియాకు మెరుగైన టార్గెట్ ఇచ్చింది. టాప్ ఆర్డర్ విఫలమైన దశ నుంచి బలంగా పుంజుకుంది. 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (80; 85 బంతుల్లో 6x4, 3x6) తనదైన పోరాటంతో బంగ్లా టైగర్స్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. తౌహిద్ హృదయ్ (54; 81 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీ బాదేశాడు. నసుమ్ అహ్మద్ (44; 45 బంతుల్లో 6x4, 1x6) ఆఖర్లో ఆకట్టుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ 3, మహ్మద్ షమి 2 వికెట్లు పడగొట్టారు.
టాప్ ఆర్డర్ కకావికలం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా టైగర్స్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. 6 ఓవర్లకే 3 వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోరు 13 వద్దే ఓపెనర్ లిట్టన్ దాస్ (0)ను మహ్మద్ షమి బౌల్డ్ చేశాడు. మరో 2 పరుగులకే తన్‌జిద్ హసన్ (13) వికెట్లను శార్దూల్ ఎగరగొట్టాడు. మరికాసేపటికే అనమల్ హఖ్ (4)ను అతడే ఔట్ చేశాడు. ఇక నిలబడ్డారు అనుకొనే క్రమంలోనే మెహదీ హసన్ మిరాజ్ (13)ను అక్షర్ పటేల్ పెవిలియన్‌కు పంపించాడు. అప్పటికి స్కోరు 14 ఓవర్లకు 59.
షకీబ్, హృదయ్ పోరాటం
టాప్ ఆర్డర్ వికెట్లు చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్‌ను కెప్టెన్ షకిబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్ ఆదుకున్నారు. టీమ్‌ఇండియా స్పిన్నర్లు, పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఊరించే బంతుల్ని వదిలేశారు. చెత్త బంతుల్ని వేటాడారు. సింగిల్స్, డబుల్స్‌తో వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. ఐదో వికెట్‌కు 115 బంతుల్లో 101 పరుగుల అత్యంత కీలక భాగస్వామ్యం అందించారు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న షకిబ్ ఆ తర్వాత వేగం పెంచడంతో 33 ఓవర్లు బంగ్లా స్కోరు 160/4కు చేరుకుంది. మరోవైపు హృదయ్ 77 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శార్దూల్ విడదీశాడు. 33.1వ బంతికి షకిబ్‌ను బౌల్డ్ చేశాడు. మరికాసేపటికే షమిమ్‌ను జడ్డూ, హృదయ్‌ను షమి ఔట్ చేయడంతో 41.2 ఓవర్లకు బంగ్లా 193/7తో నిలిచింది.
ఆఖర్లో ఆకట్టుకున్న నసుమ్
మిడిలార్డర్లో షకిబ్, హృదయ్ ఔటైనా బంగ్లా భారీ స్కోరు చేసిందంటే నసుమ్ అహ్మద్ పోరాటమే కారణం. బంతికో పరుగు చొప్పున సాధించాడు. హృదయ్‌తో కలిసి 32 (43 బంతుల్లో), మెహదీ హసన్‌తో కలిసి 45 (36 బంతుల్లో) విలువైన భాగస్వామ్యాలు అందించాడు. కీలకంగా మారిన అతడిని జట్టు స్కోరు 238 వద్ద ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేశాడు. ఆఖరికి మెహదీ హసన్ (29), తన్‌జిన్ హసన్ (14) అజేయంగా నిలిచారు.
బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్, తంజిద్ హసన్, అనముల్ హఖ్, షకిబ్ అల్ హసన్, తోహిడ్ హృదయ్, షమీమ్ హుస్సేన్, మెహెదీ హసన్ మిరాజ్, మెహెదీ హసన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
పిచ్ రిపోర్ట్: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆడిన వికెట్‌నే ఇచ్చారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో స్పిన్నర్లు రాణిస్తున్నారు. 21.1 సగటుతో 19 వికెట్లు పడగొట్టారు. వికెట్‌పై పచ్చిక ఉంది. మంచి బౌన్స్ లభిస్తుంది. స్పిన్నర్లు ప్రభావం చూపించినా బ్యాటర్లకు అనుకూలిస్తుంది.