Asia Cup 2023: ఈ బౌలింగ్‌తోనేనా మనం వరల్డ్ కప్ గెలిచేది? - పసికూనను కట్టడి చేయలేనివాళ్లు ప్రపంచాన్ని గెలుస్తారా!
ఆసియా కప్‌లో భారత్ ఆడిన రెండో మ్యాచ్‌లో మన బౌలర్ల ప్రదర్శన చూశాక అసలు వీళ్లు వరల్డ్ కప్ నెగ్గగలుగుతారా..? అన్న అనుమానం రావడం సర్వ సాధారణం.
Asia Cup 2023: అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ జట్టు వన్డేలు ఆడుతుందన్న సంగతి కూడా ఇంకా చాలా మందికి తెలియదు. ఆ జట్టుకు పసికూన అన్న ట్యాగ్ కూడా ఎక్కువే. అలాంటి టీమ్‌తో పోటీ అంటే మిగతా జట్లు లైట్ తీసుకుంటాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ అయితే 238 పరుగుల భారీ తేడాతో గెలిచింది. తొలుత నేపాల్ బౌలర్లను ఉతికారేసి తర్వాత ఆ జట్టును 103 పరుగులకు నిలువరించింది. కానీ భారత బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. నేపాల్‌ను ఏకంగా 230 పరుగులు కొట్టనిచ్చారు. స్టార్ ఇండియన్ పేసర్లు మహ్మద్ షమీ, సిరాజ్, హార్ధిక్ పాండ్యా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లు విఫలమయ్యారు. ఈ బౌలర్లతోనే మనం వచ్చే నెలలో వన్డే వరల్డ్ కప్ ఆడేది.
వాళ్లు హిట్టు.. మనం ఫట్టు..
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన నేపాల్‌ను షహీన్ షా అఫ్రిది త్రయం ఉక్కిరికిబిక్కిరి చేసింది. షహీన్.. ఐదు ఓవర్లే వేసి 2 వికెట్లు తీశాడు. నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లు మూడు వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగి నేపాల్‌ను 104 పరుగులకే ప్యాక్ చేశారు.
పోనీ పాకిస్తాన్‌తో నేపాల్ ఆడిన మ్యాచ్ వాళ్ల స్వదేశం (ముల్తాన్) లో జరిగింది అనుకుంటే భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లు పల్లెకెలె (శ్రీలంక) లో జరగగా అది కూడా బౌలింగ్‌కు అనుకూలించే వేదికనే. ఇదే పల్లెకెలెలో బంగ్లాదేశ్.. శ్రీలంకలు తమ తొలి మ్యాచ్ ఆడాయి. బంగ్లాను శ్రీలంక.. 164 పరుగులకే కట్టడి చేసింది. లంక ఫస్ట్ ఛాయిస్ బౌలర్లు (దుష్మంత చమీర, దిల్షాన్ మధుశంక, లాహిరు కుమార, వనిందు హసరంగ) లేకున్నా కసున్ రజిత, తీక్షణ, పతిరానలతోనే లంక ఫలితాలు రాబట్టింది. ఇదే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవకున్నా 165 పరుగులు చేయడానికి లంకను భయపెట్టింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి లంక.. ఐదు వికెట్లు కోల్పోయి 40 ఓవర్లు ఆడాల్సి వచ్చింది.
రోహిత్ సేన కుప్పకూలిందీ ఇక్కడే..
ఇక భారత్ - పాక్ మ్యాచ్ జరిగిందీ పల్లెకెలెలోనే. భారత టాపార్డర్ టపటప కూలగా ఇషాన్ కిషన్ - హార్ధిక్ పాండ్యాల తెగింపుతో 266 పరుగులు చేసిన భారత జట్టు చివర్లో కుప్పకూలింది. కానీ నేపాల్ వంటి పసికూన జట్టు అగ్రశ్రేణి జట్టుగా పేరున్న భారత బౌలర్లను అలవోకగా ఎదురుకుంది. ఈ మధ్య వన్డేలలో నిలకడగా రాణిస్తున్న సిరాజ్.. నేపాల్‌తో మ్యాచ్‌లో 9.2 ఓవర్లు వేసి 6.50 ఎకానమీ రేట్‌తో 61 పరుగులిచ్చాడు. శార్దూల్ ఠాకూర్.. 4 ఓవర్లు వేసి 6.50 ఎకానమీతో 26 రన్స్ ఇచ్చాడు. కుల్దీప్ పది ఓవర్లు వేసి 34 పరుగులే ఇచ్చినా వికెట్లు తీయలేదు. ఉన్నవారిలో రవీంద్ర జడేజా (10 ఓవర్లలో నాలుగు వికెట్లు) కాస్త బెటర్ అనిపించాడు.
ప్రపంచాన్ని నెగ్గగలమా..?
నేపాల్‌తో మ్యాచ్‌లో భారత బౌలింగ్ చూశాక టీమిండియా సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదిలిన అనుమానం ఇదే. పసికూనను పడగొట్టడానికి ఇంత తంటాలు పడుతున్న మన బౌలర్లు ప్రపంచ అగ్రశ్రేణి జట్లపై ఎలా ఆడగలవు..? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఇటువంటి దారుణ ప్రదర్శన అభిమానులను నిరాశకు గురిచేసేదే. బుమ్రా లేకపోయినా, కొన్ని క్యాచ్‌లు మిస్ అయినా ఆడేది నేపాల్‌తో అనే సంగతి మనోళ్లు మరిచినట్టున్నారు. అలా అని ప్రస్తుతం ఉన్న భారత బౌలర్ల సామర్థ్యాన్ని తక్కువ చేయలేం. 2020లో ఆస్ట్రేలియాను వాళ్ల స్వదేశంలో ఓడించి.. 2021లో ఇంగ్లాండ్‌పై దాదాపు సిరీస్ గెలిచినంత పనిచేసింది ఈ బౌలర్లే. గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లాండ్ జట్టు.. భారత్ నిర్దేశించిన 170 ప్లస్ టార్గెట్‌ను వికెట్ నష్టపోకుండా ఛేదించినప్పుడే ఈ బౌలర్లతో ప్రపంచకప్ నెగ్గడం కాని పని అని తేలిపోయింది. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు అంత గొప్ప ప్రదర్శన చేసింది లేదు. ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లోనూ అదే తడబాటు. మరి ఈ బౌలర్లతో వరల్డ్ కప్ సాధ్యమేనా..? దశాబ్దం తర్వాత భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ను భారత జట్టు తిరిగి దక్కించుకోగలదా..? ఇవన్నీ ప్రస్తుతానికైతే సమాధానం దొరకని ప్రశ్నలే... !
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial