Asia Cup 2022: రోహిత్.. నీకసలు కెప్టెన్సీ తెలుసా?
Rohit Sharma: శ్రీలంక పోరులో ఓటమిని మూటగట్టుకొని టీమ్ఇండియా ఇంటి దారి పట్టింది! దాంతో సోషల్ మీడియాలో రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! మా కోహ్లీ, మా మహీ గొప్పంటూ ట్రోలింగ్ మొదలెట్టారు.
Rohit Sharma Captaincy : ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన కెప్టెన్. ఆసియాకప్‌లు, ద్వైపాక్షిక సిరీసుల్లో గెలిపించిన అనుభవం. ప్రశాంత స్వభావం. చిరునవ్వుతో సవాళ్లకు ఎదురు నిలిచే తత్వం! చకచకా వ్యూహాలు రచించడం.. మ్యాచ్ సందర్భానికి తగినట్టు బౌలర్లను ప్రయోగించడంలో దిట్ట!
గతంలో రోహిత్ శర్మ అంటే ఇదీ!
పరుగులు చేయడం లేదన్న నిరాశ ఒకవైపు! సరైన ఆటగాళ్లు అందుబాటులో లేరన్న బాధ మరోవైపు! చూస్తుండగానే మ్యాచులు చేజారుతున్నాయన్న దిగులు ఇంకో వైపు! ప్రయోగాలు చేస్తూనే విజయాలు సాధించాలన్న ఒత్తిడి.. సహచరులు రాణించకపోతే వెన్నుతట్టాల్సింది పోయి వెన్ను చూపిస్తున్న తీరు!
ప్రస్తుతం రోహిత్ శర్మ అంటే ఇదీ!
ఆసియా కప్‌లో టీమ్‌ఇండియాది తిరుగులేని ఆధిపత్యం. ఇప్పటి వరకు ఏడుసార్లు ట్రోఫీ సొంతం చేసుకుంది. ఎనిమిదో సారీ ఖాయమే అన్నట్టుగా బరిలోకి దిగింది. లీగు మ్యాచుల్లో అదరగొట్టింది. ఆరంభ మ్యాచులోనే పాక్‌పై దుమ్మురేపింది. హాంకాంగ్ మ్యాచును సునాయాసంగా కైవసం చేసుకుంది. అలాంటిది సూపర్-4 దశలో తొలి మ్యాచులోనే ఓడిపోవడం అభిమానులను హర్ట్ చేసింది. తప్పక నిలవాల్సిన శ్రీలంక పోరులో ఓటమిని మూటగట్టుకొని దాదాపుగా ఇంటి దారి పట్టింది! దాంతో సోషల్ మీడియాలో రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! మా కోహ్లీ గొప్పని కొందరు, మా మహీ గొప్పని మరికొందరు హిట్‌మ్యాన్‌పై ట్రోలింగ్ మొదలెట్టారు. నిజానికి అతడి నాయకత్వం మరీ బాగాలేదా! చూద్దాం!
విపత్కర పరిస్థితుల్లో కెప్టెన్సీ
మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత టీమ్‌ఇండియాను విరాట్ కోహ్లీ అద్భుతంగా నడిపించాడు. ద్వైపాక్షిక సిరీసుల్లో జైత్ర యాత్ర కొనసాగించాడు. విలువైనా ఆటగాళ్లు అందుబాటులో ఉండటం ఆ ఇద్దరికీ మేలు చేసింది. అయితే 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. దాదాపుగా సెమీస్ లేదంటే ఫైనళ్లలో ఓటమి పాలైంది. దాంతో టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒక్కరే నాయకుడు ఉండాలని బీసీసీఐని రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది. అప్పట్నుంచి అతడు గాయాల పాలవ్వడమో లేదంటే అందుబాటులో ఉండకపోవడమో అవుతోంది. ఇదే టైమ్‌లో జట్టుకు వెన్నెముకైన కింగ్ కోహ్లీ, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోయారు. బౌలర్లు పదేపదే గాయాల పాలవుతున్నారు. విపరీతమైన క్రికెట్ వల్ల మరికొందరికి విశ్రాంతి ఇవ్వక తప్పడం లేదు. కూర్పు కుదరని స్థితిలో జట్టును తీసుకొని రోహిత్ దుబాయ్‌కు వచ్చాడు.
ప్రయోగాలతో ప్రశాంతత కరవు
సాధారణంగా రోహిత్ శర్మ ప్రశాంతంగా ఉంటాడు. ఆటగాళ్లు విఫలమైతే వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు. మైదానంలో ఎక్కువగా వారితోనే ఉంటాడు. మ్యాచులు చేజారే పరిస్థితి వస్తే చకచకా మార్పులు చేసేవాడు. అలాంటిది ఆసియాకప్‌లో అతడిపై విపరీతమైన ఒత్తిడి కనిపించింది. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు సరిపడా స్కోరు చేయలేకపోవడం ధోనీ ఉన్నప్పటినుంచే కొనసాగుతోంది. ఆ బలహీనత నుంచి బయట పడేందుకు ఈ సారి ద్రవిడ్, రోహిత్ కలిసి ప్రయోగాలు మొదలెట్టారు. ఏదేమైనా కానివ్వండి! అటాకింగ్ అప్రోచ్‌నే కొనసాగించాలని వీరిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. వికెట్లు పడ్డా బాదుడు ఆపొద్దని భావించారు.
ఓటములతో ఫ్రస్ట్రేషన్
ఇలాంటప్పుడు కొన్ని మ్యాచులు ఓడిపోవడం అత్యంత సహజం. ఇంగ్లాండుకూ ఇదే జరిగింది. కుదురుకున్నార వాళ్లు అద్భుతాలు చేయడం మొదలు పెట్టారు. కానీ ఇండియాలో ప్రయోగాలూ కావాలి. మ్యాచులూ గెలవాలి అన్న పరిస్థితి. లేదంటే సోషల్ మీడియా, మీడియాలో ముప్పేట దాడి! తామే గొప్ప విశ్లేషకులం అన్న రీతిలో విశ్లేషణలు, సూచనలూ ఇచ్చేస్తుంటారు. దాంతో హిట్‌మ్యాన్ ప్రెజర్ ఫీలవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఆటగాళ్లు విఫలమైతే వెన్నుతట్టే అతడే ఇప్పుడు తప్పులు జరిగితే ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాడు. పంత్, భువీ, అర్షదీప్ విషయంలో అతడి యానిమేటెడ్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కఠిన నిర్ణయాలు తప్పవ్!
మరో రెండు నెలల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఉంది. ఇందులో గెలవాలంటే రోహిత్ శర్మ చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కష్టమో, నిష్ఠురమో అటాకింగ్ అప్రోచ్ కొనసాగించడమే మేలు. ఎందుకంటే ప్రతిసారీ టీమ్‌ఇండియా టాస్ గెలుస్తుందన్న గ్యారంటీ లేదు. అలాంటప్పుడు డిఫెండ్ చేసుకొనే టార్గెట్లు నిర్దేశించడం అవసరం. మరి ఆచితూచి ఆడితే మంచి స్కోరెలా వస్తుంది? దూకుడుగా ఆడితేనే కదా పరుగులు వస్తాయి! టాప్ ఆర్డర్‌లో ఏ ఇద్దరు నిలిచినా స్కోరు 180-190కి చేరుకుంటుంది. ఈ ప్రయోగం చేసేటప్పుడు వైఫల్యాలూ సహజమే. కొన్నిసార్లు అనుకున్న స్కోరు చేయకుండానే ఆలౌట్ అవుతారు. అలాంటప్పుడే రోహిత్ చిరునవ్వుతో ముందుకు సాగాలి. బౌలింగ్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పట్లాగే ఆటగాళ్లకు అండగా నిలవాలి. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, భువీ, హార్దిక్ పాండ్య గాయపడకుండా చూసుకోవాలి. అవేశ్ ఖాన్, శార్దూల్, అర్షదీప్, దీపక్ చాహర్ ఎలాగూ అందుబాటులో ఉంటారు. స్పిన్నర్లను కాపాడుకోవాలి. కచ్చితమైన వ్యూహాలు రచించి అమలు చేయాలి. ఒకవేళ పాచిక పారకపోతే ప్లాన్-బి రెడీ చేసుకోవాలి. లేదంటే విమర్శలూ తప్పవు! విజయాలూ రావు! భవిష్యత్తులో మేలూ జరగదు!