IND vs AFG, Match Highlight: అంతా అయిపోయాక అదరగొట్టిన టీమిండియా - ఆఫ్ఘన్‌పై 101 పరుగులతో విక్టరీ!
Asia Cup 2022, IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌పై జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ 101 పరుగులతో ఘనవిజయం సాధించింది.
ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 111 పరుగులకు పరిమితం అయింది. దీంతో భారత్ 101 పరుగులతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (122 నాటౌట్: 61 బంతుల్లో, 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు) మూడు సంవత్సరాల తర్వాత సెంచరీ సాధించడం విశేషం.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. రోహిత్ శర్మ దూరం కావడంతో ఓపెనర్‌గా ముందుకు వచ్చిన విరాట్ కోహ్లీ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. భారీ షాట్లు ఆడుతూ ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేఎల్ రాహుల్ (62: 41 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) మరో వైపు తనకు చక్కటి సహకారం అందించాడు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 12.4 ఓవర్లలో 119 పరుగులు జోడించారు.
అనంతరం సూర్యకుమార్ యాదవ్ (6: 2 బంతుల్లో, ఒక సిక్సర్) విఫలం అయినా... రిషబ్ పంత్‌తో (20 నాటౌట్: 16 బంతుల్లో, మూడు ఫోర్లు) కలిసి కోహ్లీ విశ్వరూపం చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో కూడా రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 18 పరుగులు రాబట్టడంతో భారత్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది.
213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు భువనేశ్వర్ చుక్కలు చూపించాడు. మొదటి ఓవర్ నుంచి వరుసగా నాలుగు ఓవర్లు వేసిన భువీ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. అర్ష్‌దీప్ కూడా ఒక వికెట్ తీయడంతో ఆఫ్ఘన్ 21 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
అయితే వన్‌డౌన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్‌కు (64: 59 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) చివర్లో రషీద్ ఖాన్ (15: 19 బంతుల్లో, రెండు ఫోర్లు), ముజీబ్ ఉర్ రహమాన్ (18: 13 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) సహకరించడంతో ఆఫ్ఘన్ ఆలౌట్ కాలేదు. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 111 పరుగులకు పరిమితం అయింది. భారత బౌలర్లలో భువీకి ఐదు వికెట్లు దక్కగా, అర్ష్‌దీప్ సింగ్, అశ్విన్, హుడా తలో వికెట్ తీసుకున్నారు.
View this post on Instagram