Steve Smith in Test: వార్న్ వారసుడిగా వచ్చి బ్రాడ్మన్ రికార్డులను బద్దలుకొట్టి - వందో టెస్టు ఆడనున్న స్మిత్
ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ గురువారం ఇంగ్లాండ్ తో జరుగబోయే మూడో టెస్టులో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాడు.
Steve Smith in Test: ఆధునిక క్రికెట్ లో.. మరీ ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో దిగ్గజం అనదగ్గ అర్హత ఉన్న ఆటగాళ్లలో నిస్సందేహంగా ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఒకడు. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్, మైఖెల్ క్లార్క్ లు నిష్క్రమించిన తర్వాత వారి స్థానాన్ని భర్తీ చేస్తూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు వెన్నెముకలా మారిన స్మిత్ గురువారం ఇంగ్లాండ్ తో లీడ్స్ వేదికగా జరుగబోయే మూడో టెస్టులో అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నాడు. స్మిత్ కు ఇది వందో టెస్టు. ఈ నేపథ్యంలో స్మిత్ టెస్టు ప్రయాణం ఇదిగో...
వార్న్ వారసుడిగా వచ్చి..
గడిచిన దశాబ్దకాలంలో బ్యాటర్ గా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన స్మిత్ ఆసీస్ జట్టులోకి వచ్చినప్పుడు షేన్ వార్న్ వారసుడు అన్నారు. లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన స్మిత్.. ఆనతికాలంలోనే తాను ఆల్ రౌండర్ అని నిరూపించుకున్నాడు. పాకిస్తాన్ లో ఇదే ఇంగ్లాండ్ గడ్డపై అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులో అతడు బ్యాటింగ్ కు వచ్చిన స్థానం 7. ఆ టెస్టులో అతడిని ఎంపిక చేసింది కూడా స్పెషలిస్టు లెగ్ స్పిన్నర్ గానే కావడం గమనార్హం. అయితే విచిత్రంగా అతడికి తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం స్మిత్ 3 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో అతడు 77 పరుగులు చేసి ‘ఈ కుర్రాడిలో విషయం ఉంది’అని సెలక్టర్లు గుర్తించేలా చేసుకున్నాడు.
2010-11లో అతడు ఆడిన ఐదు టెస్టులలోని 10 ఇన్నింగ్స్ లలో 28 సగటుతో 259 పరుగులే చేశాడు. బౌలింగ్ కూడా ఆకట్టుకోలేదు. దీంతో అతడిని టీమ్ నుంచి తప్పించింది ఆసీస్ మేనేజ్మెంట్. కానీ 2013లో తిరిగి జట్టులోకి వచ్చిన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగుల్లో తన బ్యాటింగ్, ఫీల్డింగ్ విన్యాసాలతో స్మిత్ ను టాపార్డర్ కు పంపింది ఆసీస్. 2013 - 15 మధ్యలో స్మిత్ పీక్స్ చూశాడు. ఆ రెండేండ్లలో అతడు ఆడిన 31 టెస్టులలో 3,117 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 12 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలున్నాయి. క్లార్క్ నిష్క్రమణతో 2015లో స్మిత్ కు సారథ్య బాధ్యతలను అప్పజెప్పింది ఆసీస్..
కెప్టెన్ గా అది మాయని మచ్చ..
సారథిగా కూడా స్మిత్ సక్సెస్ అయ్యాడు. బ్యాటర్ గా రాణిస్తూనే సారథిగా కూడా జట్టును నడిపించాడు. కెప్టెన్ గా 31 టెస్టులకు సారథ్యం వహించిన స్మిత్.. 3,104 పరుగులు చేశాడు. సగటు 65కు పైమాటే. సారథిగా కూడా 12 సెంచరీలు సాధించాడు. కానీ 2018లో సౌతాఫ్రికాలో జోహన్నస్బర్గ్ వేదికగా జరిగిన టెస్టులో ‘బాల్ టాంపరింగ్’ వివాదం అతడి కెరీర్ కు మాయని మచ్చగా మారింది. దీంతో అతడు ఏడాది పాటు నిషేధం కూడా ఎదుర్కున్నాడు. కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. 2019లో రీఎంట్రీ ఇచ్చినా స్మిత్ పూర్వపు ఫామ్ ను అందుకోలేకపోయాడు. 2020 - 2021 మధ్య లో 8 టెస్టులు ఆడిన స్మిత్.. 503 పరుగులు మాత్రమే సాధించాడు. కానీ 2022లో స్మిత్ మళ్లీ పూర్వపు ఫామ్ ను అందుకున్నాడు.
బ్యాక్ ఇన్ ఫామ్..
ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ తో మునపటి ఫామ్ ను అందుకున్న స్మిత్.. కొద్దిరోజుల క్రితమే ది ఓవల్ వేదికగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో సెంచరీ సాధించాడు. యాషెస్ సిరీస్ లో తొలి టెస్టులో ఫర్వాలేదనిపించినా లార్డ్స్ లో సెంచరీ చేశాడు.
బ్రాడ్మన్ తర్వాత అతడే..
టెస్టులలో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన వారిలో స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్.. 41 సెంచరీలు చేస్తే స్మిత్.. 99 టెస్టులలో 32 సెంచరీలు చేశాడు. ఆసీస్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్.. టెస్టులలో 29 సెంచరీల రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. స్మిత్ వందో టెస్టు నేపథ్యంలో పాంటింగ్ సైతం స్మిత్ ను .. ‘ఆస్ట్రేలియా డాన్ బ్రాడ్మన్ తర్వాత సెకండ్ గ్రేటెస్ట్ బ్యాటర్. గణాంకాల పరంగా చూసినా స్మిత్ అందుకు అర్హుడే..’ అని ప్రశంసించడం గమనార్హం.
టెస్టులలో స్మిత్..
టెస్టులు : 99
రన్స్ : 9,113
సగటు : 59.56
సెంచరీలు : 32
హాఫ్ సెంచరీలు : 37
Join Us on Telegram: https://t.me/abpdesamofficial