Brook Out Viral: అదృష్టం పొమ్మంది దురదృష్టం రమ్మంది - విచిత్రంగా ఔట్ అయిన బ్రూక్
Ashes 2023: యాషెస్ సిరీస్ - 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విచిత్రంగా ఔటయ్యాడు.
Brook Out Viral: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా యాషెస్ సమరం మొదలైంది. నేడు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ను దురదృష్టం వెంటాడింది. ఎల్బీడబ్ల్యూ, క్యాచ్ ఔట్, రనౌట్ వంటివాటితో పాటు నేరుగా బౌల్డ్ కాకపోయినా అతడు నిష్క్రమించాల్సి వచ్చింది.
ఏం జరిగిందంటే..
అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది అన్న చందంగా తయారైంది తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్ పరిస్థితి. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్.. 37 బంతుల్లోనే 4 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. స్పిన్ ఆడటంలో ఇబ్బందులు పడే బ్రూక్ బలహీనతను పసిగట్టిన ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్.. పదే పదే బ్రూక్‌కు నాథన్ లియన్‌తోనే ఎక్కువ ఓవర్లు వేయించాడు.
ఈ క్రమంలో 38వ ఓవర్ వేసిన లియాన్ రెండో బంతిని ఆఫ్ బ్రేక్ గా సంధించాడు. బంతి పిచ్‌కు తాకి ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చి బ్రూక్ లెఫ్ట్ థై ప్యాడ్‌కు తాకి అక్కడే గాల్లోకి లేచింది. అయితే బంతి ఎటు వైపు ఉందో అర్థం కాక బ్రూక్‌తో పాటు వికెట్ కీపర్ అలెక్స్ కేరీ, స్లిప్ ఫీల్డర్స్ అటూ ఇటూ చూస్తుండగానే బంతి పైనుంచి వచ్చి బ్రూక్ నడుముకు తాకి అక్కడే కిందపడి రెండో స్టెప్ లో బెయిల్స్‌ను గిరాటేసింది. దీంతో బ్రూక్ నిరాశగా వెనుదిరిగాడు.
A freak dismissal.
— England Cricket (@englandcricket) June 16, 2023
Live clips/Scorecard: https://t.co/TZMO0eJDwY pic.twitter.com/cIUQaANJ2x
బ్రూక్ నిష్క్రమణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసిన చాలా మంది బ్రూక్‌ను దురదృష్టం వెంటాడిందని కామెంట్స్ చేస్తున్నారు. పలువురు నెటిజన్లు ‘అన్ లక్కీ బ్రూక్’అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బజ్ బాల్ దృక్పథంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ అందుకు తగ్గట్టుగానే ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో మూడో సెషన్ కొనసాగుతుండగా 68 ఓవర్లకే 339 పరుగులు చేసింది. రన్ రేట్ 4.50కు పడిపోకుండా ఇంగ్లాండ్ ధాటిగా ఆడుతోంది. అయితే క్రమం తప్పకుండా వికెట్లు కూడా కోల్పోతుంది. ఇప్పటికే ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది. జో రూట్ మరో సెంచరీ (135 బంతుల్లో 91 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) దిశగా దూసుకుపోతుండగా .. జానీ బెయిర్ స్టో (78 బంతుల్లో 78, 12 ఫోర్లు) వీరబాదుడు బాదాడు. జాక్ క్రాలే (61) కూడా రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ నాథన్ లియాన్‌కు నాలుగు వికెట్లు పడ్డాయి. ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ (1) తీవ్రంగా నిరాశపరిచాడు. హెజిల్‌వుడ్ బౌలింగ్‌లో అతడు పెవిలియన్ చేరాడు.
That's our Jonny 💪
— England Cricket (@englandcricket) June 16, 2023
Live clips/Scorecard: https://t.co/TZMO0eJ5Hq@jbairstow21 🏴 #ENGvAUS 🇦🇺 pic.twitter.com/8CmZfRYdED