Bumrah Vs Arshdeep: నాలుగో టెస్టులో బుమ్రా లేకుంటే.. ఆ పేసర్ ను ఆడించండి.. అతని వల్ల చాలా అనుకూలతలు ఉన్నాయి.. మాజీ క్రికెటర్ వ్యాఖ్య
ఇప్పటివరకు రెండు టెస్టులాడిన బుమ్రా.. 12 వికెట్లతో టాప్-2లో నిలిచాడు. తొలి, 3వ టెస్టులో తను బరిలోకి దిగగా, రెండో టెస్టులో ఆడలేదు. నాలుగో టెస్టు చాలా ముఖ్యమైన బుమ్రా ఆడటంపై దృష్టి నెలకొంది.

Ind Vs Eng Manchestar Test Latest Updates: ఈనెల 23 నుంచి మొదలయ్యే నాలుగో టెస్టులో భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఆడతాడా..? లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. తొలి టెస్టు ఆడిన బుమ్రా, రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత మూడో టెస్టులో ఆడాడు. అయితే నాలుగో టెస్టులో అతడిని ఆడించడంపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా బుమ్రాను మూడు టెస్టులు మాత్రమే ఆడిస్తామని టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంది. నిజానికి మూడు, నాలుగు టెస్టుల మధ్య పది రోజుల వరకు గ్యాప్ వచ్చినప్పటికీ, బుమ్రాను ఆడించడంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే ఒకవేళ బుమ్రాను ఆడించకపోతే మరో పేసర్ ను ఆడించాలని టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే స్పష్టం చేశాడు. ఈ మార్పు వల్ల జట్టుకు అదనపు ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నాడు.
Arshdeep Singh suffered a cut on his bowling hand during a training nets session while stopping a ball.
— InsideSport (@InsideSportIND) July 19, 2025
Source: Indian Express#ENGvsIND #ArshdeepSingh #TeamIndia #CricketTwitter pic.twitter.com/WIjK3bF3Hc
స్పిన్నర్లకు లాభం..
బుమ్రా ఒకవేళ నాలుగో టెస్టుకు ఓకే అంటే అతడిని ఆడించవచ్చని, ఒకవేళ బుమ్రా సిద్ధంగా లేకపోతే అతని స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ ను ఆడించాలని రహానే సూచించాడు. లెఫ్టార్మ్ పేస్ వల్ల జట్టులో వైవిధ్యం వస్తుందని, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నైపుణ్యం అర్షదీప్ సొంతమని వ్యాఖ్యానించాడు. ఇక లెఫ్టార్మ్ పేసర్ ఆడటం వల్ల రఫ్ క్రియేట్ అయ్యి, స్పిన్నర్లకు యూజ్ అవుతుందని పేర్కొన్నాడు. ఇక తొలి మూడు టెస్టుల్లాగానే నాలుగో టెస్టులో కూడా పిచ్ ఉన్నట్లయితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఆడించాలని, పేస్ కు అనుకూలమైతే అర్షదీప్ ను ఆడిస్తే మేలని పేర్కొన్నాడు. మరోవైపు ప్రాక్టీస్ సెషన్లో అర్షదీప్ కు గాయమైందని, అతడిని ప్రస్తుతం మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని తెలుస్తోంది. అతని గాయంపై త్వరలోనే స్పష్టత రానుంది.
అది సరికాదు..
కేవలం ముగ్గురు స్పెషలిస్టు బౌలర్లతోనే బరిలోకి దిగడం సరికాదని రహానే పేర్కొన్నాడు. అదనపు బ్యాటర్ వల్ల 30-35 పరుగులు అదనంగా రావొచ్చేమోనని, స్పెషలిస్టు స్పిన్నర్ అది కూడా వికెట్ టేకర్ బౌలర్లు ఉంటే జట్టుకు ఎంతో లాభమని గుర్తు చేశాడు. టెస్టుల్లో 20 వికెట్లు తీయాలంటే కచ్చితంగా నలుగురు స్పెషలిస్టు బౌలర్లు ఉండాలని సూచించాడు. బౌలర్ల వల్లే మ్యాచ్ లు గెలిచేందుకు మరింత ఆస్కారం ఏర్పడుతుందని వ్యాఖ్యానించాడు. ఇక ఐదు టెస్టుల టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. సిరీస్ లో సజీవంగా ఉండాలంటే నాలుగో టెస్టులో కనీసం డ్రా చేసుకోవాలి లేదా గెలుపొందాలి. అప్పుడే భారత్ కు సిరీస్ లో ముందంజ వేసే అవకాశం ఉంటుంది. ఇక నాలుగో టెస్టు వేదికైన మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ కు మంచి రికార్డు ఉంది.




















