British Parliament Felicitates Ganguly: లార్డ్స్‌లో చొక్కా విప్పి 20 ఏళ్లు! అదే రోజు దాదాకు బ్రిటన్ పార్లమెంటు సన్మానం
British Parliament Felicitates Ganguly: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అరుదైన గౌరవం అందుకున్నాడు. బ్రిటన్ పార్లమెంటు ఆయనను ప్రత్యేకంగా సత్కరించింది.
British Parliament Felicitates Ganguly: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అరుదైన గౌరవం అందుకున్నాడు. బ్రిటన్ పార్లమెంటు ఆయనను ప్రత్యేకంగా సత్కరించింది. నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచిన ఆనందంలో లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి గిరగిరా తిప్పి 20 ఏళ్లు పూర్తైన రోజే సన్మానం జరగడం ప్రత్యేకం.
'ఒక బెంగాలీగా బ్రిటిష్ పార్లమెంటు నన్ను సత్కరించింది. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆరు నెలల క్రితమే వారు నన్ను సంప్రదించారు. ఏటా ఇలాంటి పురస్కారం ఇస్తుంటారు. ఈసారి నాకు దక్కింది' అని గంగూలీ అన్నారు.
సరిగ్గా 20 ఏళ్ల నాట్ వెస్ట్ సిరీసులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 320+ స్కోరును ఛేదించింది. ఛేదనలో గంగూలీ తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ కలిసి విజయం అందించారు. గెలిచిన ఉద్వేగంలో దాదా లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పీ గిరగిరా తిప్పాడు. అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఫ్లింటాఫ్ ముంబయిలో ఇలాగే చేయడంతో గంగూలీ గట్టిగా బదులిచ్చాడు. జులై 13తో ఈ ఘటనకు 20 ఏళ్లు పూర్తయ్యాయి.
'అవును, ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. ఆ ఘటన (చొక్కా విప్పడం) జరిగి 20 ఏళ్లైంది. అవన్నీ మధుర క్షణలు. ఇంగ్లాండ్ గడ్డపై ఆంగ్లేయులను ఓడించడం కన్నా మరో గొప్పదనం ఉండదు. ప్రస్తుత టీమ్‌ఇండియా సైతం అదే చేస్తోంది. టీ20 సిరీస్ గెలిచారు. వన్డే సిరీసులో 1-0తో ఆధిక్యంలో ఉన్నారు' అని దాదా అన్నారు.
ఇంగ్లాండ్‌లో ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమేనని సౌరవ్ అన్నారు. ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. బౌలర్లు అద్భుతాలు చేయగలరని తెలిపారు. 'ఇంగ్లాండ్ అంటేనే ఇలా ఉంటుంది మరి! తొలి వన్డేలో బుమ్రా, షమి వేసిన ఫస్ట్ స్పెల్ అద్భుతం. ఆంగ్లేయుల నుంచి ఆటను లాగేసుకున్నారు. టీమ్‌ఇండియా బ్యాటింగ్ బాగా చేసి 10 వికెట్ల తేడాతో గెలిచింది. 110 పరుగులను వికెట్ పోకుండా కొట్టారంటే ఎంత బాగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైతే అంతా బాగుంది' అని ఆయన వెల్లడించారు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమ్‌ఇండియా ఓడిపోవడంపై గంగూలీ స్పందించారు. 15 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెలిచే ఛాన్స్ త్రుటిలో చేజారిందని పేర్కొన్నారు. 'అవును, ఆటంటే ఇలాగే ఉంటుంది. గెలిచినందుకు ఇంగ్లాండ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆఖరి రోజు వారు బాగా ఆడారు. నాలుగో ఇన్నింగ్స్‌లో 400 పరుగులు ఛేదించడం సులభమేమీ కాదు. అందులోనూ అది అత్యధిక ఛేదన. టెస్టు మ్యాచ్ సిరీస్ ఆ రేంజ్‌లో జరిగింది మరి. టీ20 సిరీస్ గెలిచాం. వన్డేలూ కైవసం చేసుకుంటే మేం విజయవంతం అయినట్టే' అని ఆయన అన్నారు.
తమ కుటుంబం ఎక్కువగా లండన్‌లోనే ఉంటుందని దాదా గుర్తు చేశారు. తమ కుమార్తె ఇంగ్లాండ్‌లోనే చదువుకుంటుందని వెల్లడించారు. లండన్‌లో గడపడం తనకెంతో ఆనందంగా అనిపిస్తుందని పేర్కొన్నారు.