Badminton Asia Team Championships:చైనా గండాన్ని దాటని భారత్, క్వార్టర్స్‌లో తప్పని ఓటమి
Badminton Asia Team Championships 2024: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో చివరి గ్రూప్ పోరులో భారత్ 2-3తో చైనా చేతిలో ఓడింది.
Indian men's team lost to China in a dead rubber in Badminton Asia Championships: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో చివరి గ్రూప్ పోరులో భారత్ 2-3తో చైనా చేతిలో ఓడింది. 4-1 తేడాతో హాంకాంగ్‌ను ఓడించిన భారత్.. క్వార్టర్స్‌లో మాత్రం కీలక ఆటగాళ్లు దూరమవడంతో ఓటమి పాలైంది. సింగిల్స్‌లో ప్రణయ్ 6-21, 21-18, 21-19తో వెంగ్ హాంగ్‌పై గెలిచి భారత్‌కు శుభారంభం అందించాడు. కానీ డబుల్స్‌లో అర్జున్-ధ్రువ్ జోడీ 15-21, 21-19, 19-21తో చెన్ యంగ్-లీ యీ జంట చేతిలో ఓడడంతో స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాతి సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-11, 21-16తో లీయ్ లాన్‌ను ఓడించి మళ్లీ భారత్‌ను ముందంజలో నిలిపాడు. రెండో డబుల్స్‌లో సూరజ్-పృథ్వీ కృష్ణమూర్తి 13-21, 9-21తో రెన్ యూ-హవో నాన్ చేతిలో ఓడడంతో పోరు ఉత్కంఠభరితంగా మారింది. నిర్ణయాత్మక సింగిల్స్‌లో చిరాగ్ సేన్ 15-21, 16-21తో వాంగ్ జెంగ్ చేతిలో తలొంచడంతో ఓటమి తప్పలేదు. చైనా చేతిలో పరాజయంతో గ్రూప్-ఏలో రెండో స్థానంతో ముగించిన భారత్ నేడు క్వార్టర్స్‌లో జపాన్‌తో తలపడనుంది. మరోవైపు భారత్ మహిళల టీమ్ విభాగం క్వార్టర్స్‌లో హాంకాంగ్‌ను ఢీకొంటుంది. సెమీస్ చేరితే పతకం ఖాయం అవుతుంది.
అద్భుతం చేసిన భారత మహిళలు
ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్( Badminton Asia Team Championships)లో పటిష్ఠ చైనా(China)కు భారత్(Bharat) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్-2024 టోర్నీలో టాప్ సీడ్ చైనా జట్టును మట్టికరిపించి టేబుల్ టాపర్‌గా నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అద్భుత ఆటతీరుతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా భారత్- చైనా మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భాగంగా తొలుత పీవీ సింధు.. చైనా ప్లేయర్ హాన్ యేతో తలపడింది. మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సింధు 21-17, 21-15తో హాన్‌ను ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. అక్టోబర్ నుంచి టోర్నీలకు దూరంగా ఉన్న సింధు సింగిల్స్ పోరులో హాన్ యుపై గెలిచింది. నలభై నిమిషాల పాటు సాగిన పోరులో సింధు అద్భుత ప్రదర్శన కనబరిచింది.
పోరాడిన డబుల్స్ జోడీలు....
ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జంట అశ్విన్ పొన్నప్ప- తనీషా క్రాస్టోలను ఓడించిన చైనా ద్వయం లూయీ- టాన్ 1-1తో స్కోరు సమం చేసింది. అనంతరం.. అష్మిత చలీహా వాంగ్ జీ యీ చేతిలో ఓడటం(21-13, 21-15)తో చైనా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత ద్వయం త్రెసా- గాయత్రి.. లి- లువోల(10-21, 21-18, 21-17)ను ఓడించి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అన్మోల్ ఖర్బ్.. వూ లువో తలపడింది. భారత జట్టు టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పదిహేడేళ్ల అన్మోల్ ఖర్బ్ పట్టుదలగా పోరాడింది. 472వ ర్యాంకర్ అయిన అన్మోల్.. 172వ ర్యాంకర్ లువోను 22-20, 14-21, 21-18తో ఓడించి జట్టును నాకౌట్‌కు తీసుకెళ్లింది. దీంతో మహిళల విభాగంలో భారత్ 3-2తో చైనాపై అద్భుత విజయం సాధించింది.