Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సిన్నర్, రెండు సెట్లు చేజారిన అద్భుత పోరాటం
Jannik Sinner: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో యువ ఆటగాడు జానిక్ సిన్నర్ విజేతగా నిలిచాడు. సెమీస్‌లో పదిసార్లు ఛాంపియన్ నొవాక్ జొకోవిచ్‌పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
Australian Open Men Final 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్((Australian Open 2024)లో యువ ఆటగాడు జానిక్ సిన్నర్ విజేతగా నిలిచాడు. సెమీస్‌లో పదిసార్లు ఛాంపియన్ నొవాక్ జొకోవిచ్( Novak Djokovic)పై గెలిచిన సిన్నర్... ఫైనల్లోనూ అద్భుతంగా పోరాడి టైటిల్ కైవసం చేసుకున్నాడు. తొలి రెండు సెట్లు చేజారినా ఇటలీకి చెందిన 22 ఏళ్ల జానిక్ సిన్నర్(Jannik Sinner) అద్భుత పోరాటంతో విజయం సాధించాడు. కెరీర్‌లో మొదటిసారి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ముద్దాడాడు. ఫైనల్లో నాలుగో సీడ్ సిన్నర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3తో మూడో సీడ్ రష్యన్ డానిల్ మెద్వెదెవ్‌కు షాకిచ్చాడు. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన సమరంలో సిన్నర్ 14 ఏస్‌లు సంధిస్తే మెద్వెదెవ్ 11 కొట్టాడు. సిన్నర్ 50 విన్నర్లు కొడితే..మెద్వెదెవ్ 44 సంధించాడు. మూడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరినా..అన్నిసార్లూ మెద్వెదెవ్‌కు నిరాశే మిగిలింది.
మరోవైపు తైవాన్‌కు చెందిన 38 ఏళ్ల హీ సూ వీ అత్యధిక వయస్సులో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ గెలిచిన రెండో క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఎలైస్ మెర్టిన్స్ (బెల్జియం) జతగా బరిలో దిగిన వీ ఫైనల్లో 6-1, 7-5తో ఒస్తాపెంకో-కిచెనోక్ జోడీపై నెగ్గింది.
బోపన్న రికార్డు
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న(Rohan Bopanna) చరిత్ర సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మెన్స్ డబుల్స్‌ను టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఎబ్డెన్‌తో కలిసి ఆడిన బోపన్న 7-6,7-5 తేడాతో ఇటలీ జోడి సిమోన్- వావాసోరి జోడీపై జయభేరి మోగించారు. తద్వారా తొలిసారి పురుషుల డబుల్స్ గ్రాండస్లామ్ టైటిల్ నెగ్గిన ఆటగాడిగా భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న నిలిచాడు. అతిపెద్ద వయసులో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాడిగానూ 43 ఏళ్ల రోహన్ బోపన్న రికార్డులు తిరగరాశాడు. ఇటీవల అతిపెద్ద వయసులో డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న రోహన్ బోపన్న తాజాగా గ్రాండ్ స్లామ్ డబుల్స్ విజేతగా అవతరించాడు. మొత్తం గంటా 39 నిముషాలు జరిగిన తుదిపోరులో ఇటలీ జోడీ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. కానీ తమ అనుభవంతో బోపన్న, ఎబ్డెన్ జోడీ విజయాన్ని అందుకుంది. ఒకదశలో 3-4 తేడాతో రెండో సెట్‌లో వెనకబడినా.. బోపన్న జోడీ తర్వాత పుంజుకుని సెట్ నెగ్గింది. దిగ్గజ ఆటగాళ్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ ఆటగాడిగా బోపన్న నిలిచాడు. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం రోహన్ బోపన్నను పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం తెలిసిందే.
మహిళల్లో సబలెంక
అద్భుతాలు జరగలేదు. సంచలనాలు నమోదవ్వలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ అరీనా సబలెంకా వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బెలారస్ భామ అరీనా సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సబలెంకా ధాటి ముందు చైనా క్రీడాకారిణి కిన్వెన్ జెంగ్ నిలవలేక పోయింది. సబలెంకా 6-3, 6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో సబలెంకా అలవోక విజయం సాధించింది. తొలి సెట్‌లో కాస్త పోరాడిన జెంగ్.. ఆ తర్వాత చేతులెత్తేసింది. 2013 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను వరుసగా రెండోసారి దక్కించుకున్న తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో బ్యాక్ టు బ్యాక్ టోర్నీలు గెలవడం ద్వారా దిగ్గజ ప్లేయర్ల సరసన నిలిచింది. 2009, 2010లో సెరీనా విలియమ్స్ ఈ ఘనత సాధించగా 2012, 2013లలో విక్టోరియా అజరెంక వరుసగా రెండు టైటిల్స్ గెలిచింది. ఆ తర్వాత సబలెంకానే ఈ ఘనత సాధించింది. లీ నా తర్వాత పదేళ్లలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న తొలి చైనా అమ్మాయిగా ఇప్పటికే ఘనత సాధించిన 21 ఏళ్ల జెంగ్.. తుదిపోరులో మాత్రం సబలెంకాకు ఎదురు నిలవలేకపోయింది. సబలెంకా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరగా ఇది రెండో ట్రోఫీ.