(Source: ECI/ABP News/ABP Majha)
Commonwealth Games 2026: అంత ఖర్చు మేం భరించలేం బాబోయ్ - 2026 కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా
మరో మూడేండ్లలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న కామన్‌వెల్త్ గేమ్స్‌ను తాము నిర్వహించబోమని ఆ దేశం ప్రకటించింది.
Commonwealth Games 2026: కామన్‌వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) కు విక్టోరియా (ఆస్ట్రేలియా) ఊహించని షాకిచ్చింది. 2026లో విక్టోరియా నగరంలో జరగాల్సి ఉన్న కామన్‌వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) ను తాము నిర్వహించలేమని, అంత బడ్జెట్ తమవద్ద లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న తమకు సీడబ్ల్యూజీని నిర్వహించడం శక్తికి మించిన భారం అవుతుందని తెలిపింది. ఈ మేరకు విక్టోరియా స్టేట్ ప్రీమియర్ (ప్రతినిధి) డానియెల్ ఆండ్రూస్ ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
న్యూస్ ఏజెన్సీ ఎఎఫ్‌పీ నివేదిక ప్రకారం విక్టోరియా ప్రీమియర్ డానియల్ ఆండ్రూస్ మాట్లాడుతూ... 12 రోజుల పాటు జరుగబోయే ఈ ఈవెంట్‌కు తాము 2 ఆస్ట్రేలియా బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని సీజీఎఫ్ ప్రతినిధులు తమతో చెప్పినట్టు తెలిపారు. కానీ పెరిగిన అంచనాల ప్రకారం, ఆ ఖర్చు 7 ఆస్ట్రేలియా బిలియన్ డాలర్లు అయ్యిందని, ప్రస్తుతం తాము ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అంత భారం భరించడం తమకు శక్తికి మించిన పని అని వెల్లడించారు. ప్రస్తుతం ఆర్థిక లోటులో ఉన్న తమ రాష్ట్రం (విక్టోరియా) ఇంత మొత్తాన్ని భరించలేనది స్పష్టం చేశారు.
ఆండ్రూస్ స్పందిస్తూ.. ‘2026 కామన్‌వెల్త్ గేమ్స్‌ను విక్టోరియా నిర్వహించడం లేదన్న విషయాన్ని బహుశా మీరు ఇదివరకే ఈరోజు ఉదయం విని ఉంటారు. అందుకు గల కారణాలను నేను వివరిస్తున్నాను.. వాస్తవానికి విక్టోరియాలో కామన్‌వెల్త్ గేమ్స్‌ను నిర్వహిస్తే ఇక్కడ టూరిజం, క్రీడా వసుతల అభివృద్ధి జరుగుతుందని భావించాం. దీనివల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని కూడా అంచనా వేశాం. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కామన్వెల్త్ గేమ్స్ కోసం మేం ఏడు ఆస్ట్రేలియా బిలియన్ డాలర్లను భరించే స్థితిలో లేము. 2026లో విక్టోరియాలో కామన్వెల్త్ గేమ్స్ జరుగవు. కాంట్రాక్టును రద్దు చేయాలనే మా నిర్ణయాన్ని ఇదివరకే కామన్వెల్త్ అధికారులకు తెలియజేశాం..’అని తెలిపారు.
Bit of a long one this morning.
— Dan Andrews (@DanielAndrewsMP) July 17, 2023
You might have heard the news this morning that Victoria will no longer be hosting the 2026 Commonwealth Games.
And I wanted to tell you about the decision.
షెడ్యూల్ ప్రకారం అయితే ఈ ఈవెంట్ ఐదు వేదికలలో నిర్వహించేందుకు ప్రతిపాదనలను కూడా విక్టోరియా సిద్ధం చేసింది. విక్టోరియా స్టేట్ లోని గీలాంగ్, బల్లారట్, బెండిగో, గిప్స్‌లండ్, షెప్పర్టన్‌లలో జరగాలి. ఈ మేరకు ఇక్కడ క్రీడా సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే తాము కాకపోయినా మెల్‌బోర్న్, సిడ్నీ వంటి నగరాలకు తరలించేందుకు ప్రతిపాదనలు ఉన్నా అవి కూడా వాస్తవరూపం దాల్చలేదని ఆండ్రూస్ వివరించారు.
కాగా విక్టోరియా తీసుకున్న ఈ నిర్ణయంపై కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య తీవ్రంగా స్పందించింది. విక్టోరియా నుంచి ఇటువంటి నిర్ణయాన్ని తాము ఊహించలేదని, ఇది తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపింది. ఇదే విషయమై కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘విక్టోరియా నిర్ణయం మాకు విస్మయాన్ని కలిగించింది. 8 గంటల సమయం ఇచ్చి మాకు వాళ్ల నిర్ణయాన్ని చెప్పారు. దీనిపై మేం త్వరలోనే మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం..’ అని తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియా సీఈవో క్రెయిగ్ ఫిలిప్స్ కూడా విక్టోరియా నిర్ణయాన్ని తప్పుబట్టారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అంచనాలు తాము పెంచినవి కాదని తెలిపారు. విక్టోరియా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తాము సూచనలను పక్కనబెట్టిందని ఆరోపించారు.
గతేడాది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా ఏకంగా 179 పతకాలు సాధించి అగ్రస్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు వివిధ కేటగిరీలలో 61 పతకాలు దక్కాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial