Vijayadashami 2024: ఎవరీ మహిషాసురుడు? దేవతులకు ఎలా శత్రువు అయ్యాడు.? తల్లిదండ్రులు ఎవరు?
Dussehra 2024: మహిషాసురుడి తల్లిదండ్రులు ఎవరు? రాక్షసుడికి, ఆడ మహిషానికి (గేదెకు) పుట్టిన మహిషుడు.. తర్వాత ఎలాంటి వరం పొందాడు.
Vijayadashami 2024: ఈరోజు విజయదశమి. దేశవ్యాప్తంగా ఈ పండుగను భారతీయులు గొప్పగా జరుపుకుంటున్నారు. అయితే ఈ పండుగ వెనుక ఉన్న కారణం మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో రాముడి చేతిలో రావణ సంహారం జరిగిన రోజుగా పండగ చేస్తే తూర్పు, దక్షిణ భారత దేశంలో మాత్రం దుర్గాదేవి రాక్షసుడైన మహిషాసురుడ్ని అంతమొందించిన రోజుగా "విజయదశమి" పండుగను చేస్తారు.
త్రిమూర్తులకు సైతం లొంగని మహిషాసురుడి జన్మ వృత్తాంతం ఏమిటి, అతని తల్లిదండ్రులు ఎవరు అన్నది మాత్రం చాలామందికి తెలియని విషయం. ఆసక్తికరంగా ఉండే మహిషాసురుడి పుట్టుక గురించి తెలుసుకుందామా ?
మహిషాసురుడు తల్లిదండ్రులు వీళ్ళే
ఈ కథ దేవీ భాగవతంలోనిది. పూర్వకాలంలో దనవుడు అనే రాక్షసుడికి రంభుడు, కరంభుడు అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు. వాళ్ళిద్దరూ శక్తి వంతులైన కొడుకుల కోసం తపస్సు చేయడం మొదలుపెట్టారు. కరంభుడు " పంచనద తీర్ధం"లో నీటిలో మునిగి తపస్సు చేస్తుంటే,"రంభుడు" మాత్రం చెట్టు పైకెక్కి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎవరు తపస్సు చేసినా అది "ఇంద్ర "పదవి కోసమేమోనని భయపడే ఇంద్రుడు మొసలి రూపంలో వెళ్లి నీటిలో తపస్సు చేసుకుంటున్న కరంభుడ్ని చంపేశాడు.
తమ్ముడు చనిపోయిన వార్త తెలిసి ఆవేశంతో తన తలను అగ్ని దేవుడికి అర్పించడం కోసం రంభుడు ఒక ఖడ్గాన్ని తీసుకున్నాడు. సరిగ్గా తల నరుక్కోబోయే సమయంలో అగ్ని దేవుడు ప్రత్యక్షమై ఆత్మహత్య పాపమని చెప్పి అతని బాధ పోగొట్టడం కోసం వరం కోరుకోమన్నాడు. అప్పుడు రంభుడు ముల్లోకాలను జయించగల శక్తివంతుడైన ఒక కొడుకును కనాలని ఉందని కోరాడు. అగ్నిదేవుడు దానికి సరే అని రంభుడికి ఎవరి మీద ప్రేమ కలుగుతుందో వారి వల్ల కొడుకు పుడతాడని ఆ పుట్టేవాడు మహాశక్తివంతుడు, కోరిన రూపం ధరించగలవాడు అవుతాడని వరమిచ్చాడు.
ఆడ గేదె (మహిషం ) పై మనసు పడ్డ రంభుడు
అగ్ని దేవుడి వరం పొందిన రంభుడు పాతాళానికి తిరిగి వెళుతూ దారిలో ఒక ఆడ మహిషంపై మనసుపడ్డాడు. వెంటనే అది అతని వల్ల గర్భం ధరించి రంభుడితో పాటు పాతాళం చేరుకుంది. అయితే అక్కడ ఉన్న మరొక బలమైన మగ మహిషం ఆ ఆడ గేదెను చూసి వెంటపడడంతో రంభుడు దానిని కొట్టడానికి వెళ్ళాడు. అది తన కొమ్ములతో రంభుడి కడుపు చీల్చి చంపేసింది. అది చూసిన ఆడ మహిషం రంభుడితో పాటు చితిపై కాలిపోయింది. ఆ మంటల నుంచి ఇద్దరు భయంకరమైన రాక్షసులు బయటకు వచ్చారు. వారే మహిషాసురుడు, రక్తబీజుడు.
దేవతలను జయించిన మహిషుడు
అలా జన్మించిన మహిషాసురుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. బ్రహ్మదేవుడు వరం కోరుకోమనగా తనకు చావు లేకుండా వరం కావాలన్నాడు. అయితే బ్రహ్మ కుదరదని చెప్పి పుట్టిన ప్రతిప్రాణికి చావు తప్పదని కాబట్టి చావుకి ఒక అవకాశం వదిలి. వరం కోరుకోమన్నాడు. అప్పుడు మహిషుడు సృష్టిలోని ఏ పురుషుడి వల్లా తనకు చావు ఉండకూడదని స్త్రీలకు తనను ఎదుర్కొనే శక్తి ఉండదు కాబట్టి తన చావు స్త్రీ చేతిలోనే జరగాలని కోరాడు. బ్రహ్మ దానికి సరే అన్నాడు. అప్పుడు రాక్షసులంతా కలిసి మహిషుడిని తమ రాజుగా ఎన్నుకుని ముల్లోకాలను జయించారు.
దుర్గాదేవి దేవీ అవతారం- మహిషుడి సంహారం
ఒకపక్క మహిషుడు స్వర్గాన్ని సైతం ఆక్రమించి ప్రజలను, ఋషులను పీడిస్తుంటే దేవతలు మాత్రం కష్టాలపాలయ్యారు. దేవతలంతా కలిసి త్రిమూర్తులను ఆదుకోమని కోరగా మహిషాసురుడి చావు స్త్రీ చేతిలోనే ఉందని కాబట్టి అందరం కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థిద్దామని వారు చెప్పారు. వారు అలాగే చేయగా ఆదిపరాశక్తి 18 చేతులతో దుర్గాదేవిగా అవతరించింది.
ఆమెకు దేవతలు అందరూ తమ తమ తేజస్సును, ఆయుధాలను అందజేయడంతో ఆమె తాను మహిషాసురుడ్ని చంపుతానని అభయం ఇచ్చింది. తర్వాత ఆమె ఒక సింహంపై వెళ్లి మహిషుడితో యుద్ధం చేసింది. తొమ్మిది రోజులపాటు (అవే నవరాత్రులు ) హోరా హోరీగా సాగిన యుద్ధంలో దుర్గాదేవి రాక్షసులందరినీ సంహరించి చివరిగా మహిషాసురుడ్ని తన త్రిశూలం,చక్రాయుధాలతో అంతమొందించింది. ఆ రోజే విజయదశమి. ఆ సంఘటనకు గుర్తుగా ఇప్పటికీ ప్రజలు దసరా వేడుకను జరుపుకుంటున్నారు.
మార్కండేయ పురాణం, విష్ణు పురాణాల్లో ఇదే కథ స్వల్ప తేడాతో..
మహిషాసురుడి పుట్టుక గురించి మార్కండేయ, విష్ణు పురాణాల్లో మరోలా ఉంటుంది. ఇందులో మహిషాసురుడి తండ్రి రంభుడు తండ్రి పేరు కాదు.. తల్లి పేరు దను. తండ్రి కశ్యపుడు. అలాగే మహిషుడితోపాటు పుట్టిన రక్తబీజుడుకి అతని రక్తం ఎన్ని చుక్కలు నేల మీద పడితే అంతమంది రక్తబీజులు పుట్టుకుని వచ్చే వరం ఉంది. దానితో అతడ్ని సంహరించడం కోసం దుర్గాదేవి తన అంశతో కాళికా దేవతను సృష్టించింది. నల్లని రూపంతో భయంకరంగా ఉండే కాళికాదేవి రక్తబీజుడి రక్తం కిందపడేలోపే తన నాలికతో పీల్చేసేది. అప్పుడు రక్త బీజుడ్ని సులభంగా చంపగలిగింది దుర్గాదేవి. బెంగాల్ కలకత్తా సైడ్ ఈ గాధ బాగా ప్రాచుర్యంలో ఉంది. అక్కడ కాళికను ఘనంగా పూజిస్తూ ఉంటారు.