Dasara 2022 : ఇంద్రకీలాద్రిపై బ్రేక్ దర్శనాలు, టికెట్ల బుకింగ్ కు ప్రత్యేక యాప్
Dasara 2022 : ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి బ్రేక్ దర్శనం అమలు చేస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. భక్తుల దర్శనాలకు ఒక యాప్ అందుబాటులోకి తెస్తామన్నారు.
Dasara 2022 : సెప్టెంబర్ 26వ తేదీ నుంచి బెజవాడ దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. కొండ దిగువున కొండపై భాగాన దసరా ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కలెక్టర్ దిల్లీ రావు, సీపీ క్రాంతి రాణా టాటా, కమిషనర్ హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించిన తరువాత అధికారులకు మంత్రి కొట్టు సత్యానారాయణ పలు సూచనలు చేశారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నామని మంత్రి అన్నారు. బ్రేక్ దర్శనం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఒక్కో స్లాట్ కు 2 వేల మంది వరకు దర్శనం కల్పించే అవకాశం ఉందన్నారు. ఘాట్ రోడ్డులోని క్యూలైన్ల మీదుగా భక్తులను అనుమతిస్తామన్నారు. వీఐపీలను మహామండపం మీదుగా అనుమతించాలని నిర్ణయిస్తున్నామన్నారు. దర్శనాలకు ప్రత్యేకంగా ఒక పోర్టల్ యాప్ అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ యాప్ ద్వారా దర్శనాల టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
అంతరాలయ దర్శనాలకు అనుమతి లేదు
"దసరాలో అంతరాలయ దర్శనాలకు అనుమతి లేదు. బ్రేక్ దర్శనం బుక్ చేసుకున్న వారికి అనుమతి లేదు. దసరా తర్వాత బ్రేక్ దర్శనం వారికి అంతరాలయ దర్శనం కల్పిస్తాం. భవానీ దీక్షాధారులకు టీటీడీ సత్రం హాలులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తుల రద్దీ దృష్ట్యా అన్నదానం బదులుగా ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం." - మంత్రి కొట్టు సత్యనారాయణ
భారీగా పోలీసు బలగాల మోహరింపు
దసరా ఉత్సవాల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తున్నామని, భక్తుల రద్దీ సమయంలో క్యూలైన్లు సజావుగా సాగే విధంగా ఏర్పాట్లు చేశామని విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా తెలిపారు. దసరా ఉత్సవాల్లో వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి రోజూ ఉత్సవాలపై సమీక్ష చేస్తామన్నారు. బ్రేక్ దర్శనం, సిఫార్సు లేఖలపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నామని క్రాంతి రాణా టాటా చెప్పారు.
కలెక్టర్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం, కల్పించాలనే ఆలోచన అభినందనీయమన్నారు. గతంలో ఘాట్ రోడ్డు నుంచి వీఐపీలకు అమ్మవారి దర్శనం కల్పించడంలో, ఓం టర్నింగ్ నుంచి ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. దీంతో వీఐపీ రాకపోకల సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగేదని దానిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది లిఫ్టు మార్గం ద్వారా వీఐపీలకు దర్శన ఏర్పాట్లను చేయడం సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోనున్నామన్నారు. ఇటువంటి ఏర్పాట్ల వలన ఎదురయ్యే ఇబ్బందులను ఏవిధంగా అధిగమించాలనే విషయంపై ప్రజా ప్రతినిధులు, దేవాదాయ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖ అధికారులతో చర్చించి తదుపరి సమావేశం నాటికి ఒక నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
వీఐపీలే అసలు సమస్య
ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ ఆలయంలో ప్రోటో కాల్ తో పాటుగా, వీఐపీల తాకిడి సమస్య తీవ్రంగా ఉంటుంది. అధికారులకు ముందస్తు సమాచారం లేకుండా వీఐపీలు రావటం, వచ్చిన వీఐపీలకు దర్శనం సరిగ్గా చేయించకపోటం కూడా కొండపై తీవ్ర వివాదాలకు తావిస్తోంది. ఇలాంటి సంఘటనల్లో అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఇదే సమస్య అధికారులను వెంటాడుతోంది. ఏర్పాట్లు ఎంత పకడ్బందీగా చేసినా, సామాన్యులకు దర్శనం కల్పించటం కన్నా వీఐపీలకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటం ప్రతి ఏటా కామన్ అయిపోవటంతో ఈసారి వాటికి చెక్ పెట్టేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అమలులోకి తీసుకువచ్చారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాకపోవటం విశేషం.