వెంకటగిరి పోలేరమ్మ జాతర తేదీలు ఖరారు..
రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి సంబంధించి తేదీలను ఖరారు చేశారు. ఈ ఏడాది జాతరను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు నిశ్చయించారు.
నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి సంబంధించి తేదీలను ఖరారు చేశారు. వినాయక చవితి పూర్తయిన రెండు వారాలకు పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీ. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరకు వెంకటగిరిలోని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా స్వస్థలాలకు చేరుకుంటారు. దేశ విదేశాలనుంచి కూడా ఆ రెండురోజుల ఉత్సవాలనూ చూసేందుకు స్థానికులు తరలి వస్తారు. ఈ ఏడాది జాతరను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు నిశ్చయించారు. వెంకటగిరి లో జాతర నిర్వహణ కోసం అధికారుల సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి.
జాతర నిర్వహణ ఇలా..
ఆగస్టు 31వ తేదీ బుధవారం మొదటి చాటింపు ఉంటుంది
సెప్టెంబర్ 7వ తేదీ బుధవారం రెండో చాటింపు ఉంటుంది.
సెప్టెంబర్ 11 ఆదివారం ఘటోత్సవం నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 14 బుధవారం అమ్మవారి ఉత్సవం జరుపుతారు
సెప్టెంబర్ 15 గురువారం అమ్మవారి నిలువు, నిష్క్రమణం, నగరోత్సవంతో జాతర ముగుస్తుంది.
జాతరలోని ప్రధాన ఘట్టం సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో జరుగుతుందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఏడాదికోసారి నిర్వహించే అమ్మవారి జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు.
వెంకటగిరి సంస్థానాదీశులైన రాజావారి ఆధ్వర్యంలో గతంలో జాతర జరిగేది. ఇప్పుడు కూడా రాజనగరి నుంచే ఆభరణాలు తెచ్చి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్సవాలను జరుపుతోంది. అమ్మవారి జాతరలో తొలిపూజ వెంకటగిరి రాజావారిదే. కరోనాతో రెండేళ్లపాటు నిరాడంబరంగా జరిగిన అమ్మవారి జాతర, ఈఏడాది అంగరంగ వైభవంగా జరగబోతోంది.
జాతరకు 2కోట్ల రూపాయల నిధులు..
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలసిన సందర్భంలో పోలేరమ్మ అమ్మవారి జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించవలసిందిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. దీనికోసం ఇప్పటికే తిరుపతి కన్వీనర్ సమగ్ర నివేదిక పంపించారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే.. ఈ ఏడాది జాతర మరింత వైభవంగా జరుగుతుంది.
జాతర తొలిరోజు రాత్రి అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేస్తారు, ఆ తర్వాత అమ్మగారింటినుంచి అత్తగారింటికి ఆ ప్రతిమను తీసుకొస్తారు. అక్కడ బుక్క చుక్క పెట్టి అమ్మవారి మూర్తిని దర్శనాలకు అనుమతిస్తారు. అత్తగారింటి నుంచి పోలేరమ్మ ఆలయానికి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంచుతారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అర్థరాత్రి ఈ తంతు అంతా జరుగుతుంది. అనంతరం తెల్లవారి నుంచి దర్శనాలు మొదలవుతాయి. సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్థం అమ్మవారి విగ్రహాన్ని ఆలయం ముందు ఉంచుతారు. ఆ తర్వాత ఊరేగింపు చేసి అమ్మవారి విగ్రహాన్ని విరూపణం చేస్తారు. అంటే విగ్రహాం నుంచి మట్టిని తీసి వేస్తారు. ఆ మట్టిని పవిత్రంగా భక్తులు తమ ఇళ్లలో దాచుకుంటారు. అమ్మవారి విరూపణంతో జాతర ముగుస్తుంది.