మహిళలూ, ఈ పరిహారాలు పాటిస్తే విజయాలు మీ వెంటే!
ఏ ఇంట్లో స్త్రీలు విజయవంతంగా ఉంటారో ఆ కుటుంబం విజయ పథంలో ఉంటుంది. వారి విజయానికి దోహదం చేసే కొన్ని పరిహారాలను తెలుసుకుందాం.
సనాతన దర్మం స్త్రీని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా అభివర్ణిస్తుంది. ఇంటి దేవత గా భావిస్తారు. ఇంట్లో శాంతి, ఆనందాలను నెలకొల్పే నడిచే దేవతలుగా అభివర్ణిస్తారు. ఇది వరకు రోజుల్లో మహిళలు ఇంటికే పరిమితంగా ఉండేవారు. బయట వ్యవహారాలలో పెద్దగా కల్పించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. స్త్రీలు ఇల్లే కాదు, బయటి వ్యవహారాలు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చదువులు, కొలువులు అన్ని విషయాల్లోనూ పురుషులతో సమానంగా కృషి చేస్తున్నారు. విజయాలు కూడా సాధిస్తున్నారు. వంటింటి వంట నుంచి రాకెట్ సైన్స్ వరకు స్త్రీలు చెయ్యలేని పనులేవీ లేదని నిరూపిస్తున్నారు. స్త్రీలు కూడా అన్ని వ్యవహారాలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. కేరీర్, చదువుల్లో విజయం సాధించేందుకు కేవలం కష్టించి పనిచేస్తే సరిపోదు. కాలం కూడా కలిసి రావాలి. అదృష్టం సహకరించాలి. ఇంట్లోని స్త్రీలు విజయవంతంగా, ఆనందంగా ఉన్నప్పుడే ఆకుటుంబం ఆనందంగా, ప్రశాంతంగా, ఆర్థికంగా కూడా బలంగా ఉంటుంది. మహిళలకు అన్నింటా విజయం లభించడానికి కొన్ని వాస్తు నియమాలు, మరికొన్ని పరిహారాలు పాటిస్తే అన్నింటా మంచి జరుగుతుంది. ఏఇంట్లో స్త్రీలు విజయవంతంగా ఉంటారో ఆ కుటుంబం విజయ పథంలో ఉంటుంది. వారి విజయానికి దోహదం చేసే కొన్ని పరిహారాలను తెలుసుకుందాం.
- వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం లేదా పడకగది తలుపు ఆగ్నేయం వైపు తెరచుకుంటే ఆ ఇంటి బ్రహ్మస్థానం ఆగ్నేయం నుంచి తెరచుకోవడం వల్ల ఎక్కువ కాంతి వంతంగా ఉంటుంది. ఇలాంటి ఇల్లు స్త్రీలకు చాలా శుభప్రదం.
- ఆగ్నేయం శుక్రుడి ఆవాసం ఇది స్త్రీలకు సంబంధించిన గ్రహం. అందువల్ల ఇంటిని నిర్మించే సమయంలో చిమ్నీలు తెరచి ఉండేలా జాగ్రత్త పడాలి. లేదంటే ఆ ఇంట్లో నివసించే మహిళలకు ఏ రకంగానూ విజయం ప్రాప్తించదు. అన్ని చోట్లా అపజయం ఎదురవుతుంది.
- ఇంట్లోని తులసి ఇంటి ఆడపడుచుతో సమానం. ప్రతి ఇంట్లో తప్పకుండా తులసి మొక్కను పెంచాలి. ప్రతి రోజూ ఉదయ, సాయం సంధ్యల్లో తులసి దగ్గర దీపం వెలిగించాలి. నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని స్త్రీలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అంతే కాదు ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
- రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పరిహారం పాటిస్తే ఇంటిలో నుంచి నెగెటివ్ ఎనర్జీని తరిమెయ్యవచ్చు.
- రాత్రి నిద్రించే ముందు సైంధవ లవణం, లేదా నల్ల ఉప్పును ఒక కాగితంలో పొట్లం కట్టి దాన్ని పడక గదిలో పెట్టుకోవాలి. దాన్ని పొద్దున్నే నిద్ర లేవగానే నిశ్శబ్ధంగా ఇంట్లోంచి దూరంగా విసిరెయ్యాలి. ఈ పరిహారాన్ని వారానికి ఒక్కసారి చేసినా సరిపోతుంది.
- చాలా మంది సమయాభావం వల్ల ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు రకరకాల పనులు చేస్తుంటారు. కానీ కొన్ని పనులు ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు. అలాంటి వాటిలో ఒకటి స్త్రీలు చేసే తలస్నానం కూడా ఒకటి. చీకటి పడిన తర్వాత స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చెయ్యకూడదు. ఇది కుటుంబ పురోగతికి ఆటంకం కలిగించే చర్య.
గమనిక: పండితులు, వివిధ ఆధ్యాత్మిక పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.