Varahi Navaratri Dates2025: వారాహి నవరాత్రులు 2025 తేదీలు, పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి
Ashadha Gupt Navratri 2025: జూన్ 26 నుంచి ఆషాఢమాసం ప్రారంభమైంది..ఈ రోజు నుంచి తొమ్మిదిరోజుల పాటూ జరుపుకునేవే ఆషాఢ గుప్త నవరాత్రులు అంటారు. పూజా విధానం, విశిష్టత ఇక్కడ తెలుసుకోండి

Varahi Navaratri Dates 2025 and Simple Pooja Vidhanam : నవరాత్రులు అనగానే ఆశ్వయుజమాసంలో వచ్చే దసరా నవరాత్రులు మాత్రమే అనుకుంటారు. కానీ మరో రెండు తెలుగు నెలల్లో నవరాత్రులు నిర్వహిస్తారని మీకు తెలుసా?... అవే మాఘగుప్త నవరాత్రులు, ఆషాఢంలో వచ్చే నవరాత్రులు...ఈ తెలుగు నెలల్లోనూ నవరాత్రులు జరుపుకుంటారు. జూన్ 26 నుంచి ఆషాఢమాసం ప్రారంభం కావడంతో వారాహి నవరాత్రులు ఆరంభమయ్యాయి. శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటూ అమ్మవారిని పూజించినట్టే ఆషాఢంలో వారాహీ నవరాత్రుల్లోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. ఉపవాసాలు , దీక్షలు చేస్తారు.
ఈ ఏడాది (2025) వారాహి నవరాత్రుల తేదీలు - 26 నుంచి జూలై 30
వారాహి అమ్మవారి ఫొటో దేవుడిమందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే విడిగా పెట్టుకోవచ్చు. మొదటి రోజు ఫొటో ఎక్కడ పెడతారో తొమ్మిది రోజుల పాటూ ఫొటోను అక్కడి నుంచి మార్చకూడదు, కదపకూడదు. మొదటి రోజు పెట్టిన దీపం తొమ్మిదిరోజుల పాటూ వెలగాలి. అంటే అఖండ దీపం పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి..మావల్ల కాదు అనుకుంటే అఖండ దీపం వెలిగంచవద్దు..నిత్యదీపారాధన చేసుకోండి సరిపోతుంది. కలశం పెట్టాలా వద్దా అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి..సాయంత్రం దీపారాధన తర్వాత అమ్మవారికి నివేదించి ఉపవాసం విరమించాలి.
వారాహి అమ్మవారి పూజా విధానం
ఏ పూజ అయినా వినాయకుడిని ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. ముందుగా గణపతి ప్రార్థన చేసి ధూపం, నైవేద్యం సమర్పించి మళ్లీ సంకల్పం చెప్పుకుని అమ్మవారి ఫొటోకి మొదటి రోజు ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఆ తర్వాత షోడసోపచార పూజచేయాలి. నిత్యం గణపతి ప్రార్థన పూర్తిచేసి అమ్మవారి పూద పూర్తిచేయాలి. వారాహి అష్టోత్తరం, వారాహి కవచం చదువుకుంటూ పూలు, కుంకుమతో పూజించాలి. లలితా అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన అమ్మవారు కావడంతో వారాహి పూజలో భాగంగా లిలితా సహస్రనామం కూడా చదువుకోవచ్చు.
షోడసోపచార పూజ అంటే మొత్తం 16 ఉపచారాలు
1. ఆవాహనం- దైవాన్ని ఆహ్వానించాలి
2. ఆసనం- ఆసనం చూపించాలి (అక్షతలు సమర్పిస్తారు)
3. పాద్యం- పాదాల ప్రక్షాళనకు నీళ్లు సమర్పిస్తారు
4. అర్ఘ్యం- చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు
5. ఆచమనీయం- దాహం తీర్చుకునేందుకు నీళ్లివ్వాలి
6. స్నానం- అభిషేకం చేయాలి
7. వస్త్రం- దుస్తులు లేదా అక్షతలు, పూలు సమర్పించాలి
8. యజ్ఞోపవీతం- యజ్ఞోపవీతం లేదా అక్షతలు సమర్పిస్తారు
9. గంధం- గంధంతో అలంకరించాలి
10. పుష్పం- పూలతో అర్చించాలి
11. ధూపం- అగరొత్తులు వెలిగించాలి
12. దీపం- వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి
13. నైవేద్యం- పండ్లు, పానకం, వంటలు నైవేద్యం పెట్టాలి
14. తాంబూలం- ఆకు, వక్క తాంబూలం ఇవ్వాలి
15. నమస్కారం- సాష్టాంగ నమస్కారం చేయాలి
16. ప్రదక్షిణ- ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి
వారాహి అమ్మవారికి మీరు ఎన్ని పదార్థాలు నివేదించినా బెల్లం పానకం తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు చీరను అందించాలి. ఆ వస్త్రాన్ని మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువులకు ఇవ్వొచ్చు. పూజ పూర్తైన తర్వాత ధూపం వేయడం అత్యంత ముఖ్యమం.
దీక్షా నియమాలివే
వారాహి అమ్మవారి దీక్షను చాలా నియమంగా చేయాలి. నవరాత్రుల 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.
వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనం
లలితా దేవి నుంచి ఉద్భవించిన వారాహి అమ్మవారిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది. కష్టాల్లో ఉన్నవారు , భూ సంబంధిత తగాదాల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మవారిని పూజిస్తే పరిష్కారం లభిస్తుంది. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. సస్యానికి అధిపతి అయిన వారాహిని పూజిస్తే పంట దిగుబడి బావుంటుంది. వారాహి ధ్యానం దీర్ఘకాలిన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అమ్మవారి కరుణా కటాక్షాలకోసం పూజ చేయాలి కానీ కోర్కెలు నెరవేరాలని కాదని గుర్తించాలి. మీరు భక్తితో పూజచేస్తే మీకు ఏం ఇస్తే మంచి జరుగుతుందో అమ్మవారే అందిస్తారు.
గమనిక: ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న వార్తలు, ఆధ్యాత్మిక వేత్తలు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















