Valentines Day 2024: దొంగ సన్యాసిని అని చెప్పినా కానీ మీరే నా స్వామి అంది - ఇది కాదా L O V E!
మనసులో ప్రేమను వ్యక్తపరిచేందుకు ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని ఫాలో అవుతారు. అప్పట్లో పార్వతీ దేవి తన మనసులో మాట పరమేశ్వరుడికి ఎలా చెప్పింది? దానికి శంకరుడి సమాధానమేంటి?
Love Story Of Lord Shiva and Parvati : ప్రేమికుల దినోత్సవం కలియుగంలో మొదలై ఉండొచ్చు కానీ ప్రేమ మాత్రం పురాణకాలం నుంచీ ఉంది. అయితే ఇప్పటిలా ఫోన్లు, గిఫ్టులు లేవు కాబట్టి అప్పట్లో ప్రేమను వ్యక్తం చేసే పద్ధతులు వేరుగా ఉండేవి. మరి ఆదిదంపతులైన పార్వతి పరమేశ్వరుల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఎవరు ఎవరికి చెప్పారు?
'బ్రహ్మాచారిణి' దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా !!
భోళా శంకరుడిని పరిణయమాడక ముందున్న పార్వతీ దేవి అలంకారాన్ని బ్రహ్మచారిణి అంటారు. బుద్ధిని, శక్తిని, సంతోషాన్ని, ప్రశాంతతను, సంపదను ప్రసాదించే ఈ అవతారాన్ని శరన్నరవాత్రుల్లో రెండో రోజు పూజిస్తారు. అయితే ఈ అవతారం వెనుక అద్భుతమైన ప్రేమకథ ఉందని మీకు తెలుసా..
Also Read: మనిషిని బతికించేంత శక్తి ఉంది ప్రేమకు - ఇదిగో ప్రూఫ్!
శివుడి కోసం పార్వతి తపస్సు
మేనక, హిమవంతుల కుమార్తె అయిన పార్వతీ దేవి పరమేశ్వరుడిపై ప్రేమను పెంచుకుంటుంది. నిత్యం శివుడిని పూజిస్తూ.. తననే పెళ్లిచేసుకోవాలని తపిస్తుంది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం శివుడిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్పు అని, అది జరగని పని అని చెబుతారు. ( ఎందుకంటే అప్పటికే శివుడు దక్షప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని పెళ్లిచేసుకుంటాడు.. ఆమెకు ఆహ్వానం లేకుండా పుట్టింటికి వెళ్లడంతో అక్కడ అవమానం ఎదుర్కొంటుంది. ఆ అవమాన భారంతో అగ్నిలో దూకుతుంది. సతీ వియోగంతో ఆ మృతశరీరాన్ని అంటిపెట్టుకుని తన కార్యాచరణను పక్కనపెట్టేస్తాడు పరమేశ్వరుడు. దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి..శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే 18 శక్తి పీఠాలుగా చెబుతారు). ఇదంతా మొత్తం పార్వతీదేవికి తెలుసు కానీ ఆమె మాత్రం పట్టువీడదు. శివుడికోసం వేలఏళ్లు తపస్సు చేస్తుంది కనీ శంకరుడి మనసు కరగదు..
Also Read: ఎవరీ రతీ మన్మధులు - వీరి ప్రేమకథ ఎందుకంత ప్రత్యేకం!
సతీదేవే పార్వతి
తనకు ప్రాణమైన సతీదేవిని తప్ప మరొకరి వివాహమాడేది లేదని శివుడు భీష్మించుకుని కూర్చుంటాడు. ఈ విషయం తెలిసిన తారకాసురుడు అనే రాక్షసుడు..శివుడికి పుట్టే బిడ్డ చేతిలో తప్ప తనకు ఇతరుల వల్ల చావు ఉండకూడదనే వరం పొందుతాడు. ఆ అహంకారంతో దేవతలను నానా హింసలు పెట్టేవాడు. అయితే సతీదేవి పార్వతీ దేవిగా జన్మించి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలంతా..పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుడిని కోరతారు. అలా మన్మథుడు పరమేశ్వరుడిపై పూలబాణం ప్రయోగించి ధ్యానభంగం చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆగ్రహించిన శివుడు మూడోకన్ను తెరవడంతో మన్మథుడు మాడి మసైపోతాడు.
Also Read: రాక్షసిని దేవతగా మార్చిన అద్భుతమైన ప్రేమకథ!
పట్టు వీడని పార్వతి
పార్వతీ దేవి మాత్రం శివుడి కోసం పట్టువీడక తపస్సు చేస్తుంది. పార్వతి గురించి తెలుసుకున్న శివుడి మనసు కరుగుతుంది కానీ సతీదేవి తప్ప తనకెవ్వరూ భార్య కాలేరని భావిస్తాడు. అందుకే తన గురించి తాను చెడుగా చెప్పుకుంటాడు. తాను దొంగ సన్యాసిని అంటూ తన మీద తనే నింద వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతానని, భస్మమే ధరిస్తానని చెబుతాడు. ఎన్ని చెప్పినా కానీ పార్వతి మనసు మారదు. చివరకు పార్వతి ప్రేమకు కరిగి పరిణయమాడిన పరమేశ్వరుడు తన శరీరంలో సగభాగాన్నిచ్చి అర్థనారీశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. పట్టువదలని పార్వతి శివుడి ప్రేమను దక్కించుకుంది...
Also Read: ఫిబ్రవరి 14 వసంతపంచమి - శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!