Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు
Garuda Vahana Seva : తిరుమల శ్రీవారి నామస్మరణతో మారుమోగిపోతుంది. గరుడవాహన సేవను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తిరుమల వచ్చారు. దీంతో మాడవీధులు జనసంద్రాన్ని తలపించాయి.
Garuda Vahana Seva : తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవను పాల్గొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోయాయి. కొండపై పార్కింగ్ ఫుల్ అవ్వడంతో అలిపిరి దగ్గరే వాహనాల నిలిపివేస్తున్నారు. అలిపిరి నుంచి ఆర్టీసీ బస్సులకు మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. తిరుపతిలో 13 చోట్ల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసింది టీటీడీ. శనివారం రాత్రి శ్రీవారి గరుడ వాహనసేవ నిర్వహిస్తున్నారు. పెరటాశి రెండో శనివారం కూడా కలసిరావడంతో భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు.
గరుడవాహన సేవ
తిరుమల శ్రీవారి బ్రహోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడవాహన సేవ ఐదో రోజు(శనివారం) రాత్రి వైభవోపేతంగా జరుగుతుంది. తొమ్మిది రోజుల ఉత్సవాలలో ఐదోరోజు అనగా పంచవేదాలు, గరుడ పంచాక్షరిలోని పంచవర్ణ రహస్యం తెలిపే విధంగా స్వామివారి గరుడోత్సవం నిర్వహిస్తున్నారు. దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, అసనంగా, అవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా గరుత్మంతుడు శ్రీనివాసుడిని సేవిస్తున్నాడు. స్వామి బ్రహ్మొత్సవాలకు ముక్కోటి దేవతులకు ఆహ్వానం పలికేదే గరుడు. గరుడవాహనంపై విహరించే ఉత్సవమూర్తికి, ధ్రువభేరమైన వేంకటేశ్వర స్వామికి భేదంలేదని చెప్పడానికే, నిత్యం మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను అలంకరిస్తారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ అరుదైన ఆభరాణాలు గర్భాలయం నుంచి వెలుపలకు వస్తాయి. అందుకే ఏ వాహనానికి లేని విశిష్టత గరుడవాహనం సంతరించుకుంది.
మకరకంఠి, సహస్రనామ లక్ష్మిహారాలు అలంకరణ
గరుడవాహనంలో మూలమూర్తకి అలంకరించే మకరకంఠి, సహస్రనామ లక్ష్మిహారాలు స్వామి వారి భుజస్కందాల నుంచి గరుడుడి పాదాల వరకు అలంకరించి ఉంటారు. విద్యుత్ కాంతులు వెలుగులలో దేదిప్యమానంగా ప్రకాశిస్తుటుంది ఈ బంగారు వజ్రాభరణాలు. గరుడోత్సవంలో స్వామి ఒక్కరే పాల్గొంటారు. ప్రసన్నవదనుడిగా గరుత్మంతుడిపై ఊరేగే వేంకటేశ్వరుడిని దర్శించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శనివారం ఉదయం మోహిని అవతారంలో వేంకటేశ్వరుడు శ్రీకృష్ణ స్వామి వారితో కలిసి భక్తులను కటాక్షించారు. స్త్రీ పురుషులలో ఎవరు ఎక్కువన్న లింగభేధాలను తన భక్తులు విడనాడాలన్నదే మోహిని అవతారంలోని అంతరార్థం. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన నూతన ఛత్రలను కూడా స్వామివారి వాహనసేవలో వినియోగిస్తారు. సర్వకాల సర్వావస్థాలందు తనను శరణు కొరిన భక్తులను రక్షించేందుకు శంఖచక్రధారై గరుడుని అదిరోహించి సిద్ధంగా ఉంటానని నా పాదాలను ఆశ్రయించండి చెప్పడమే గరుడసేవ అర్థం.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు.#TTD #Tirumala #Tirupati #Brahmotsavams #GarudaSeva pic.twitter.com/dOdVWt2iR2
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 1, 2022
కిక్కిరిసిన తిరుమల
పెరటాసి మాసం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుని స్వామి వారి గరుడ వాహన సేవను తిలకిస్తున్నారు. నాలుగు మాడవీధులు భక్త జనంతో కిక్కిరిసి పోయాయి. తిరుమల గిరులు గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్నాయి. గరుడ వాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి వారిని చూసి భక్తులు తరించిపోతున్నారు. రెండేళ్ల తర్వాత ఎంతో ఘనంగా నిర్వహిస్తోన్న బ్రహ్మోత్సవాలు కావడంతో దాదాపు మూడు లక్షల యాభై వేలకుపైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు.