Tirumala bramhosthavam: గరుడ వాహనంపై మలయప్ప స్వామి - ఈ సేవ విశిష్టత మీకు తెలుసా?
Tirumala bramhosthavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనది ఐదో రోజు జరిగే గరుడ సేవ. అసలు ఈ రోజున ఏమి చేస్తారో, ఎంతటి విశిష్టతో మీకు తెలుసా..!
Garuda Seva In Tirumala bramhosthavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు గరుడ సేవకు ఎంతో ప్రత్యేకత ఉంది. తన వాహనమైన గరుత్ముంతునిపై స్వామి వారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. గోవిందుడికి ప్రీతికరమైన గరుత్మంతునిపై కొలువుదీరిన స్వామి వారిని దర్శించి కోర్కెలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అయితే గరుడ సేవ రోజు ఏమి జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు.
కలియుగంలో భక్తుల రక్షణ కోసం బ్రహ్మాది దేవతల కోరిక మేరకు శ్రీమహావిష్ణువు తిరుమల కొండపైన వెంకటేశ్వరగా కన్యా మాసంలో శ్రవణా నక్షత్రం నాడు స్వయంవ్యక్తమూర్తిగా అవతరించారు. ఆ రోజును పరిష్కరించని బ్రహ్మదేవుడు ఆ రోజుకు పూర్తయ్యేట్టుగా తొమ్మిది రోజులు ముందు నుంచి శ్రీనివాస భగవానుడికి ఉత్సవాలు నిర్వహించాడు. అనాటి నుంచి నిర్విఘ్నంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సంవత్సరంలో తొమ్మిది రోజులు పాటు జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నభూతో నభవిష్యత్ అనేలా ఉంటాయి.
గరుడ సేవకు ప్రాముఖ్యత
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ధ్వజారోహణంతో వాహన సేవలు ప్రారంభమై తొమ్మిదో రోజు చక్రస్నానం, ధ్వజావరోహణంతో పరిసమాప్తం అవుతాయి. ఇందులో ఈ రోజు జరిగే గరుడ సేవకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గరుడోత్సవం రోజున మూలవిరాట్టుకు అలంకరించే మకర కంఠి, లక్ష్మీకాసుల హారాలు, సహస్రనామ మాలలు అలంకరణ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే పట్టువస్త్రాలను ధరిస్తారు. మద్రాసు నుంచి తీసుకొచ్చే కొత్త గొడుగులు వినియోగిస్తారు. శ్రీవల్లి పుత్తూరు నుంచి తీసుకొచ్చి గోదాదేవి మాలలతో అలంకరణ చేస్తారు. ఇలా అనేక విశేషమైన వాటితో తనకు ఇష్టమైన గరుత్మంతునిపై అధిష్టించిన శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమల ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు.
మోహినీ అవతారంలో.. మోహనాకారుడు
తిరుమల శ్రీవారి అలంకారంలో అతి ముఖ్యమైనది మోహినీ అవతారం. ఐదో రోజు ఉదయం మోహిని రూపం ధరించి రాక్షసులను మోహింపజేసి బంగారు పల్లకిలో సిగ్గులు, సోయగాలు ఒలకబోస్తూ భక్తులకు దర్శనమిస్తాడు వెంకటాచలపతి. శ్రీ మలయప్ప స్వామి వారు ఈ ఉత్సవంలో కూర్చోని దర్శనమిస్తారు. పట్టుచీర, కిరీటంపైన రత్నఖచితమైన సూర్యచంద్ర సావేరిని అలంకరిస్తారు. స్వామి వారి ముక్కుకు వజ్రపు మొక్కుపుడక, ముత్యాల బులాకిని అలంకరిస్తారు. ఊర్ధ్వ హస్తాలతో ఉండే శంఖుచక్రాల స్థానంలో రెండు వికసించిన పద్మాలు కనిపిస్తాయి. వరద భంగిమలో ఉండే స్వామి వారి కుడి చేయి మోహిని అలంకరణలో అభయ హస్తంగా ఉంటుంది. ఈ మనోహరమైన రూపంలో స్వామి వారి భక్తులకు కనువిందు చేస్తుంటాడు. ప్రతి వాహనం వాహన మండపం నుంచి మొదలైతే మోహిని అవతారం మాత్రం పల్లకిలో ఆలయం నుండి బయటకు వస్తుంది.
బంగారు గరుడుడిపై దేవదేవుడు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం ప్రథమం. వేదాలు అయిదు, గరుడ పంచాక్షరి ( ఓం పక్షి స్వాహా) మంత్రంలో అయిదు అక్షరాలు ఉన్నాయి. అందుకే ఐదో రోజు గరుడ సేవ జరుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. గరుడుడు దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా శ్రీనివాసుడిని సేవిస్తున్నాడు. గరుడుడు విష్ణుదేవుని వాహనం, ధ్వజం కూడా అందుకే గరుడ ధ్వజం ఎగరేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాలకు గరుడుడు ఆహ్వానం పలుకుతాడు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. గరుడ సేవ తిలకించేందుకు లక్లలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ కొన్ని సంవత్సరాలుగా పౌర్ణమి రోజు కూడా గరుడ సేవ నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో తిలకించే లేని భక్తులు నెలలో జరిగిన పౌర్ణమి గరుడ సేవ రోజు తిలకించి తరించే భాగ్యం ఉంది.