విదుర నీతి - మీరు వీటిని విడిచిపెడితే, సంపదే సంపద - సాధ్యమేనా?
మానవ జీవితం సుఖప్రదంగా, నీతిగా బతికేందుకు కావల్సిన అనేక విషయాలను విదురుడు ఇక్కడ వివరించాడు. అవి ఎప్పుడైనా ఆచరణీయాలే.
సంజయుడు పాండవ శిబిరం నుంచి తిరిగి వచ్చి పాండవుల మనసులో మాటను ద్రుతరాష్ట్రునికి వివరించి చెప్పిన తర్వాత పాండవుల మనోగతం తెలిసిన ద్రుతరాష్ట్రుడు చాలా బెంగ పడతాడు. అప్పుడు విదురుడు ద్రుతరాష్ట్రునికి ధైర్యం చెబుతూ జీవితానికి అవసరమైన అనేక విషయాల గురించి వివరిస్తాడు. ఈ మొత్తం సంభాషణ భారతంలోని ఉద్యోగ పర్వంలో ఉంటుంది. మానవ జీవితం సుఖప్రదంగా, నీతిగా బతికేందుకు కావల్సిన అనేక విషయాలను విదురుడు ఇక్కడ వివరించాడు. అవి ఎప్పుడైనా ఆచరణీయాలే.
జీవితం సుఖంగా ప్రశాంతంగా సాగాలంటే ఉండాల్సిన వాటిలో సంపద అన్నింటికంటే ముందుంటుంది. సంపద కలిగిన వాడు నిశ్చింతగా జీవితం గడిపేస్తాడు. సంపాదించాలంటే మాత్రం చాలా నిబద్ధత అవసరం. నిజాయితీగా డబ్బు సంపాదించిన వాడు ఎప్పుడూ ఆనందంగా బతుకుతాడని విదురుడు తన నీతి వాక్యాలలో వివరించాడు. అంతేకాదు డబ్బు సంపాదించాలనుకునే కొన్ని దుర్గుణాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ అటువంటి దుర్గుణాలు మనలో ఉంటే వాటిని వెంటనే వదిలించుకోవాలి. అవేంటో చూసేయండి.
సోమరితనం
జీవితం ప్రగతి పథంలో సాగాలంటే సోమరితనం వదులుకోవడం చాలా అవసరం. సోమరితనాన్ని మించిన రోగం మరొకటి లేదు. బద్దకం కారణంగా, కొత్త అవకాశాలు మనం చేజేతులా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పనులు రేపటికి వాయిదా వేయడం ఇవ్వాళ చెయ్యాల్సిన పని మీద శ్రద్ధ లేకపోవడం అభివృద్ధి నిరోధకాలు. సోమరితనం వదులుకోక పోతే లక్ష్మీ కటాక్షం సిద్ధించదు. కనుక సోమరితనాన్ని వెంటనే వదిలించుకోవాలి.
సహనం
సహనం కలిగి ఉండటం గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. అసహనంతో ఉండే వారు పని మీద శ్రద్ద పెట్టలేరు. శ్రద్ధ లేకుండా పనులు విజయవంతంగా సాగవు. సకాలంలో పనులు జరగకపోవడం వల్ల నిరాశ నిస్పృహలు ఆవహిస్తాయి. కాబట్టి డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పనిచేసే వారు సహనంగా ఉండడం అలవరచుకోవాలి. చేసిన పనికి కచ్చితంగా ఫలితం ఉంటుందన్న నమ్మకంతో ఉండాలి. అనుకున్న ఫలితం వచ్చేవరకు ఓపికతో ఉండాలి.
శతృత్వం వద్దు
పనిచేసే చోట అది ఆఫీసు కావచ్చు వ్యాపారం కావచ్చు. ఎవరితోనూ శతృత్వం అంత మంచిది కాదు. ఎందుకంటే శతృవుల మధ్య పనిచేయడం ఎప్పుడైనా అసౌకర్యంగా ఉంటుంది. అటువంటి ఇబ్బందిని కొని తెచ్చుకోవద్దు అని చెబుతోంది విదుర నీతి. కార్యసిద్ధికి సుహృద్భావ వాతావరణం ఉండడం అవసరం. కనుక పని మీద దృష్టి నిలపాలంటే పరిసరాలు స్నేహపూర్వకంగా ఉంచుకోవాలి. అందువల్ల చేసే పని లో విజయం సిద్ధిస్తుంది. ఫలితంగా సంపద సమకూరుతుంది.
స్వార్థం కూడదు
సంపాదించిన ధనం అంతా తానొక్కడే అనుభవించాలనుకునే వాడి దగ్గర లక్ష్మీ ఎక్కువ కాలం నిలిచి ఉండదట. కనుక సంపాదించిన ధనంలో కొంత ఆశ్రిత జనుల కోసం ఖర్చు చేసే వాడి దగ్గరకే మరింత సంపద చేరుతుందట. ఈ మాట నుంచే చల్లిన చెలిమె ఊరుతుంది అనే నానుడి వచ్చింది. అంటే మనకు కలిగిన దానిలో కొంత ఇతరులతో పంచుకోవడం వల్ల ఆనందంతో పాటు సంపద కూడా పెరుగుతుందని విదుర నీతి చెబుతోంది.
కనుక బద్దకాన్ని వీడి, సహనంతో పనిచేసే వారికి సంపదకు కొదవుండదు.
Also Read: భార్య అందంగా ఉంటే అదృష్టమా? విదుర నీతిలో ఏం చెప్పారో తెలుసా?