వినాయకుడి ‘స్వస్తిక్’ చిహ్నానికి ఉన్న పవర్స్ గురించి మీకు తెలుసా?
పూజలో వినాయకుడికి మొదటి పూజ ఎలా ముఖ్యమో పూజ ప్రారంభానికి ముందు స్వస్తిక చిహ్నం వెయ్యడం కూడా అంతే ముఖ్యం. శుభలేఖలు, వ్యాపారులు తమ ఖాతా పుస్తకాలు, ప్రధాన ద్వారం మీద స్వస్తిక చిహ్నం వేస్తుంటారు.
ప్రథమ పూజలందుకునే దైవం వినాయకుడు. గణాధిపతి కనుక ఆయన గణపతి. ఆయన ఆరాధన తర్వాతే ఏ పనైనా మొదలు పెట్టేది. ప్రతి శుభకార్యంలో గణేషుడిని ఆవాహన చేసి పూజిస్తారు. అది భూమి పూజ అయినా, గృహప్రవేశమైనా, వివాహం అయినా, ఉపనయనం అయినా ఎక్కడైనా మొదటి పూజ గణపతికే. కొత్త వస్తువు పూజలో పెట్టకుండా వాడరు చాలా ఇళ్లలో. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.
స్వస్తిక్ చిహ్నం వినాయకుడికి ప్రతీక గా భావిస్తారు. కొత్త వస్తువు ఏది కొన్నా దాని మీద స్వస్తిక్ గుర్తు వేసి పూజించి వాడడం ప్రతీతి. పూజలో వినాయకుడికి మొదటి పూజ ఎలా ముఖ్యమో పూజ ప్రారంభానికి ముందు స్వస్తిక్ చిహ్నం వెయ్యడం కూడా అంతే ముఖ్యం. శుభలేఖలు, వ్యాపారులు తమ ఖాతా పుస్తకాలు, ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ చిహ్నం వేస్తుంటారు.
ఏదైనా పెద్ద పూజా కార్యక్రమం లేదా హవనం వంటివి ప్రారంభించేందుకు ముందు తప్పకుండా స్వస్తిక్ వేస్తారు. ఇది శుభానికి ప్రతీక. స్వస్తిక్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. స్వస్తిక్ లోని నాలుగు భుజాలను గణేషుడి నాలుగు భుజాలుగా భావిస్తారు. స్వస్తిక్లోని నాలుగు చుక్కలు చతుర్విద పురుషార్థాలయిన ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకలు. రెండు వైపులా ఉండే రెండు రేఖలు వినాయకుడి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధిలకు ప్రతీక. ముందున్న రెండు రేఖలు అతడి ఇద్దరు కుమారులు యోగ, క్షేమాలను సూచిస్తాయి. అందువల్ల స్వస్తిక్ చిహ్నాన్ని గణపతి పూర్తి కుటుంబానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ చిహ్నాన్ని వేసి పనులు ప్రారంబిస్తే పనిలో ఆటంకాలు లేకుండా జరుగుతాయని నమ్మకం.
స్వస్తిక్ ను మరో రకంగా కూడా విశ్లేషిస్తారు. సంస్కృతంలో స్వస్తిక్ అంటే సు – మంచి , అస్తి – కలగటం అని స్వస్తిక్ అంటే మంచిని కలిగించేది అని అర్థం. ఓంకారం తర్వాత అంతటి పవిత్రత కలిగిన చిహ్నం స్వస్తిక్. బౌద్దులు, జైనులు కూడా స్వస్తీకాన్ని పవిత్రమైందిగా భావిస్తారు. కేవలం మన దేశంలోనే కాదు అమెరికా, జపాన్ దేశాలలో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. ప్రపంచమంతా కూడా స్వస్తిక్‌ను శుభానికి, అదృష్టానికి ప్రతీక గా భావిస్తారు. స్వస్తిక్ గుర్తు ఉన్న చోటుకి చెడు చేరలేదని నమ్మకం. విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం మాదిరిగా చెడును నివారించి మంచిని కాపాడుతుందని భావిస్తారు.
ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ చిహ్నం వేస్తే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరదని శాస్త్రం చెబుతోంది. ఓంకారంతో పనులు ప్రారంభించి స్వస్తి శబ్దంతో ముగిస్తారు. స్వస్తి చెప్పడం అంటే ఆ పని దిగ్వజయంగా పూర్తిచెయ్యడమని అర్థం.
Also read : Ravana Ten Heads: రావణాసురుడికి పది తలలు ఎందుకు ఉంటాయి? అది ఎవరి వరం?