NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!
100 Years of NTR: ఎన్టీఆర్..ఈ మూడక్షరాల పదం వింటే ప్రతి తెలుగు హృదయం ఉప్పొంగుతుంది. పురాణం పురుషుల పాత్రల్లో దైవత్వం, సౌజన్యం, రాజసం, పరాక్రమం..కనబరచిన ఎన్టీఆర్ ను దైవసమానంగా భావించేవారెందరో...
NTR Satajayanti: నందమూరి తారక రామారావుకు సనాతనధర్మమంటే ఎంతో భక్తిభావం ఉండేది. అందుకే ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలనూ నిబద్ధతగా పాటించేవారు. యన్.టి.రామారావు కులదైవం శ్రీవేంకటేశ్వర స్వామి. చిన్నప్పటి నుంచీ ఆయననే ఆరాధిస్తూ వచ్చారు. యవ్వనంలో ఉన్నప్పుడు త్రిపురనేని రామస్వామి రచనల ప్రభావం కూడా ఉండేది. ఆ ప్రభావంతో సనాతన సంప్రదాయంలోని ఆచారవ్యవహారాలను అధ్యయనం చేశారు. 'అహం బ్రహ్మస్మి' అనే సత్యం తెలిసింది. వైష్ణవ భక్తుడైనా ఆయన మనసులో శంకరుడు కూడా ఉన్నాడు. తానూ, దేవుడు వేరు కాదనే సత్యాన్ని తెలుసుకుని వృత్తిలోనే దైవాన్ని చూడడం మొదలెట్టారు. అందుకే తనని తాను దైవాంశ సంభూతుడనని విశ్వసించేవారు. కేవలం విశ్వసించడమే కాదు అందుకు తగిన సాధనా చేసేవారు. ప్రతి రోజూ బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేవడం, కాలకృత్యాలు, అభ్యంగనస్నానం ముగించుకుని ఇష్టదైవాన్ని ప్రార్థించిన తర్వాత కానీ దినచర్య మొదలు పెట్టేవారు కారు. ఏడుగంటలకే భోజనం, తరువాత మేకప్ వేసుకొని కాలంతో పాటు పరుగుతీస్తూ సెట్ లో ఉండేవారు. షూటింగ్ కు వచ్చేవారు యన్టీఆర్ ను చూసి, తమ టైమ్ సవరించుకున్నామని చెప్పిన రోజులూ ఉన్నాయి. కాలానికి అంత ప్రాధాన్యమిచ్చేవారు రామారావు.
కర్తవ్యమే దైవం!
వృత్తినే దైవంగా భావించి ఆరాధించే యన్టీఆర్, తనను వరించిన పాత్రలకు అనుగుణంగా తన ఆహారవ్యవహారాలు మార్చుకునేవారు. భోజనప్రియులే అయినా పాత్రకు అనువైన ఆహార్యం కోసం కొన్నిసార్లు ఆహారపు అలవాట్లూ మార్చుకునేవారు. కొన్నిసార్లు పూర్తి ఫలాహారం, శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ముఖ్యంగా పురాణ పాత్రలు అందునా దేవతామూర్తుల పాత్రలు ధరించే సమయంలో ఒకపూట భోజనం, నేలమీదే నిద్ర నియమాలు పాటించేవారు. ఆ పాత్ర చిత్రీకరణ పూర్తయ్యేవరకూ ఆ నియమాలు తప్పేవారుకాదు. ఇక రావణ, ఇంద్రజిత్, భీమ, సుయోధన, కీచక పాత్రల పోషణ కోసం నిత్యం తీసుకొనే ఆహారం కంటే ఎక్కువ తినేవారు. ఆ పాత్రల్లో కాస్త లావుగా కనిపిస్తేనే నటన రక్తి కడుతుందన్న ఆయన భావన. నటనను ఓ తపస్సులా భావించిన యన్టీఆర్ మనసు నిత్యం తన వృత్తి, దానికి అనుగుణమైన అంశాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉండేది. నటుడిగానే కాకుండా కథకుడు, నిర్మాత, దర్శకుడుగానూ బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించారు. ఆ సమయంలోకూడా ఇదే సంప్రదాయం అనుసరించేవారు. పౌరాణిక, చారిత్రక పాత్రలు పోషించే సమయంలో వాటికి సంబంధించిన స్క్రిప్ట్ రాసుకునే సమయంలో కూడా నియమనిష్ఠలతో ఉండేవారు.
అంతా దైవానుగ్రహమే
యన్టీఆర్ కులదైవం, ఇష్టదైవం శ్రీవేంకటేశ్వర స్వామి. అందుకే వీలు దొరికినపుడల్లా తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేవారు.ఆ స్వామి కరుణా కటాక్షాలు యన్టీఆర్ పై పుష్కలంగా ఉండేవనే చెప్పాలి. లేదంటే 48 పౌరాణిక చిత్రాలలోనూ, 57 జానపద చిత్రాలలోనూ నటించిన ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించగలరా? సనాతన ధర్మం బోధించే ఇతివృత్తాలలో దేవతామూర్తుల పాత్రలు ధరించి, తెరపై శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీనివాస, శివ, సత్యనారాయణస్వామి వంటి పాత్రలు పోషించి మెప్పించగలిగారంటే అందుకు యన్టీఆర్ కృషి, దీక్షతో పాటు దైవానుగ్రహం కూడా తోడయిందని చెప్పవచ్చు. ఇక శ్రీకృష్ణునిగా తెరపై దాదాపు 25 సార్లు కనిపించడానికి, శ్రీరామ పాత్రలో 12 సార్లు నటించారంటే అంతా ఆ దేవదేవుని అనుగ్రహమే. ఆయన మనసులో దేవుడు కొలవై ఉండడం వల్లే ఇదంతా సాధ్యమైందనేవారూ ఉన్నారు..అందుకే ఆయనలో అంతా దేవుడిని చూసకునేవారు. కొందరైతే NTR ధరించిన శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీనివాస, శివుడి చిత్రపటాలనే ఆరాధించేవారు. ఇక తిరుపతి వెళ్ళిన తెలుగువారిలో అత్యధికులు, తిరుమలలో స్వామివారి దర్శనం కాగానే మద్రాసు వెళ్ళి NTRను చూసి వచ్చేవారు. అప్పట్లో అది ఓ అలవాటుగా మారిపోయింది.
బ్రాహ్మణులంటే గిట్టకపోవడం కాదు!
ప్రతి మనిషి జీవితంలో చాతుర్వర్ణాలు ఉంటాయని, పుట్టుకతో ప్రతిజీవి శూద్రుడేనని, పెరుగుతూ క్షత్రియునిలా సాగుతాడు, గృహస్థాశ్రమంలో కుటుంబం కోసం కూడబెట్టడంలో వైశ్యునిలా మసలుకోవలసి వస్తుంది, చివరలో ఆధ్యాత్మిక భావన పెంపొందించుకుని బ్రహ్మజ్ఞానం సాధించడంతో బ్రాహ్మణుడవుతాడని పురాణాలు బోధించాయి. దీనిని యన్టీఆర్ ప్రగాఢంగా విశ్వసించేవారు. మనిషి తాను ఏ సామాజిక వర్గంలో జన్మించినా, వేదాలు ఘోషించిన మంత్రసాధన చేయవలసి ఉంటుందనీ ఆయన భావించేవారు. అందుకే మంత్రాలు నేర్చుకుని మరీ వల్లిస్తూ ఉండేవారు. యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓసారి తన మంత్రివర్గసభ్యులందరినీ తిరుమలకు తీసుకెళ్ళి అక్కడ మంత్రాలు, వాటి మహిమపై ఆయన ఉపన్యసించారు. ఇక తాను నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్ర రచయిత నాగభైరవ కోటేశ్వరరావు ఇంట్లో NTR పురోహితుడై కళ్యాణం జరిపించారు. అలా ఆయన ప్రతి మనిషి సాధనతో బ్రహ్మజ్ఞానం సాధించవచ్చునని విశ్వసించడమే కాదు, ఆచరించి చూపించారు. అప్పటికే ఆయన రాజకీయాల్లో ఉండడం వల్ల ప్రత్యర్థులు ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఆయనకు బ్రాహ్మణులంటే గిట్టదని, ఆయన 'బ్రాహ్మణద్వేషి' అనే నినాదం లేవదీశారు. అయితే ఆయన ఏ రోజు ప్రత్యేకించి ఏ సామాజిక వర్గాన్నీ ద్వేషించిన దాఖలాలూ లేనేలేవు. చిత్రసీమలో ఎందరో పింగళి, సముద్రాల, వేటూరి వంటి ఎందరో బ్రాహ్మణులను తన చిత్రాలకు పనిచేసేలా చూశారు. మరి ఆయన బ్రాహ్మణద్వేషి ఎలా అవుతారనీ, ఆ సామాజిక వర్గం వారే ప్రశ్నించినా..మళ్లీ మళ్లీ అదేవాదన తెరపైకి తీసుకొచ్చేవారూ లేకపోలేదు.
శివుడిని ఆరాధిస్తూ అడ్డనామాలు
ఏది ఏమైనా యన్టీఆర్ తెరపై పురాణపురుషునిగా నటించడమే కాదు..నిజజీవితంలోనూ అలాగే నడచుకోవాలని ఆశించేవారు. తాను పోషించిన పాత్రల్లోని ప్రభావం తనపై ఉందనీ తరచూ చెప్పేవారు. శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో ఎంతగానో అలరించిన యన్టీఆర్, తన అభిమాన పాత్ర రావణ అని చెప్పుకోవడం వింతగానే ఉంటుంది. అయితే ఆయన రావణునిలోని భక్తిని గ్రహించి, అతని దుశ్చర్యలను వ్యతిరేకించేవారు. ఆ అభిమాన పాత్ర పోషించిన కారణంగానే తిరుమలేశుని భక్తుడైన యన్టీఆర్ లో శివునిపైనా భక్తిభావం పెరిగింది. ఆపై హరిహర భేదం లేదనే తిక్కన సోమయాజి అభిప్రాయాన్ని ఏకీభవించారు. శివుడిని ఆరాధిస్తూ అడ్డనామాలు పెట్టుకున్న దగ్గర నుంచీ యన్టీఆర్ మరింతగా తారాపథంలో పయనించారు. దక్షిణాదిన ఆ రోజుల్లో ఆ స్థాయి వైభవం చూసిన నటుడు మరొకరు లేరనే చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. తనకు అంతటి భాగ్యాన్ని కలిగించిన దేవుణ్ణి నిత్యం స్మరించేవారు.
సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు
తనను అన్నగా, అభిమాననటునిగా, ఆరాధ్య అభినయమూర్తిగా అభిమానించే జనం కోసం ఏదైనా చేయాలన్న భావన 1980లో కలిగింది. దాంతో జనం కోసమే మనం అంటూ సాగిన యన్టీఆర్, తన కుటుంబానికి ఆస్తులు పంపకాలు చేసి, ప్రజాక్షేత్రంలో సాటి మనిషిగా 'తెలుగుదేశం' అధినేతగా అడుగుపెట్టారు. చైతన్యరథంపై తెలుగునేల నలుచెరుగులా పర్యటిస్తున్న సమయంలో ఇన్ని కోట్ల ప్రజానీకం అభిమానం చూరగొనడం నిజంగా దైవానుగ్రహమే అని భావించేవారు. ప్రతిజీవిలోనూ దేవుడు ఉన్నాడన్న గీతాచార్యుని వాక్కును నిజం చేస్తూ అధికారం చేపట్టగానే "ప్రజలే దేవుళ్ళు" అన్నారు యన్టీఆర్. ఆ ప్రజల ఆశీర్వాద బలంతోనే వరుసగా 1983, 1984, 1985 సంవత్సరాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏకైక నాయకునిగా నిలిచారు. చివరగా 1994లో అనూహ్య విజయంతో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని భావించిన యన్టీఆర్ జనం మదిలో ఇప్పటికీ నిలిచి ఉండడానికి ఆయన అభినయమే కాదు, సంప్రదాయానికి గౌరవమిస్తూ ఆచారవ్యవహారాల్లో ఆయన కనబరచిన విశ్వాసమే కారణమని చెప్పుకోవాలి.