Sahasralinga Sirsi: నదిలో వేయి శివ లింగాలు, గంగమ్మ ఒడిలో శంకరుడు -ఆ దృశ్యం చూడాల్సిందే!
Sahasralinga Sirsi: దట్టమైన అడవులు...మెలికలు తిరుగుతూ ప్రవహించే నది..గంగలో అడుగుకో శివలింగం...వాటి ఎదురుగా నంది.. ఆ దృశ్యం ఎంత బావుంటుందో కదా..అలాంటి ప్రదేశం ఎక్కడుందంటే..
Sahasralinga Sirsi: ఉత్తర కర్ణాటకలోని సిర్సీకి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో శాలమాల నదిలో కనిపిస్తుంది ఈ అద్భుతమైన దృశ్యం. దట్టమైన అడవులు గుండా ఈ నది ప్రవహిస్తుంది. సాధారణంగా కార్తీకమాసం, మహాశివరాత్రి సమయాల్లో భారీగా భక్తులు తరలివస్తుంటారు. భక్తితో మాత్రమే కాదు పర్యాటకులను కూడా ఆ ప్రదేశం కట్టిపడేస్తుంది. ఈ నదిలో సహస్ర లింగాలు కొలువుతీరడమే కాదు ప్రతి శివలింగానికి ఎదురుగా నంది కూడా ఉంటుంది.
ఈ సహస్రలింగాలను ఎవరు నిర్మించారు
స్థల పురాణంప్రకారం 1678 -1718 ప్రాంతాల్లో విజయనగర సామ్రాజ్యానికి సామంతుడైన సదాశివరాయలు అనే రాజు ఈ సిర్సి ప్రాంతాన్ని పాలించాడు. ఆయనే ఇక్కడ సహస్రలింగాలు నిర్మించారని చెబుతారు. సంతానం లేని ఆ రాజు పరమశివుడిని ప్రార్థించి...తనకు సంతానం కలిగేలా చేస్తే సహస్ర లింగాలను నిర్మిస్తానని మొక్కుకున్నాడట. కుమార్తె జన్మించడంతో శంకరుడిని ప్రార్థిస్తూ ఇక్కడి రాళ్లపై చిన్న చిన్న శివలింగాలను వాటికి ఎదురుగా నందులను చెక్కించాడు. వెయ్యి లింగాలు చెక్కిస్తానని రాజు మొక్కుకున్నప్పటికీ ఈ నదిలో వేయి కన్నా ఎక్కువే ఉన్నాయట.
Also Read: మార్గశిర మాసంలో ప్రతి గురువారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తథ్యం
అందమైన శిల్పాలు
గంగమ్మ ఒడిలో సేదతీరుతున్న శివయ్య మాత్రమే కాదు..అందంగా చెక్కిన శిల్పాలు ఇక్కడ కనువిందు చేస్తాయి. ఇక్కడ నదీ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి సమయంలో కాస్త ప్రవాహం తగ్గుతుంది..ఆ సమయంలో నదిలోకి దిగి మరీ పూజలు చేస్తారు భక్తులు. కార్తీకమాసం,వనసమారాధన సమయంలో మాత్రం ఒడ్డునుంచే పూజలు చేస్తారు.
Also Read: కార్తీకమాసం ఎప్పటితో ఆఖరు, పోలిపాడ్యమి రోజు ఇలా చేస్తే పుణ్యం మొత్తం మీదే!
ఈ చుట్టుపక్కల దర్శించుకోవాల్సిన ప్రదేశాలెన్నో ఉన్నాయి.
- సహస్ర లింగాలు, అందమైన ప్రకృతితో పాటూ.. 17వశతాబ్దానికి చెందిన శ్రీ మరికాంబ దేవాలయం దర్శించుకోవచ్చు. ఈ విగ్రహం ఒకప్పుడు సిర్సి పట్టణ పొలిమేరలలో ఒక నీటి సరస్సులో ఈ విగ్రహం లభించిందని...1611లో అప్పటి రాజు సదాశివ రావు ఆ చెక్క విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ప్రతిష్టించారని చెబుతారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటోంది అమ్మవారు.
- మరికాంబను దర్శించుకునేందుకు వచ్చేవారు ఆ పక్కనే ఉన్న గోపాలకృష్ణుడిని కూడా దర్శించుకోవచ్చు. ప్రతి గురువారం ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు చెబుతారట. భక్తులు తమ మనసులో ఉన్న ఎన్నో సందేహాలకు పరిష్కారం పొందొచ్చంటారు
- సిర్సికి 30 కి.మీ. దూరంలో సిద్దాపూర్ తాలూకాలో ఉన్నాయి ఊంఛల్లి జలపాతాలు. 1845 లో అప్పటి బ్రీటీష్ ప్రభుత్వ జిల్లా కలెక్టర్ జె.డి. లషింగ్టన్ ఈ జలపాతాలను మొదటిసారిగా గుర్తించారు
దారిద్ర్య దహన శివ స్తోత్రం
విశ్వేశ్వరాయ నరకాంతక కారణయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమఃశ్శివాయ
గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాన్తకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణ నామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణి కుండల మండితాయ
మంజీరపద యుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
పంచాననాయ ఫణిరాజ విభూషనాయ
హేమంశుకాయ భువనత్రయ మండితాయ
ఆనందభూమి వరదాయ తమోమయాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పుజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
రామప్రియాయ రఘునాధ వరప్రదాయ
నామప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేశుపుణ్య భరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీత ప్రియాయ వృషభే శ్వర వాహనాయ
మాతంగకర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ