Ratha Sapthami 2022: సూర్యుడు ఒక్కడే కదా..మరి ద్వాదశ ఆదిత్యులు ఎవరు..
సూర్యుడు అంటే ఒక్కడే అనుకుంటాం..మరి ద్వాదశ ఆదిత్యులు అంటారు వారెవరు అనే సందేహం వచ్చిందా. అంటే పన్నెండు మంది సూర్యులు కాదుకానీ సూర్యుడి తీక్షణతని బట్టి వచ్చిన పేర్లు ఇవి...
ఏడాదిలో ఒక్కో నెలకు సూర్యుడు ఒక్కో ప్రాధాన్యత వహిస్తాడు. తెలుగు నెలల్లో ఆయా సమయంలో సూర్యుడి తీక్షణతని బట్టి ఈ పేర్లు వచ్చాయని చెబుతారు. హిందూ పురాణాలలో "అదితి", కశ్యపుని 12 మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు. మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణ ఉంది. ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఆయా ఆదిత్యుని నామంతో పూజలందుకుంటాడు. సూర్యుడి వెంట ఉండే ఆరుగురు పరిజనులు కూడా నెలని బట్టి మారుతుంటారు.
మహాభారతం, ఆదిపర్వంలోని శ్లోకాలలో (65-15,16) చెప్పిన ద్వాదశ ఆదిత్యుల పేర్లు:
ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచ
భగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథా
ఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతే
జఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః
(ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు)
ఏ నెలలో సూర్యుడిని ఎలా పిలుస్తారు...
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు
3. జ్యేష్టం-మిత్రుడు
4. ఆషాఢం-వరుణుడు
5. శ్రావణంలో ఇంద్రుడు
6. భాద్రపదం-వివస్వంతుడు
7. ఆశ్వయుజం-త్వష్ణ
8. కార్తీకం-విష్ణువు
9. మార్గశిరం- అంశుమంతుడు
10. పుష్యం-భగుడు
11. మాఘం-పూషుడు
12. ఫాల్గుణం-పర్జజన్యుడు
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది. ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి, 2. త్రిష్ణుప్పు, 3. అనుష్టుప్పు, 4. జగతి, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్కు వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. అందుకే భానుడిని ప్రత్యక్షదైవం అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి రోజు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనదని చెబుతారు. ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 8 మంగళవారం వచ్చింది. మాఘ మాసంలో సూర్యుడు "అర్క'' నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిదనిని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా, రథసప్తమి నుంచే ఉత్తరాయణస్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయణం నుంచి భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. అందుకే రథసప్తమి అంత విశేషమైన రోజని చెబుతారు.
Also Read: అప్పులు, అనారోగ్యం, శత్రుబాధలు తొలగించే సూర్యారాధన ...రథసప్తమి ప్రత్యేకత ఇదే..