(Source: ECI/ABP News/ABP Majha)
Ramnami Samaj Tattoos : వీళ్లకి దేహమే రామాలయం - 'రామనామి' తెగ గురించి విన్నారా ఎప్పుడైనా!
Ramnami Samaj Tattoos : ఇష్టదైవంపై తమకున్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటారు. తలనీలాలు ఇస్తారు, కానుకలు సమర్పిస్తారు, వివిధ రకాలుగా మొక్కులు తీర్చుకుంటారు..కానీ రామనామిల తెగ చాలా ప్రత్యేకం
Tattooed followers of Ramnami Samaj
ఆలయంలోకి రానివ్వకుండా ఆపగలరు కానీ వారిలో భక్తిని చెరిపేయగలరా?
గర్భగుడిలో కొలువైన రామయ్యను చూడనివ్వకుండా ఆపినా..శరీరంలో అణువణువు నిండిన రామయ్యను తుడిచేయగలరా?
రాముడి దర్శనానికి ఆలయానికే వెళ్లాలా...తమలోనే ఉన్నాడంటూ దేహం మొత్తాన్ని రామనామంతో నింపేయడం మొదలుపెట్టారు.
రామనామం వినగానే ఆంజనేయుడు ఎలా పులకించిపోతాడో...తమ దేహంపై నిండిన రామనామం చూసి ప్రతిక్షణం భగవంతుడి సన్నిధిలో ఉన్నట్టే భావిస్తారు. వీళ్లంతా ఎక్కడివారంటే...ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన గిరిజన తెగకు చెందిన రామనామీలు. ఈ తెగ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు తమ శరీరం మొత్తాన్ని శ్రీరాముడి పేరుని పచ్చబొట్టుగా పొడిపించుకుంటారు. దీనివెనుక కథలెన్నో...
Also Read: కలియుగం అంతమై మళ్లీ సత్యయుగం ఎప్పుడు ప్రారంభమవుతుంది!
చరిత్రకారులు చెప్పే కథ
అప్పట్లో రామ నామి తెగకు చెందిన గిరిజనులను అంటరానివారుగా చూసేవారు. ఆలయాల్లోకి అడుగుపెట్టనిచ్చేవారు కాదు. ఓ సందర్భంలో శ్రీరాముడి ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఆ గిరిజన పెద్ద ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన శరీరంపై శ్రీరాముడి పేరను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఆలయంలోకి రానివ్వకపోయినా తమనుంచి రాముడిని ఎవ్వరూ వేరుచేయలేరని చాటి చెప్పారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయాన్ని తర్వాత తరాల వారు అనుసరిస్తూ వస్తున్నారు.
Also Read: అయోధ్య రామ మందిరాన్ని నాగర శైలిలోనే ఎందుకు నిర్మించారు? దీనికి అంత ప్రత్యేకత ఉందా?
మరో కథనం ప్రకారం
పరశురామ్ భరద్వాజ్ అనే వ్యక్తి ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడని చెబుతారు. 19 శతాబ్దం మధ్యకాలంలో ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలోని చర్పారా గ్రామంలో జన్మించిన పరశురామ్ చిన్నప్పటి నుంచీ రామాయణ కథలు వింటూ పెరిగాడు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే తండ్రి నుంచి ఈ కథలు వినడం మొదలెట్టాడు. రామాయణంలోని కథలను అర్థం చేసుకోవడం కోసం చదవడం, రాయడం నేర్చుకున్నాడు. అదే సమయంలో కుష్టు వ్యాధి బారిన పడిన పరశురామ్...ఓ సాధువుని కలుసుకున్నాడు. రామాయణ పఠనం ఆపొద్దన్న సాధువు సూచనను పాటించడంతో తన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయట. అదే సమయంలో పరశురామ్ శరీరంపై రామ్ రామ్ అనే పచ్చబొట్టు ఉందని... అప్పటి నుంచీ ఆ తెగవారు అదే అనుసరిస్తున్నారని మరో కథనం.
Also Read: సుఖానికి ఆధారం ఏది - సిగ్గు అంటే ఏంటి, యక్ష ప్రశ్నలు ఇవే!
రామచంద్రుడు ఆవహించినట్టే..
కనురెప్పల మొదలు వళ్లంతా రాముడు ఆవహించినట్టే రామ నామాన్ని వేయించేసుకుంటారు. వీరి జీవితంలో ప్రతి చర్యా రాముడి చుట్టూనే ముడిపడి ఉంటుంది. పలకరింపు మొదలు చేసే ప్రతిపనిలోనూ రాముడిని తలుచుకుంటారు. తలకు పెట్టుకునే టోపీ, తలపాగా, శాలువా ఇలా వాళ్లు వినియోగించే దుస్తులు కూడా అంతా రామమయం. ఏటా జనవరి ఆఖరి వారం ఆరంభంలో భారీగా జాతర నిర్వహిస్తుంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ రాముడి రూపం ఎలా ఉంటుందో వీళ్లకు పెద్దగా తెలియదు..శరీరంలో అణువణువు నిండిన రామనామంతోనే...నిర్గుణ రాముడిని పూజిస్తున్నారు రామనామీలు. ఈ తెగకు చెందిన వారెవ్వరూ మద్యపానం, ధూమపానం చేయరు. కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా పచ్చబొట్టు వేయించుకునే వారి సంఖ్య తగ్గింది కానీ వారి భక్తిలో ఎలాంటి మార్పు లేదు.