Ramayana: ఓ తెల్లవారుజామున జారుతున్న వస్త్రంతో అశోకవనానికి రావణుడు, ఆ సమయంలో లంకాధిపతి - సీత మధ్య డిస్కషన్ ఇదే!
సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్లి లంకలో అశోక వనంలో ఉంచుతాడు. ఓ తెల్లవారుజానువ నిద్రలేచిన రావణుడు జారుతున్న వస్త్రంతో సీత వద్దకు వెళ్లాడు..అప్పడు వాళ్లిద్దరి మధ్యా జరిగిన సంభాషణ ఇది...
సీతాదేవిపై వ్యామోహం పెంచుకున్న రావణుడికి తెల్లవారుజామున ఠక్కున మెలుకువ వచ్చింది. చెప్పలేనంత కామం కలిగింది. అప్పటికప్పుడు ఆభరణాలు ధరించి కనీసం స్నానం కూడా చేయకుండా అశోకవనానికి బయలుదేరాడు. ఆ రాత్రి రావణుడితో క్రీడించిన స్త్రీలంతా కూడా ఆయన వెనుకే బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసం బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకుని వెళ్ళింది , ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మి వెయ్యడం కోసమని ఓ పాత్ర తీసుకెళ్లింది. కొంతమంది ఆయనకి గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు. మరికొందరు రాక్షసులు కత్తులు పట్టుకుని అనుసరించారు. ఇంతమంది పరివారంతో ఓ స్త్రీపట్ల తన కామాన్ని అభివ్యక్తం చేయడానికి బయలుదేరాడు రావణుడు
Also Read: రామ రావణ యుద్ధం తర్వాత యుద్ధభూమిలో జరిగిన సంఘటన ఇది
అప్పటివరకూ శింశుపా వృక్షం కింద కూర్చుని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించింది. ఇలాంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవములు కనపడితే ఏ ప్రమాదమో అని ఆలోచించి స్త్రీ అవయవములు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అవేమీ కనిపించకుండా జాగ్రత్తగా కప్పుకుని మోకాళ్లని ముఖానికి ఆనించి చేతులతో ముడుచుకుని కూర్చుంది. అలాంటి సీతమ్మ దగ్గరకు... తెల్లటి పాలనురుగులాంటి వస్త్రం ధరించి రావణుడు వచ్చాడు. ఆ తేజస్సుని చూడలేక హనుమంతుడు చెట్టు లోపల కొమ్మల్లోకి వెళ్లి ఆకులు అడ్డుపెట్టుకుని రావణుడిని చూశాడు ( సీతాదేవి జాడకోసం ఆంజనేయుడు లంకకు వెళ్లిన సమయంలో జిరిగిన ఘటన ఇది..రావణుడు సీతమ్మ దగ్గరకు వచ్చేసరికి ఆ చెట్టుపైనే ఉన్నాడు హనుమంతుడు).
రావణుడు-సీత మధ్య జరిగిన సంభాషణ ఇది
రావణుడు
సీత! నీకు అందమైన స్తనములు ఉన్నాయి, ఏనుగు తొండాల్లాంటి తొడలు ఉన్నాయి. పిరికిదాన! నీకు ఎందుకు భయం, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే, నేను రాక్షసుడినే. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలని ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు, ఇక్కడ తప్పుచేయడానికి భయపడతావు ఎందుకు. ఎవరన్నా ఉత్తమమైన స్త్రీలు కనపడితే వాళ్ళని తీసుకొచ్చి అనుభవించడం రాక్షసుల ధర్మం. నేను రాక్షసుడిని, నేను నా ధర్మాన్ని పాటించాను. ఏదో నేను తప్పు చేసినట్టు చుస్తావేంటి. మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది, నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను, నువ్వు ఇలాగె చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకుని ఉండుంటే అది నాకు క్షణంలో పని, కాని నేను నిన్ను బలవంతంగా పొందను. నీఅంతట నువ్వు నా పాన్పు చేరాలి. ఎందుకు ఇలా ఒంటిజెడ వేసుకొని, మలినమైన బట్ట కట్టుకుని, భూమి మీద నిద్రపోతూ ఉపవాసాలు చేస్తూ ఉంటావు. నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణములు ఉన్నాయో, వస్త్రములు ఉన్నాయో చూడు. 7000 మంది ఉత్తమకాంతలు నీకు దాసీ జనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు, అడవులు పట్టి తిరుగుతున్నాడు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. దేవతలు కూడా నన్ను ఏమి చెయ్యలేరు, అలాంటిది ఒక నరుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు. నువ్వు హాయిగా తాగు, తిరుగు, కావలసినది అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, నాతో రమించు. నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యమే
Also Read: నిజమైన ఆదిపురుషుడు ఎవరో తెలుసా!
సీతాదేవి
రావణుడి మాటలన్నీ విన్న సీతమ్మ ఓనవ్వు నవ్వి అప్పటికప్పుడు ఓ గడ్డిపరకను అడ్డుపెట్టుకుని ...రావణా! నీ మనస్సు నీవారి యందు పెట్టుకో. నీకు అనేకమంది భార్యలు ఉన్నారు, వాళ్ళతో సుఖంగా ఉండు, పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగైనా బతకొచ్చు కానీ చనిపోవడం నీ చేతుల్లో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్న, చనిపోవాలన్న నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు, కాని ఆ పాపాన్ని అనుభవించవలసిననాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు, శరణు అన్నవాడిని రాముడు ఏమి చెయ్యడు. అయినా ‘ నేను సీతని తీసుకొచ్చాను ‘ అంటావేంటి, నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సుర్యుడికాంతిని వేరు చేసి తేగలవా, వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా, పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా, ఇవన్నీ ఎలా తీ సుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. నేను నిన్ను ఇప్పుడే నా తపఃశక్తి చేత బూడిద చెయ్యగలను కాని నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను.
రావణుడు
సీతాదేవి మాటలు విన్న రావణుడికి ఆగ్రహం వచ్చి ” ఏ స్త్రీయందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీయందు ఉపేక్షించే స్వభావం కూడా ఉంటుంది. నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, సింహాసనం మీద కుర్చోపెడతాను, నా పాన్పు చేరు అంటే ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు, నీకు నా గొప్పతనం ఏంటో తెలియడం లేదు ” అని చెప్పి, అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి ” ఈమెయందు సామమును, దానమును, బేధమును ప్రయోగించండి అని నేకు మీకు చెప్పాను, కాని ఈమె లొంగలేదు, 10 నెలల సమయం అయిపోయింది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది, ఆ సమయంలో సీత నా పాన్పు తనంతట తాను చేరితే సరి, లేకపోతె మీరు సీతని దండించండి ” అన్నాడు.
హెచ్చరించిన రావణుడి భార్య
సీతాదేవి గురించి తెలిసిన రావణుడి భార్య...భర్తను గట్టిగా కౌగలించుకుని నీయందు మనస్సున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందం, నీయందు మనస్సులేని స్త్రీతో ఎందుకు ఈ భోగం అని చెబుతుంది. కానీ రావణుడి మనసు మారదు. ఫలితమే రాముడి చేతిలో రావణ సంహారం.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.