Ram Mandir Ayodhya Muhurat : శూన్యమాసంలో అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తమా!
Ram Mandir Ayodhya:ప్రస్తుతం పుష్యమాసం నడుస్తోంది..దీనిని శూన్యమాసం అంటారు. అంటే ముహూర్తాలు లేని సమయంగా భావిస్తారు. మరి అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు పెట్టిన ముహూర్తం ఏంటి? దీనిపై ఎందుకు చర్చ ?
Ram Mandir Ayodhya Muhurat :అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఈనెల 22న మధ్యాహ్నం 12:29 - 12:30 సమయానికి జరుగుతుందని ముహూర్తం నిర్ణయించారు పండితులు. అయితే ఈ మూహూర్తం మంచిదేనా? పుష్యమాసంలో ప్రతిష్టలు చేయవచ్చా? శూన్యమాసంలో ముహూర్తం ఏంటి? ఇలాంటి ప్రశ్నలెన్నో సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. వాటికి సమాధానమే ఈ కథనం...
చాంద్రమానం - చంద్రుడు గమనం ఆధారంగా నిర్ణయించే ముహూర్తాలు- ప్రతి అమావాస్యకి నెల మారుతుంది
సూర్యమానం - సూర్యుడు రాశి మారితే నెలమారినట్టే..అంటే మకర సంక్రాంతి నుంచి ముహూర్తాలు మొదలైనట్టే
చంద్రమానం పరంగా చూస్తే తెలుగురాష్ట్రాల్లో పుష్యమాసం అవుతుంది..శూన్యమాసంగా పరిగణిస్తారు కానీ..సూర్యమానం ప్రకారం సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ముహూర్తాలు మొదలవుతాయి.
Also Read: పరస్త్రీ నీడ కూడా సోకనివ్వక పోవడం అంటే ఇదే - అందుకే రాముడు ఏకపత్నీవ్రతుడు!
పుష్యమాసంలో ప్రతిష్ట చేయవచ్చా?
దేవతా ప్రతిష్ఠలకు పుష్యమాసం అత్యంత శ్రేష్ఠం అని జ్యోతిష్య శాస్త్ర గ్రంధాల్లో ఉంది
సర్వేషాం పౌషమాఘౌ ద్వౌ విబుధస్థాపనే శుభౌ "
అంటే ఏ దేవతకైనా సరే పుష్యమాసం, మాఘమాసం శుభకరం అని అర్థం. పైగా ఏ నెలలో ప్రతిష్ట చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో వివరిస్తూ
పౌషే రాజ్యవివృద్ధిస్యాత్ ....అన్నారు అంటే.."పుష్యమాసం లో దేవతా ప్రతిష్ఠ జరిగితే ,రాజ్యం విశేషంగా అభివృద్ధి పొందుతుంది
Also Read: భరతుడు వచ్చి పిలిచినా రాముడు అయోధ్యకు ఎందుకు వెళ్లలేదు!
ద్వాదశి తిథి ఎందుకు!
ఈ భూమ్మీద ఉండే ఏ ప్రాణి కూడా ఉపవాసం ఉండని రోజు ద్వాదశి. తిథుల్లో అత్యంత శ్రేష్టమైనది, శ్రీ మహావిష్ణువికి ఇష్టమైన తిథి ద్వాదశి. ఈ తిథికి విష్ణుమూర్తి అధిపతి. సాధారణంగా పాడ్యమి నుంచి పౌర్ణమి, అమావాస్య వరకూ చూసుకుంటే ప్రతి తిథిలోనూ ఏదో ఒక సందర్భంలో ఉపవాస నియమం పాటిస్తారు. చివరకు అమావాస్య రోజు కూడా పితృతర్పణాలు విడిచిపెట్టేవరకూ ఉపవాస నియమం పాటిస్తారు. కానీ కేవలం ద్వాదశి తిథిలో ఉపవాసం ఉండరు.. ఏకాదశి నుంచి ఉన్న ఉపవాసాన్ని విరమించే తిథి. అంటే భోజనం పెట్టే తిథి, అన్నదానం చేసే తిథి. అందుకే ద్వాదశి తిథి అత్యంత విశిష్టమైనది. ఈ తిథిరోజు రామచంద్రుడు అయోధ్యలో కొలువైతే దేశంలో కరువు కాటకాలు ఉండవన్నది పండితుల ఉద్దేశం. అందుకే ఏరికోరి ద్వాదశి తిథిని ముహూర్తంగా నిర్ణయించారు.
Also Read: విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు - ఓ రాయి దేవుడిగా ఎలా మారుతుంది!
మధ్యాహ్నమే ప్రతిష్ట ఎందుకు!
అభిజిత్ - ముహూర్తంలో ఏం చేసినా అక్షయఫలితాన్ని ఇస్తుందని మత్స్యపురాణంలో ఉంది. పైగా ఈ సమయాన్ని శత్రునిర్మూలన సమయం అంటారు. అందుకే దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలన్నీ వదిలిపోయి దేశం సుభిక్షంగా ఉండాలనే అభిజిత్ ముహూర్తం నిర్ణయించారు.
చరలగ్నంలో ఎవరైనా ప్రతిష్ఠ చేస్తారా?
జాతకంలో అయినా, ముహూర్తంలో అయినా లగ్నంలో గురుడుంటే ఇక తిరుగేముంది. ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటంతట అవే సమసిపోతాయి. అందుకే లగ్నంలో గురుబలం ఉన్న ముహూర్తం ఇది. అంటే ఎన్ని దోషాలున్నా పోగొట్టే ముహూర్తం. స్థిర, ద్విస్వభావ లగ్నాలు ఏవీ కూడా మేషలగ్నమంత బలంగా లేవు.
లగ్నే స్థిరే చోభయరాశియుక్తే
నవాంశకే చోభయగే స్థిరే వా ....
చరలగ్నమైనా కానీ నవాంశ లో ద్విస్వభావ లగ్నం అవడం, శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండటం వలన దోషరహితమైనది అని వశిష్ఠ సంహితలో ఉంది. పైగా లగ్నంనుంచి ద్వితీయంలో చంద్రుడు ఉండడం చల్లదనం, శుభప్రదం. ఇలాంటి ముహూర్తం వల్ల రానున్న రోజుల్లో దేశమంతటా ఆద్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందని అంతా మంచే జరుగుతుందన్నది విశిష్ఠ సంహిత పేర్కొంది.
Also Read: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? సనాతన ధర్మంలో దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు?
ఎన్నో వివాదాల తర్వాత రామజన్మభూమిలో రాముడు కొలువుతీరే సమయం ఇది. అత్యంత ప్రధాన ఘట్టం, పెద్ద ఘట్టం. ఇలాంటి క్రతువుకి ముహూర్తం నిర్ణయించేవారు ఎంత మహా పండితులు అయి ఉంటారు..ఎన్ని గ్రంధాలు తిరగేసిన తర్వాత ఈ ముహూర్తం పెట్టి ఉంటారో ఆలోచించండి. ముహూర్తం భాగంలో తెలిసిన గోరంతని కొండంత అనుకుని అంత పెద్ద ప్రతిష్టాపన ముహూర్తంలో వంకలు వెతకడం సరికాదు. రాముడు కొలువు తీరినప్పటి నుంచి దేశం సుభిక్షంగా ఉంటుందని ఆశిద్దాం అన్నది పండితుల మాట....